బుకావు (కాంగో): తూర్పు కాంగోలోని కివు సరస్సులో పెను విషాదం చోటుచేసుకుంది. వ్యాపారులతో వెళ్తున్న ఓ పడవ అకస్మాత్తుగా బోల్తా పడడంతో 12 మంది ప్రాణాలు కోల్పోయారు. పదుల సంఖ్యలో ప్రయాణికులు గల్లంతైనట్లు అధికారులు ఆదివారం వెల్లడించారు. దక్షిణ కివు ప్రొవిన్స్‌లోని ఇద్జ్వీ ద్వీపం వద్ద శనివారం రాత్రి ఈ ప్రమాదం జరిగినట్లు కిషెకే గ్రామానికి చెందిన ముఖ్య అధికారి ఫెలిక్స్ హబిరాగి తెలిపారు.
ప్రమాదం జరిగే సమయంలో పడవలో 50 మందికి పైగా ప్రయాణికులు ఉన్నట్లు ఆయన పేర్కొన్నారు. ఇప్పటివరకు 15 మందిని రక్షించామని కానీ ప్రమాదానికి అసలు కారణం ఏంటనేది ఇంకా తెలియరాలేదని అధికారులు తెలిపారు. ఇద్జ్వీ ద్వీపంలోని బ్వినా నుంచి బోజాకు చేపల వ్యాపారులు, సరకులతో ఈ పడవ బయలుదేరినట్లు స్థానిక అడ్మినిస్ట్రేటర్ ముహిండో న్తాంబుకా పాస్కల్ వెల్లడించారు.
