బీజేపీ 400కు పైగా ఎంపీ సీట్లు గెలవొచ్చు : శ్యామ్ పిట్రోడా

బీజేపీ 400కు పైగా ఎంపీ సీట్లు గెలవొచ్చు :  శ్యామ్ పిట్రోడా

న్యూఢిల్లీ: ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషీన్ల(ఈవీఎం) పనితీరుపై కాంగ్రెస్ నేత శ్యామ్ పిట్రోడా ఆందోళన వ్యక్తం చేశారు. 2024 లోక్​సభ ఎన్నికలు జరిగేలోగా వాటిని సరిచేయాలని, లేదంటే బీజేపీ 400కు పైగా ఎంపీ సీట్లను గెలుచుకుంటుందని ఆయన కామెంట్ చేశారు. గురువారం పీటీఐకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడారు. మళ్లీ తామే గెలుస్తామని బీజేపీ చెప్పుకోవడంపై ప్రశ్నించగా.. ‘‘నిజంగా అది జరిగితే గ్రేట్. కానీ, నిర్ణయించాల్సింది ప్రజలు. అంతకంటే ముందు ఈవీఎంలను సవరించాలి. లేదంటే బీజేపీవాళ్లు చెప్తున్నది నిజం అయితది”అని పిట్రోడా సమాధానం ఇచ్చారు. అయోధ్య రామ మందిరంపై ఇటీవల తాను చేసిన కామెంట్లను వక్రీకరించారని పిట్రోడా మండిపడ్డారు. మతం అనేది వ్యక్తిగత విషయమని, దానిని రాజకీయాలతో ముడిపెట్టొద్దని మరోసారి స్పష్టం చేశారు. 

ఈవీఎంల డిజైన్​ మార్చాల్సిందే.. 

రాహుల్ గాంధీ చేపడుతున్న భారత్ న్యాయ్ యాత్ర గురించి శ్యామ్ పిట్రోడా ప్రస్తావించారు. వచ్చే ఎన్నికలు దేశ భవిష్యత్తుకు సంబంధించినవని, దేశం ఎలా ఉండాలని కోరుకుంటున్నామో ఆలోచించుకోవాలన్నారు. ప్రస్తుతం ఉన్న ఈవీఎంల డిజైన్​ను మార్చాలంటూ సుప్రీం కోర్టు మాజీ జడ్జి మదన్ బి లోకూర్ ఆధ్వర్యంలో వెలువడిన రిపోర్టులోని సూచనలను అమలు చేయాలని పిట్రోడా కోరారు. రిపోర్టులోని ప్రధాన అంశాలపై కేంద్ర ఎలక్షన్ కమిషన్ స్పందించాలని డిమాండ్ చేశారు.