ఆలయానికి దాతలు ఇచ్చిన భూములకు బోర్డులు

ఆలయానికి దాతలు ఇచ్చిన భూములకు బోర్డులు

యాదగిరిగుట్ట, వెలుగు : తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా పలుచోట్ల యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామి దేవస్థానానికి దాతలు ఇచ్చిన భూములకు ఆలయ బోర్డులు ఏర్పాటు చేసే కార్యక్రమాన్ని శుక్రవాaరం ఆలయ ఆఫీసర్లు చేపట్టారు. ఆలయ ఈవో గీతారెడ్డి, దాతల సమక్షంలో బోర్డులు ఏర్పాటు చేశారు. రంగారెడ్డి జిల్లా మొయినాబాద్​ మండలం  నజీబ్ నగర్, కనకమామిడి గ్రామాల్లో ఆ గ్రామాలకు చెందిన గూడూరు నరేందర్, షాపురం బాల్ రెడ్డి అనే దాతలు యాదగిరిగుట్ట దేవస్థానానికి 2.27 ఎకరాల భూమిని ఇచ్చారు. 

ఆ భూమికి దాతల సమక్షంలో ఆలయ ఆఫీసర్లు ఆలయ బోర్డులు ఏర్పాటు చేశారు. దాతలు ఇచ్చిన భూమిలో రెవెన్యూ ఆఫీసర్లతో సర్వే చేపించామని, త్వరలో దాతలు ఇచ్చిన భూమి చుట్టూ ఫెన్సింగ్ ఏర్పాటు చేయనున్నట్లు ఆలయ ఈవో గీతారెడ్డి తెలిపారు. అనంతరం దాతలను సన్మానించారు. యాదగిరిగుట్ట ఆలయ ప్రసాదాన్ని అందజేసి స్వామివారి శేషవస్త్రాలతో సన్మానించారు. కార్యక్రమంలో ఆలయ ఏఈవో శ్రావణ్ కుమార్, సూపరింటెండెంట్ సత్యనారాయణ శర్మ, డీఈ మహిపాల్ రెడ్డి, సర్పంచ్ జనార్ధన్ రెడ్డి, తహసీల్దార్ అశోక్ కుమార్ తదితరులు ఉన్నారు.