
- వచ్చే నెలలో మధ్యప్రదేశ్ నుంచి రానున్న క్యాచర్స్ టీమ్
- పట్టుకున్న జింకలను రిహాబిలిటేషన్ సెంటర్‌కు తరలించనున్న సిబ్బంది
- అక్కడ అలవాటు పడిన తర్వాత అమ్రాబాద్, కవ్వాల్, కిన్నెరసాని అడవులకు తరలింపు
మహబూబ్‌నగర్, వెలుగు : నారాయణపేట జిల్లాలోని కృష్ణానది పరివాహక ప్రాంతంలో కృష్ణ జింక (బ్లాక్ బక్)ల బారి నుంచి పంటలను రక్షించేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఈ ప్రాంతంలో వేల సంఖ్యలో జింకలు తిరుగుతుండడంతో పంటలు నాశనం అవుతున్నాయి. తమ సమస్యను పరిష్కరించాలని రైతులు పలుమార్లు ప్రజాప్రతినిధులు, ఆఫీసర్లను కలిశారు. దీంతో స్పందించిన ప్రభుత్వం కృష్ణ జింకలను పట్టి నల్లమల, కవ్వాల్ అడవుల్లోకి తరలించాలని నిర్ణయించింది.
అయితే ముందుగా ముడుమాల్ వద్ద ప్రత్యేకంగా రిహాబిలిటేషన్ సెంటర్ ఏర్పాటు చేసి జింకలను అందులోకి తరలించాలని, అక్కడ అలవాటు పడిన తర్వాత ఫారెస్ట్‌లో వదలాలని నిర్ణయించారు. రిహాబిలిటేషన్ సెంటర్ ఏర్పాటు కోసం 74 ఎకరాల ప్రభుత్వ భూమితో పాటు అవసరమైన ఏర్పాట్లు చేసేందుకు సుమారు రూ.3 కోట్లను సైతం ప్రభుత్వం
కేటాయించింది.
74.10 ఎకరాల్లో రిహాబిలిటేషన్ సెంటర్
నారాయణపేట జిల్లాలో కృష్ణా నది పరివాహక ప్రాంతంలో పదేండ్ల కింద వందల సంఖ్యలో ఉన్న కృష్ణ జింకలు ప్రస్తుతం పది వేలకు చేరినట్లు ఫారెస్ట్ ఆఫీసర్లు చెబుతున్నారు. దీంతో అవి ఆహారం కోసం మాగనూరు, కృష్ణ, నర్వ, మరికల్, మక్తల్, నారాయణపేట ప్రాంతాల్లోని వ్యవసాయ పొలాలు, పత్తి చేన్లపై దండెత్తుతుండడంతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. దీంతో తమ సమస్యను పరిష్కరించాలని పలుమార్లు కలెక్టర్‌ను కలిసి విన్నవించారు. స్పందించిన కలెక్టర్ జింకల రిహాబిలిటేషన్ సెంటర్ల ఏర్పాటుకు చర్యలు చేపట్టారు.
ఇందుకోసం కృష్ణా మండలంలోని ముడుమాల్ గ్రామం వద్ద 192 సర్వే నంబర్‌లోని 18.29 ఎకరాలు, 194 సర్వే నంబర్‌లోని 55.21 ఎకరాలు కలిపి మొత్తం 74.10 ఎకరాల్లో రిహాబిలిటేషన్ సెంటర్ ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఇందులో భాగంగా ఈ భూములను ఫారెస్ట్ డిపార్ట్‌మెంట్‌కు అప్పగించాలని రెవెన్యూ ఆఫీసర్లను ఆదేశించారు. దీంతో భూమిని అప్పగిస్తూ ఇటీవల ఆర్డర్స్ జారీ చేశారు. ఫారెస్ట్ డిపార్ట్‌మెంట్‌కు అప్పగించే భూమిని హద్దులను ఎర్రజెండాలతో మార్కింగ్ చేశారు. అలాగే జీపీఎస్ రికార్డ్ కూడా పూర్తి చేశారు.
మధ్యప్రదేశ్ నుంచి క్యాచర్స్ టీమ్
కృష్ణ జింకలను పట్టుకునేందుకు ప్రత్యేకంగా మధ్యప్రదేశ్ నుంచి 12 మందితో కూడిన టీమ్ వచ్చే నెల మొదటి వారంలో నారాయణపేటకు రానుంది. వీరు నవంబర్ చివరి వారం వరకు కృష్ణా నదీ పరివాహకంలో పర్యటిస్తూ జింకలను పట్టుకుంటారు. ఈ సమయంలో స్థానిక ఫారెస్ట్ డిపార్ట్‌మెంట్‌కు చెందిన సిబ్బందికి సైతం ట్రైనింగ్ ఇవ్వనున్నారు. మధ్యప్రదేశ్ టీమ్ తిరిగి వెళ్లిన తర్వాత స్థానిక సిబ్బందే జింకలను పట్టుకోనున్నారు.
ముందుగా మినీ రిహాబిలిటేషన్ సెంటర్లకు తరలింపు
రీహ్యాబిటేషన్ సెంటర్ ఏర్పాటులో భాగంగా.. ముందుగా కృష్ణ జింకలు ఏయే ప్రాంతాల్లో ఎక్కువగా తిరుగుతున్నాయో గుర్తించనున్నారు. తర్వాత ఆ ప్రాంతంలో ఎకర, రెండు ఎకరాలు ఉన్న రైతులను గుర్తించి వారి నుంచి ఏడాదికి భూమిని లీజుకు తీసుకుంటారు. ఇందుకోసం ఏడాది పంట ఖర్చును రైతులకు చెల్లిస్తారు. తర్వాత ఆ భూమి చుట్టూ ఫెన్సింగ్ ఏర్పాటు చేసి జింకలను అందులో వదులుతారు. అవి ఆ ప్రాంతంలో అలవాటుపడిన తర్వాత ముడుమాల్ వద్ద ఏర్పాటు చేయబోయే రిహాబిలిటేషన్ సెంటర్‌కు తరలిస్తారు. 10, 12 జింకలు జమ అయిన తర్వాత వాటిని ప్రత్యేక వాహనంలో అమ్రాబాద్, , కవ్వాల్, కిన్నెరసాని అడవులకు తరలించనున్నారు.
పర్యాటకుల కోసం ఏర్పాట్లు
రిహాబిలిటేషన్ సెంటర్‌కు తరలించిన జింకలను చూసేందుకు పర్యాటకులకు సైతం అనుమతి ఇవ్వనున్నారు. ఫారెస్ట్ డిపార్ట్‌మెంట్ ఆధ్వర్యంలో సఫారి వాహనాలను ఏర్పాటు చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. మధ్యలో పర్యాటకులు సేదతీయడానికి కుర్చీలు, వాచ్‌టవర్లను ఏర్పాటు చేయనున్నారు. ఈ 74 ఎకరాల్లోనే వెంకప్ప చెరువు కూడా ఉంటుంది. ఈ చెరువు ఆధారంగా.. జింకల మేత కోసం గడ్డి మైదానాలను అభివృద్ధి చేసేందుకు చర్యలు చేపడుతున్నారు.