ఇయ్యాల లేదా రేపు బీజేపీ ఫస్ట్​ లిస్ట్.. 60 - 70 మంది పేర్లు  ప్రకటించే అవకాశం

ఇయ్యాల లేదా రేపు బీజేపీ ఫస్ట్​ లిస్ట్.. 60 - 70 మంది పేర్లు  ప్రకటించే అవకాశం
  • ఎంపికపై జవదేకర్ నివాసంలో కోర్ కమిటీ మీటింగ్ 
  • నేడు ఆమోదం తెలపనున్న బీజేపీ పార్లమెంటరీ పార్టీ బోర్డు

న్యూఢిల్లీ, వెలుగు: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి బీజేపి అభ్యర్థుల ఎంపిక కసరత్తు తుది దశకు చేరింది. అయితే ఇవాళ సాయంత్రం లేదా రేపు 60 నుంచి-70 సీట్లతో మొదటి లిస్ట్​విడుదల కానుంది. ఈ మేరకు ఇవాళ బీజేపీ పార్లమెంటరీ పార్టీ బోర్డ(సీఈసీ) భేటీ కానుంది. దీన్ దయాళ్ మార్గ్ లోని పార్టీ హెడ్ ఆఫీసులో సాయంత్రం సీఈసీ భేటీ కానుంది. ఈ సమావేశంలోప్రధాని మోదీ, పార్టీ చీఫ్ నడ్డా, పార్లమెంటరీ పార్టీ బోర్డు సభ్యులు అమిత్ షా, లక్ష్మణ్, తెలంగాణ, మధ్యప్రదేశ్, రాజస్థాన్ కు చెందిన ఇతర ముఖ్యనేతలు హాజరుకానున్నారు. ఈ సందర్భంగా మధ్య ప్రదేశ్, రాజస్థాన్ తో పాటు తెలంగాణ కు చెందిన అభ్యర్థుల ఎంపికపై నిర్ణయం తీసుకోనున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి.

అనంతరం ఏ క్షణమైనా లిస్ట్ రిలీజ్ కావొచ్చు. కాగా తెలంగాణ కన్నా ముందే ఎన్నికల షెడ్యూల్ ఉన్న ఇతర నాలుగు రాష్ట్రాలపై తొలుత బీజేపీ ఫోకస్ పెట్టింది. మధ్య ప్రదేశ్, రాజస్థాన్ రాష్ట్రాల్లో  దశల వారీగా అభ్యర్థులను ప్రకటించింది. 119 స్థానాలు ఉన్న తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు దాదాపు 60 నుంచి 70 మందితో కూడిన ఫస్ట్ లిస్ట్ ను రిలీజ్ చేసే అవకాశం ఉంది. ఇందులో పార్టీ సిట్టింగ్ ఎంపీలు, ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు, ఇతర ముఖ్య నేతలకు చోటు దక్కే చాన్స్​ ఉంది. 

మార్పులు సూచించిన నడ్డా..

బీజేపీ పార్లమెంటరీ పార్టీ భేటీ నేపథ్యంలో గురువారం బీజేపీ రాష్ట్ర కోర్ కమిటీ భేటీ అయింది. బీజేపీ రాష్ట్ర ఎన్నికల ఇన్​చార్జి ప్రకాశ్ జవదేకర్ నివాసంలో సమావేశమైంది. తుగ్లక్ లేన్ 2 లోని ఆయన నివాసంలో మధ్యాహ్నం ఒంటి గంట నుంచి 4 గంటల వరకు భేటీ సాగింది. రాష్ట్ర ఇన్​చార్జి తరుణ్ చుగ్, అధ్యక్షుడు కిషన్ రెడ్డి, పార్లమెంటరీ పార్టీ మెంబర్ కె. లక్ష్మణ్, బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ, ఎంపీ బండి సంజయ్, ఎమ్మెల్యే ఈటల, ఎన్నికల సహ ఇన్​చార్జి సునీల్ బన్సల్ తదితరులు సమావేశంలో పాల్గొన్నారు. సుదీర్ఘంగా సాగిన ఈ భేటీలో రాష్ట్రంలోని 119 స్థానాలకు సంబంధించిన అభ్యర్థుల ఎంపికపై కసరత్తు చేశారు.

సాయంత్రం పార్టీ చీఫ్ నడ్డాతో రాష్ట్ర కోర్ కమిటీ భేటీ అయింది. ఈ సమావేశంలో కేంద్ర హోం మంత్రి అమిత్​షా కూడా పాల్గొన్నారు. అభ్యర్థుల ఎంపికకు సంబంధించిన ఫైనల్ లిస్ట్ పై చర్చించింది. భిన్న అభిప్రాయాలు, క్లిష్టంగా ఉన్న స్థానాలపై నడ్డా పలు మార్పులు చేర్పులు సూచించినట్లు తెలిసింది. దీని ఆధారంగా ఇవాళ ఉదయం మరోసారి నడ్డాతో రాష్ట్ర కమిటీ భేటీ కానున్నట్లు సమాచారం. ఈ భేటీలో ఫైనల్ లిస్ట్ రూపొందించి, సాయంత్రం జరిగే పార్లమెంటరీ పార్టీ బోర్డు మీటింగ్ లో ఈ లిస్ట్ కు ఆమోద ముద్ర వేసే ఆస్కారం ఉంది.