వరంగల్: వర్ధన్నపేట మండలం ఇల్లందలో మరోసారి క్షుద్రపూజలు కలకలం రేపాయి. ఊరి శివారులో గుర్తు తెలియని వ్యక్తులు క్షుద్ర పూజలు చేసినట్లు గ్రామస్తులు తెలిపారు. కార్తీక పౌర్ణమి రోజున కూడా ఇదే ప్రాంతంలో జంతు బలి ఇచ్చి దుండగులు క్షుద్రపూజలు చేశారు. మరోమారు క్షుద్రపూజలు చేసిన దృశ్యాలు కనిపించడంతో స్థానికులు భయాందోళనలో చెందారు. క్షుద్ర పూజలు చేస్తే ఆరోగ్యం మెరుగుపడుతుందని నమ్మేవారూ ఇప్పటికీ ఉన్నారు. ఇల్లందలో క్షుద్ర పూజలు చేసిన స్థలంలో పెద్ద ఎత్తున ముగ్గులు వేసి.. అందులో నిమ్మకాయలు, పసుపు కుంకుమ చల్లినట్లు కనిపించింది.
అమావాస్య, పౌర్ణమి ఇతరత్రా రోజుల్లో క్షుద్ర పూజలు ఎక్కువగా చేస్తుంటారు. కొందరు ఆరోగ్యం మెరుగుపడుతుందని, మరికొందరు గుప్త నిధుల కోసం ఆశపడి.. ఇంకొందరు గిట్టని వాళ్లపై బాణామతి, చేతబడి చేయిస్తూ.. ఈ క్షుద్ర పూజలను ప్రోత్సహించే జనం ఊళ్లలో ఇప్పటికీ ఉన్నారు. శాస్త్ర సాంకేతిక రంగాల్లో ఎంత అభివృద్ధి చెందుతున్నా మారుమూల పల్లెల్లో ఈ మూఢ నమ్మకాలు ఇప్పటికీ పాతుకుపోయి ఉండటం ఆందోళన కలిగించే విషయం.
ఈ మూఢ నమ్మకాల మత్తులో కన్న బిడ్డలను చంపుకున్న తల్లిదండ్రుల గురించి కూడా గతంలో వినే ఉంటారు. నల్ల కోడిని బలి ఇవ్వడం, జంతు బలులు, నర బలులు.. ఇలాంటివన్నీ ఈ క్షుద్ర పూజల్లో చేస్తుంటారు. ప్రజల్లో ఉండే బలహీనతలను సొమ్ము చేసుకునేందుకు కొందరు ఇలా క్షుద్ర పూజలు చేసే మంత్రగాళ్లుగా మారి అందినకాడికి దోచుకుంటుంటారు.
