దేశంలో 40వేలు దాటిన బ్లాక్ ఫంగస్ కేసులు

 దేశంలో 40వేలు దాటిన బ్లాక్ ఫంగస్ కేసులు

న్యూఢిల్లీ: కరోనా కేసుల తగ్గుముఖంతో ఊపిరి పీల్చుకుంటున్న సమయంలో బ్లాక్ ఫంగస్ కేసుల పెరుగుదల ఆందోళన కలిగిస్తోంది. దేశ వ్యాప్తంగా బ్లాక్ ఫంగస్ కేసుల సంఖ్య 40వేల మార్కు దాటేసింది. ఈ విషయాన్ని స్వయానా కేంద్ర వైద్యఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్ధన్ ప్రకటించారు. సోమవారం వీడియో కాన్ఫరెన్స్ లో ఆయన మాట్లాడుతూ కరోనా కేసుల వ్యాప్తి కట్టడికి తీసుకోవాల్సిన తాజా చర్యలు, వ్యాక్సినేషన్ సందర్భంగా తీసుకోవాల్సిన చర్యల గురించి వివరించారు. అలాగే  బ్లాక్ ఫంగస్ కేసుల గురించి మాట్లాడుతూ ఇప్పటి వరకు బ్లాక్ ఫంగస్ బారిన పడిన 13 వేల 083 మంది 18 నుంచి 45 ఏళ్లలోపు వారేనని(32 శాతం) గుర్తించామన్నారు. అలాగే మరో 42 శాం మంది అంటే 17 వేల 464 మంది 45 నుంచి 60 ఏళ్ల లోపు వారు. మిగిలిన 24 శాతం మంది 60 ఏళ్లు దాటిన వారున్నారని ఆయన వివరించారు. అయితే వ్యాక్సిన్లు సమర్ధవంతంగానే పనిచేస్తున్నట్లు నివేదికలు అందుతున్నాయని.. కాబట్టి చికిత్స విషయంలో ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు.  
సెకండ్ వేవ్ ఉధృతి ఇంకా తగ్గలేదు
దేశ వ్యాప్తంగా అనేక రాష్ట్రాల్లో కర్ఫ్యూ ఆంక్షలు సడలిస్తున్న నేపధ్యంలో అప్రమత్తంగా ఉండాలని కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి ఆయా రాష్ట్ర ప్రభుత్వాలకు హెచ్చరికలు చేశారు. ఇప్పటికీ 80కి పైగా జిల్లాల్లో పాజిటివిటీ అధికంగానే నమోదవుతోందని ఆయన గుర్తు చేశారు. కోవిడ్ మార్గదర్శకాలు, నిబంధనలు కట్టుదిట్టంగా అమలు చేయకపోతే ప్రమాదం పొంచి ఉందని జాతీయ అంటు వ్యాధుల నివారణ కేంద్రం (ఎన్ సి డి సి) డైరెక్టర్ సుజీత్ కుమార్ సింగ్ సమగ్రమైన నివేదిక ఇచ్చారని ఆయన తెలిపారు. కేరళ, మహారాష్ట్ర, తమిళనాడు, పశ్చిమ బెంగాల్, ఒడిశా రాష్ట్రాల్లో యాక్టివ్ కేసులు బాగా ఉన్నాయని ఆయన పేర్కొన్నారు.