సంఘ్ నేతలతో బీఎల్ సంతోష్ భేటీ

సంఘ్ నేతలతో బీఎల్ సంతోష్ భేటీ

హైదరాబాద్, వెలుగు: హైదరాబాద్ బర్కత్ పురలోని ఆర్ఎస్ఎస్ ప్రధాన కార్యాలయంలో సోమవారం బీజేపీ జాతీయ సంస్థాగత ప్రధాన కార్యదర్శి బీఎల్ సంతోష్ ఆర్ఎస్ఎస్ ముఖ్య నేతలతో భేటీ అయ్యారు. ఉదయం నుంచి రాత్రి వరకు రెండు దఫాలుగా సమావేశాలు జరిగాయి. బీజేపీ తరఫున సంతోష్ తో పాటు రాష్ట్రానికి చెందిన పార్టీ నేతలు కిషన్ రెడ్డి, లక్ష్మణ్, బండి సంజయ్, డీకే అరుణ, పార్టీ రాష్ట్ర ఇన్​చార్జ్​లు సునీల్ బన్సల్, తరుణ్ చుగ్, సంస్థాగత రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చంద్రశేఖర్ తివారి పాల్గొన్నారు.

సంఘ్ నుంచి కాచం రమేష్, శ్రీధర్ ఇతర నేతలు హాజరయ్యారు. రాష్ట్రంలో బీజేపీ మెజార్టీ ఎంపీ సీట్లు గెలుచుకోవడంపై సంఘ్ వద్ద ఉన్న ప్రణాళికలు, మోదీ పాలనపై జనం నాడీ తదితర అంశాలపై సంఘ్ నేతల నుంచి బీఎల్ సంతోష్ ఫీడ్ బ్యాక్ తీసుకున్నట్లు సమాచారం. ఎంపీ ఎన్నికల్లో బీజేపీతో కలిసి పని చేయడానికి సూచనలు, సలహాలు తీసుకున్నట్లు తెలిసింది.

లోక్ సభ ఎన్నికల్లో ఏ సీటు నుంచి ఎవరిని అభ్యర్థిగా ప్రకటిస్తారు? వారి నేపథ్యం ఏంటీ? అని సంఘ్ నేతలు కూడా అడిగి తెలుసుకున్నారని సమాచారం. సంఘ్ నేపథ్యం ఉన్న కొందరు నేతలకు లోక్ సభ టికెట్లు ఇవ్వాలనే అంశంపై చర్చించినట్టు తెలిసింది. బీజేపీ ఎల్పీ లీడర్ విషయంలోనూ సంఘ్ నేపథ్యం ఉన్న వారిని పరిగణనలోకి తీసుకోవాలని ఆర్ఎస్ఎస్ నేతలు సంతోష్ వద్ద ప్రస్తావించినట్లు తెలిసింది. చేరికల సందర్భంలో రాజకీయ అవసరాలకు ఇస్తున్న ప్రాధాన్యంతో పాటు ఆ నేతల వ్యక్తిత్వాన్నీ పరిగణనలోకి తీసుకోవాలని కోరినట్లు సమాచారం.