ఉమ్మడి జిల్లా నుంచి ముగ్గురు ప్రభుత్వ సలహాదారులు

ఉమ్మడి జిల్లా నుంచి ముగ్గురు ప్రభుత్వ సలహాదారులు
  • ఇప్పటికే  సలహాదారులుగా ఇద్దరు
  • తాజాగా బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్​రెడ్డి నియామకం
  • మంత్రి పదవి ఆశించిన షబ్బీర్​అలీ, సుదర్శన్​రెడ్డికి సలహాదారు పోస్టుతో సరి

కామారెడ్డి, వెలుగు : ప్రభుత్వ సలహాదారులుగా ఉమ్మడి జిల్లా నుంచి ముగ్గురికి ప్రాతినిధ్యం దక్కింది. ఇప్పటికే  ప్రభుత్వ సలహాదారులుగా ఇద్దరు నేతలు కొనసాగుతుండగా, శుక్రవారం బోధన్ ఎమ్మెల్యే, పార్టీ సీనియర్​ నేత  పి.సుదర్శన్​రెడ్డిని ప్రభుత్వ సలహాదారుగా నియమిస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి.  కాంగ్రెస్​ సర్కారు అధికారంలోకి వచ్చినప్పటి నుంచి  కేబినెట్​లో బెర్తు  కోసం తీవ్ర ప్రయత్నాలు చేసిన షబ్బీర్​అలీ, సుదర్శన్​రెడ్డిలకు సలహాదారు పోస్టులతో సరిపెట్టారు. రాష్ర్ట కేబినెట్​లో ఉమ్మడి జిల్లా నుంచి ఇప్పటి వరకు ఎవరికీ ప్రాతినిధ్యం లేదు.   ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో  9 అసెంబ్లీ నియోజకవర్గాల్లో  గత ఎన్నికల్లో అధికార కాంగ్రెస్ 4 చోట్ల విజయం సాధించింది. 

  బోధన్​ నుంచి సుదర్శన్​రెడ్డి, ఎల్లారెడ్డి నుంచి మదన్ మోహన్​రావు, జుక్కల్ నుంచి  తోట లక్ష్మీకాంతారావు,  నిజామాబాద్ రూరల్​ నుంచి  భూపతిరెడ్డి విజయం సాధించారు. కామారెడ్డిలో రేవంత్​రెడ్డి పోటీ చేయగా ఇక్కడ సీటు ఆశించిన షబ్బీర్​అలీకి అధిష్టానవర్గం నిజామాబాద్ అర్బన్​ నుంచి పోటీకి దింపింది.  ఇక్కడ షబ్బీర్​అలీ ఓటమి చెందారు. రాష్ర్ట మంత్రిలో బోధన్​ నుంచి గెలుపొందిన పి. సుదర్శన్​రెడ్డితో పాటు ఓటమి చెందిన షబ్బీర్​అలీ మైనార్టీ కోటాలో మంత్రి పదవిని ఆశించారు. ఫస్ట్ విడతలో  జిల్లా నుంచి ఎవరికీ చోటు దక్కలేదు.  మరో విడతలో అవకాశం వస్తుందని చూశారు.  సుదర్శన్​రెడ్డి, షబ్బీర్​అలీలు సెకండ్ ఫేజ్​లో కూడా భంగపాటుకు గురయ్యారు.   

సీనియర్లుగా.. 

 షబ్బీర్​అలీ, సుదర్శన్​రెడ్డిలు గతంలో మంత్రులుగా పని చేసిన అనుభవం ఉంది. పార్టీలో సీనియర్ నేతలు. ఉమ్మడి జిల్లా నుంచి బోధన్ ఎమ్మెల్యేకు  మంత్రి పదవి వస్తుందని చివరి వరకు  చూశారు.  రేవంత్​రెడ్డితో పాటు, అధిష్టాన వర్గం దగ్గర కూడా ప్రయత్నాలు జరిగాయి. సీనియర్​ నేత కావటం,  మంత్రిగా పని చేసిన అనుభం, సామాజిక అంశం కలిసి వస్తుందని భావించారు.   సర్దుబాటు కాకపోవటం, రెడ్డి సామాజిక వర్గం నుంచి మంత్రి పదవిని ఎక్కువ మంది ఆశించటంతో రెండో విడతలో కూడా పదవి దక్కలేదు.  మైనార్టీ వర్గాల్లో సీనియర్ నేత,  2 పర్యాయాలు మంత్రిగా పని చేసిన అనుభవం దృష్ట్యా షబ్బీర్​అలీకి మంత్రి పదవి ఇచ్చి ఎమ్మెల్సీ చేస్తారని భావించారు. ఆయన అనుచరులు పదవి వస్తుందని ప్రచారం కూడా చేశారు.  చివరకు మైనార్టీ కోటాలో శుక్రవారం అజారుద్దీన్​కు అవకాశం ఇచ్చారు.   మంత్రి పదవుల్లో 2 సీట్లు మాత్రం  ఖాళీగా ఉన్నా తీవ్ర పోటీఉంది.  ఉమ్మడి జిల్లాలో ఒకరికైనా పదవి వస్తుందని భావించారు. కానీ చివరకు మరోసారి  సుదర్శన్​రెడ్డికి సలహాదారు పోస్టుతో సరిపెట్టారు.  

 

సలహాదారులు.. 

కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన  కొద్ది రోజులకే షబ్బీర్​అలీకి ప్రభుత్వ సలహాదారుగా నియమించారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ సంక్షేమ శాఖల సలహాదారుగా ఆయనను నియమించారు.  తర్వాత కొన్ని రోజులకు  బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్​రెడ్డిని  వ్యవసాయ శాఖ సలహాదారుగా  ప్రభుత్వం నియమించింది. మంత్రి పదవి ఖాయమనుకున్న  పి.సుదర్శన్​రెడ్డికి కూడా సలహాదారుగా నియమిస్తూ శుక్రవారం ప్రభుత్వ ఉత్తర్వులు జారీ చేసింది. ఈయనకు క్యాబినెట్​ హోదా కల్పించారు.  దీంతో ఇప్పుడు ఉమ్మడి జిల్లా నుంచి  సలహాదారుల సంఖ్య  మూడుకు చేరినట్లయ్యింది.  ఈయనకు కేబినెట్ ర్యాంక్​తో పాటు,   మంత్రి వర్గ మీటింగ్​లో కూడా పాల్గొనే అవకాశం ఇచ్చారు.