నాకు న్యాయం చేయండి.. బోడపాటి షేజల్

నాకు న్యాయం చేయండి.. బోడపాటి షేజల్
  •  బీఆర్ఎస్ ఎంపీల వాహనాన్ని అడ్డుకున్న షేజల్

న్యూఢిల్లీ, వెలుగు: బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య వ్యవహారంలో తనకు న్యాయం చేయాలని ఆరిజన్ కంపెనీ ప్రతినిధి, బాధితురాలు బోడపాటి షేజల్ బీఆర్ఎస్ ఎంపీల వెహికల్​ను అడ్డుకున్నారు. బుధవారం ఢిల్లీ తెలంగాణ భవన్​లో బోనాల ఉత్సవాల్లో పాల్గొని వెళ్తున్న ఎంపీలు కేఆర్ సురేశ్ రెడ్డి, వెంకటేశ్ నేతకి తన ఆవేదన చెప్పుకునేందుకు ప్రయత్నించారు. ఎంపీలు కారులో ఎక్కి బయల్దేరడంతో.. కారుకు అడ్డుగా నిల్చుని నిరసన వ్యక్తం చేశారు. న్యాయం కోసం తాను చేస్తున్న నిరాహార దీక్షను పట్టించుకోరా? అని షేజల్ నిలదీశారు. దీంతో కాసేపు అక్కడ పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. 

షేజల్, ఆరిజన్ నిర్వాహకుడు ఆదినారాయణ నిరసన కొనసాగించడంతో.. ఎంపీ సురేశ్ రెడ్డి కారు దిగివచ్చి వారితో మాట్లాడారు. ఈ సందర్భంగా దుర్గం చిన్నయ్య అనుచరుల నుంచి రోజూ బెదిరింపు మెసేజ్​లు, ఫోన్లు వస్తున్నాయని షేజల్ ఆవేదన వ్యక్తం చేశారు. న్యాయం చేయాలని ఆదినారాయణ ఎంపీ కాళ్లు పట్టుకుని బతిమిలాడారు. స్పందించిన సురేశ్ రెడ్డి.. తనకు ఆధారాలు ఇస్తే మాట్లాడి సమస్య పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. అయితే సురేశ్ రెడ్డి అపాయింట్​మెంట్ ఇస్తానని తర్వాత కాల్ చేస్తే పట్టించుకోవట్లేదని ఆమె ఆందోళన వ్యక్తం చేశారు.