బీజేపీ సభకు రాకుండా ప్రభుత్వం 50వేల మందిని అడ్డుకుంది

బీజేపీ సభకు రాకుండా ప్రభుత్వం 50వేల మందిని అడ్డుకుంది

మునుగోడులో జరిగిన బీజేపీ సభకు ప్రజలు రాకుండా ప్రభుత్వం కుట్రలకు పాల్పడిందని మాజీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఆరోపించారు. సుమారు 50వేల మందిని సభకు రాకుండా అడ్డుకున్నారన్నారు. ఆదివారం రోజు కూడా పనికి ఆహారం పథకం పెట్టి ప్రజలు రాకుండా చేసేందుక ప్రయత్నించారని మండిపడ్డారు. అయితే ప్రభుత్వం ఎన్ని కుట్రలు చేసిన ప్రజలు భారీఎత్తున తరలివచ్చి  సభను గ్రాండ్ సక్సెస్ చేశారని ఆయన చెప్పారు. సభను విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్స్ చెప్పారు. 

ప్రజలు ఎలాంటి ప్రలోభాలకు లొంగొద్దని రాజగోపాల్ రెడ్డి పిలుపునిచ్చారు. ప్రపంచమంతా మునుగోడు వైపు చూస్తోందని.. చరిత్రలో నిలిచిపోయేలా ప్రజలు తీర్పు ఇవ్వబోతున్నారని చెప్పారు. మునుగోడు పోరు ఆత్మగౌరవానికి అహంకానికి మధ్య జరుగుతున్న పోరాటం అన్నారు. కుటుంబ పాలనను అంతమొందించేందుకు తెగించి కొట్లాడతామని స్పష్టం చేశారు. ప్రాణంపోయిన తప్పు చేయనని.. నియోజకవర్గ ప్రజల మద్ధతు తనకున్నట్లు తెలిపారు. ఎన్నికలెప్పుడు వచ్చినా బీజేపీ అధికారంలోకి రావడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. 

సీఎం కేసీఆర్ మునుగోడుకు చేసిందేమిలేదని రాజగోపాల్ రెడ్డి విమర్శించారు. నియోజకవర్గ సమస్యలను విన్నవించేందుకు అపాయింట్మెంట్ అడిగితే ఇవ్వలేదని మండిపడ్డారు. పెండింగ్ ప్రాజెక్టులను ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నారు. ఎన్నికలొస్తే కేసీఆర్ నిధులు విడుదల చేస్తున్నాడు కాబట్టే రిజైన్ చేశానని చెప్పారు. యుద్ధం మొదలైందని..మునుగోడు ప్రజలు పార్టీలకు అతీతంగా పోరాడాలని సూచించారు.