
ఈశాన్య రాష్ట్ర ప్రజల హృదయాలను గెలుచుకోవడమే తన పెద్ద విజయమని ప్రధాని మోడీ అన్నారు. బీజేపీ ప్రభుత్వాల పనితీరు, పని సంస్కృతి, కార్యకర్తల సేవాభావం అనే త్రివేణి సంగమంతోనే విజయం సాధ్యమైందన్నారు. రాజకీయాల్లో కొత్త సంస్కృతిని ప్రవేశపెట్టామని మోడీ చెప్పారు. ఈశాన్య రాష్ట్రాల్లో బీజేపీ విజయకేతనంతో ఢిల్లీలోని పార్టీ ప్రధాన కార్యాలయంలో బీజేపీ సంబరాలు అంబరాన్నంటాయి. ఈ సందర్భంగా విజయోత్సవ సభ నిర్వహించారు. సేవా భావంతోనే పనిచేయడం తమ ధ్యేయమంటూ మోడీ ప్రసంగించారు. భారత్ ప్రగతి పథంలో దూసుకుపోతోందని చెప్పారు. ప్రపంచమంతా భారత ప్రగతిని కొనియాడుతోందని తెలిపారు.
మహిళా లోకం బీజేపీకి అండగా నిలబడిందని ప్రధాని మోడీ అన్నారు. ఈశాన్య రాష్ట్రాల్లో విజయంతో... బీజేపీ పై చేసిన అన్ని దుష్ఫ్రచారాలను తిప్పికొట్టామన్నారు. క్రైస్తవ రాష్ట్రాల్లోనూ బీజేపీకి గట్టి మద్దతు దొరికిందని ప్రధాని మోడీ కొనియాడారు. కాంగ్రెస్, కమ్యూనిస్టులు కేరళలో ఒకరిపై ఒకరు పోటీ చేస్తున్నట్లు నటిస్తున్నారని ఆయన విమర్శించారు. ఇద్దరూ కలిసి ఉన్నారనేది సత్యమని చెప్పారు. వచ్చే ఎన్నికల్లో కేరళలో బీజేపీ సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడుతుందని ప్రధాని మోడీ ధీమా వ్యక్తం చేశారు.