బీజేపీ సంగ్రామ సభ గ్రాండ్​ సక్సెస్​

బీజేపీ సంగ్రామ సభ గ్రాండ్​ సక్సెస్​

డప్పు వాయిద్యాలు, నృత్యాలతో లీడర్లకు ఘన స్వాగతం

జగిత్యాల/ కరీంనగర్, వెలుగు : బీజేపీ స్టేట్ చీఫ్ బండి సంజయ్ చేపట్టిన ప్రజా సంగ్రామ యాత్ర ముగింపు సభ సక్సెస్  కావ డంతో ఆ పార్టీ శ్రేణుల్లో నయా జోష్​ నెలకొంది. నిర్మల్ జిల్లా ముథోల్ నియోజకవర్గంలోని బైంసా నుంచి నవంబర్​27న బండి పాదయాత్ర ప్రారంభించారు. కరీంనగర్ నుంచి జగిత్యాల మీదుగా నిర్మల్ జిల్లాకు వెళ్తున్న సంజయ్ ను జగిత్యాల రూరల్ మండలం తాటిపెల్లిలో పోలీసులు అరెస్టు చేశారు. అనంతరం కోర్టు పర్మిషన్ తో ప్రారంభమైన పాదయాత్ర ముథోల్, కోరుట్ల, జగిత్యాల, వేములవాడ, చొప్పదండి, కరీంనగర్ నియోజకవర్గాల్లోని బీజేపీ శ్రేణుల్లో నయా జోష్ నింపింది. గురువారం కరీంనగర్ ఎస్ఆర్ఆర్ కాలేజ్ గ్రౌండ్ లో నిర్వహించిన ప్రజా సంగ్రామ యాత్ర ముగింపు సభకు భారీగా ప్రజలు హాజరయ్యారు. 

బుల్డోజర్లపై నుంచి పూలు వేస్తూ..

సంగ్రామ యాత్రలో భాగంగా కరీంనగర్ సిటీ ఎంట్రన్స్ లో పుష్పాలతో లీడర్లకు వెల్ కమ్ చెప్పారు. గురువారం కొత్తపల్లి నుంచి కరీంనగర్ వస్తున్న బండి సంజయ్​పాదయాత్ర రేకుర్తి వద్ద కరీంనగర్ నగరపాలక సంస్థలో ఎంటరయ్యింది. రేకుర్తి నుంచి దాదాపు కిలోమీటర్ మేర బీజేపీ మైనార్టీ విభాగం ఆధ్వర్యంలో రోడ్డుకు ఇరువైపులా బుల్డోజర్లను ఏర్పాటు చేశారు. వాటిపై నుంచి పువ్వులు వేస్తూ బండి సంజయ్ కు స్వాగతం పలికారు. దీంతో రోడ్డంతా పూలమయమైంది. దారివెంట పెద్దసంఖ్యలో ప్రజలు యాత్రకు సంఘీభావం తెలుపుతూ ఎస్ఆర్ఆర్ కాలేజీ వరకు నడిచారు.  

1,403 కిలోమీటర్ల పాదయాత్ర..

నిర్మల్ జిల్లా బైంసా నుంచి కరీంనగర్ వరకు బండి సంజయ్ మొత్తం 1,403 కిలోమీటర్ల పాదయాత్ర చేశారు. ముగింపు సభలో జేపీ నడ్డాతోపాటు స్టేట్ వ్యవహారాల ఇన్​చార్జి తరుణ్ చుగ్, ఎంపీ అర్వింద్, మాజీ ఎంపీలు వివేక్ వెంకట స్వామి, నర్సయ్య గౌడ్, మాజీ ఎమ్మెల్యేలు బోడిగె శోభ, బాబు మోహన్, లీడర్లు పాల్గొన్నారు. 

నడ్డా కాన్వాయ్ అడ్డగించే ప్రయత్నం..

ప్రజా సంగ్రామ యాత్ర ముగింపు సభలో మాట్లాడి తిరిగి వెళ్తున్న బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాను స్థానిక తెలంగాణ చౌక్ వద్ద బీఆర్ఎస్ కార్యకర్తలు అడ్డగించే ప్రయత్నం చేశారు. రాష్ట్రానికి నిధులు ఇవ్వకుండా కేంద్ర ప్రభుత్వం వివక్ష చూపుతుందని ఆగ్రహించారు. గో బ్యాక్ నడ్డా.. అంటూ ప్ల కార్డులు పట్టుకొని నినాదాలు చేశారు.

సభకు భారీగా తరలిన శ్రేణులు

గంగాధర: కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ చేపట్టిన ఐదో విడత ప్రజా సంగ్రామ యాత్ర ముగింపు బహిరంగ సభకు గంగాధర, కొత్తపల్లి మండలాల నుంచి బీజేపీ నాయకులు, ప్రజలు అధిక సంఖ్యలో తరలివెళ్లారు. గంగాధర మండలం నుంచి సుమారు 3 వందల మంది, కొత్తపల్లి నుంచి 250 మంది వెళ్లారు.  

కోనరావుపేట: బండి సంజయ్ పాదయాత్ర ముగింపు సభకు కోనరావుపేట మండల బీజేపీ నాయకులు భారీగా తరలి వెళ్లారు. మండలాధ్యక్షుడు రామచంద్రం, జిల్లా కార్యదర్శి సురేందర్ రావు ఆధ్వర్యంలో కార్యకర్తలు, ప్రజలు బస్సులో వెళ్లారు. కార్యక్రమంలో మండల ప్రధాన కార్యదర్శులు వెలిశాల రవి, బొల్లారం తిరుపతి, ఓబీసీ మండలాధ్యక్షుడు నాగార్జున, అంబోజీ లక్ష్మీనారాయణ,ఎంపీటీసీ రేణుక, పర్శరాములు ఉన్నారు. 

చొప్పదండి: ప్రజా సంగ్రామ యాత్ర ముగింపు సందర్భంగా కరీంనగర్ లో ఏర్పాటు చేసిన బహిరంగ సభకు చొప్పదండి మండలాధ్యక్షుడు మావురం సుదర్శన్ రెడ్డి ఆధ్వర్యంలో లీడర్లు, కార్యకర్తలు, ప్రజలు భారీగా తరలివెళ్లారు. వారిలో జిల్లా ప్రధాన కార్యదర్శి లక్ష్మీనారాయణ, కిసాన్ సెల్ రాష్ట్ర ఉపాధ్యక్షులు కృష్ణారెడ్డి, ఎంపీటీసీలు కోటేష్, తిరుపతి, సంపత్, నర్సింహా రెడ్డి, కళ్యాణ్, వీరేశం, రాము తదితరులు ఉన్నారు.