బ్లడ్ శాంపిల్ మార్చేశారు

బ్లడ్ శాంపిల్ మార్చేశారు
  •  పుణె మైనర్ ర్యాష్ డ్రైవింగ్ కేసులో ట్విస్ట్
  • నిందితుడి బ్లడ్​ శాంపిల్స్​ను రెండు ఆస్పత్రులకు పంపిన పోలీసులు
  • ఓ చోట మద్యం తాగినట్టు, మరో చోట తాగనట్టు రిపోర్టు
  • అనుమానంతో డీఎన్​ఏ టెస్ట్​కు శాంపిల్స్​.. అవి వేర్వేరు వ్యక్తులవని తేలడంతో డాక్టర్ల తీరుపై ఆరా
  • డాక్టర్లే బ్లడ్​ శాంపిల్స్​ మార్చినట్టు ఇన్వెస్టిగేషన్​లో వెల్లడి
  • ఇద్దరు డాక్టర్లు సహా ప్యూన్ అరెస్టు

పుణె : పుణె మైనర్ ర్యాష్ డ్రైవింగ్ కేసు రోజుకో మలుపు తిరుగుతున్నది. యాక్సిడెంట్ జరిగిన రోజు నిందితుడి నుంచి సేకరించిన బ్లడ్ శాంపిల్ ను డాక్టర్లు మార్చేశారని పోలీసులు గుర్తించారు. మైనర్ బ్లడ్ శాంపిల్ ను చెత్త డబ్బాలో పడేసి, మరో వ్యక్తి నుంచి సేకరించిన బ్లడ్ శాంపిల్ ను ఫోరెన్సిక్ ల్యాబ్ కు పంపించారని దర్యాప్తులో తేల్చారు. దీనికి కారణమైన సాసూన్ హాస్పిటల్ ఫోరెన్సిక్ హెడ్ డాక్టర్ అజయ్ తవాడే, చీఫ్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ శ్రీహరి హల్నూర్, ఆస్పత్రిలో ప్యూన్ గా పని చేస్తున్న మరో వ్యక్తిని పుణె క్రైమ్ బ్రాంచ్ పోలీసులు సోమవారం అరెస్టు చేశారు.

 ‘‘ఈ నెల 19న ఉదయం 11 గంటల టైమ్ లో మైనర్ బ్లడ్ శాంపిల్ ను సాసూన్ హాస్పిటల్ లో తీసుకున్నారు. అయితే నిందితుడి బ్లడ్ శాంపిల్ ను మార్చేశారు. అసలు శాంపిల్ ను చెత్త డబ్బాలో పడేసి, వేరే శాంపిల్ ను ఫోరెన్సిక్ ల్యాబ్ కు పంపించారు. డాక్టర్ అజయ్ తవాడే ఆదేశాలతో డాక్టర్ శ్రీహరి హల్నూరు ఇదంతా చేశారు. ఆ రోజు డాక్టర్ అజయ్ తవాడేతో నిందితుడి తండ్రి ఫోన్ లో మాట్లాడినట్టు గుర్తించాం. ఇద్దరు డాక్టర్ల ఫోన్లను స్వాధీనం చేసుకున్నాం” అని పుణె పోలీస్ కమిషనర్ అమితేశ్ కుమార్ తెలిపారు. కాగా, మద్యం తాగిన మైనర్ లగ్జరీ కారులో ర్యాష్ డ్రైవింగ్ చేసి బైక్ ను ఢీకొట్టడంతో ఇద్దరు సాఫ్ట్ వేర్ ఇంజినీర్లు చనిపోయారు. 

రెండు చోట్ల టెస్టు.. 

నిందితుడు మద్యం తాగలేదని ఫోరెన్సిక్ రిపోర్టులో రావడంతో పోలీసులకు అనుమా నం వచ్చి దర్యాప్తు చేపట్టారు. ఓ బార్ లో నింది తుడు మద్యం తాగినట్టు సీసీటీవీ ఫుటేజీ ద్వారా తెలుసుకున్నారు. డాక్టర్లే బ్లడ్ శాంపిల్ మార్చేసినట్టు గుర్తించారు. ‘‘నిందితుడి బ్లడ్ శాంపిల్ ను రెండు ఆస్పత్రుల్లో టెస్టు కోసం ఇచ్చాం. ఒకచోట ఆల్కహాల్ తాగినట్టు, మరో చోట ఆల్కహాల్ తాగనట్టుగా వచ్చింది.

 దీంతో మాకు అనుమానం వచ్చి, ఆ రెండు శాంపిల్స్ కు డీఎన్ఏ టెస్టు చేయించాం. అవి రెండు వేర్వేరు వ్యక్తులవి అని తేలింది” అని పోలీస్ వర్గాలు పేర్కొన్నాయి. కాగా, నిందితుడి తండ్రి బడా వ్యాపారవేత్త. కొడు కును కాపాడుకు నేందుకు ఆయన తీవ్ర ప్రయ త్నాలు చేశారు. ఈ కేసులో నిందితుడి తండ్రి, తాతను కూడా పోలీసులు ఇప్పటికే అరెస్టు చేశారు.