
బోయింగ్ విమాన ప్రమాదాలను శోధించే కొద్దీ తయారీలో కంపెనీ లోపాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. ఖర్చు తక్కువవుతుందనే కక్కుర్తితో సంస్థ మనుషుల ప్రాణాలతో చెలగాటమాడిన తీరును ‘బ్లూమ్ బర్గ్’ వెలుగులోకి తెచ్చింది. ‘న్యూ జనరేషన్’ పేరుతో తెచ్చిన 737 మ్యాక్స్ నుంచి 787 డ్రీమ్ లైనర్ విమానాలకు ఔట్ సోర్సింగ్ ఇంజనీర్లతో సాఫ్ట్ వేర్ ను డెవలప్ చేయించినట్లు వెల్లడించింది. వీళ్లకు గంటకు తక్కువలో తక్కువగా 600 రూపాయలు ఇవ్వొచ్చనే కక్కుర్తే ఇందుకు కారణమని వివరించింది. ఇలా ప్రోగ్రామింగ్, టెస్టింగ్ చేసిన వాళ్లలో కొత్తగా గ్రాడ్యుయేషన్ పూర్తి చేసుకున్న వాళ్లు కూడా ఉన్నారని చెప్పింది. వీళ్లు ఇండియన్ కంపెనీలైన హెచ్ సీఎల్ టెక్నాలజీస్, సియంట్ లిమిటెడ్ లో ఉద్యోగులుగా పని చేసుకుంటున్నారని తెలిపింది. పార్ట్ టైం వర్క్ గా బోయింగ్ ఆఫర్ ను తీసుకుని, పని ఫినిష్ చేశారని వివరించింది.
ఈ సాఫ్ట్ వేర్ పని తీరులో లోపం వల్ల 2018 అక్టోబర్ లో లయర్ ఎయిర్ లైన్స్ వాడుతున్న బోయింగ్ 737 మ్యాక్స్ విమానం కూలిపోయింది. 2019లో ఇథియోపియన్ ఎయిర్ లైన్ కు చెందిన 737 మ్యాక్స్ సముద్రంలో పడిపోయింది. ఈ రెండు ఘటనల్లో 346 మంది ప్రాణాలు కోల్పోయారు. రెండో ప్రమాదం అనంతరం ప్రపంచవ్యాప్తంగా చాలా ఎయిర్ లైన్స్ 737 మ్యాక్స్ వాడకాన్ని ఆపేశాయి. దీని వల్ల బోయింగ్ ఒక బిలియన్ డాలర్లు నష్టపోయింది. ఇండియాలో కూడా 737 మ్యాక్స్ విమానాలను చాలాసార్లు ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేశారు. ఇతర ఎయిర్ లైన్స్ తీసుకుంటున్న నిర్ణయాలను అనుసరించి, వాటి వాడకాన్ని నిలిపేశారు.
సీనియర్ ఇంజనీర్లకు పింక్ స్లిప్స్..
దాదాపు 200 మంది కూర్చొన్న మీటింగ్ లో మేనేజర్ ఇకపై సీనియర్ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ల అవసరం లేదని ప్రకటించారు. దాంతో మేం అందరం షాక్ తిన్నామని బోయింగ్ లో సాఫ్ట్ వేర్ ఇంజనీర్ గా పని చేసిన మార్క్ రాబిన్ తెలిపారు. హెచ్ సీఎల్ కు చెందిన వాళ్లు చేసిన కోడింగ్ చాలాసార్లు సరిగ్గా ఉండేది కాదని చెప్పారు. మొదటి నుంచి చివరకు పూర్తిగా చెక్ చేసి, మార్పులు చేస్తే కానీ దాన్ని రన్ చేయలేకపోయే వాళ్లమని వెల్లడించారు. బయట వాళ్లతో పని చేయించుకునేటప్పుడు సేఫ్టీని కంపెనీ ప్రధాన లక్ష్యంగా తీసుకుంటుందని కంపెనీ అధికార ప్రతినిధి చెప్పారు. ఎన్నో దశాబ్దాలుగా ప్రపంచవ్యాప్తంగా ఉన్న కోడర్లతో బోయింగ్ పని చేయించుకుంటోందని వివరించారు.