బొగత జలపాతం చూసేందుకు వెళ్లే.. ప్లాన్లో ఉంటే క్యాన్సిల్ చేసుకోండి.. ఎందుకంటే..

బొగత జలపాతం చూసేందుకు వెళ్లే.. ప్లాన్లో ఉంటే క్యాన్సిల్ చేసుకోండి.. ఎందుకంటే..

ములుగు: ములుగు జిల్లాను భారీ వర్షాలు ముంచెత్తుతున్నాయి. దీంతో.. బొగత జలపాతం కనువిందు చేస్తోంది. అయితే.. బొగత జలపాతం ఉన్న ములుగు అటవీ ప్రాంతంలో భారీ వర్షాలు కురుస్తుండటంతో ఇలాంటి సమయంలో జలపాత సందర్శన సురక్షితం కాదని అటవీ శాఖ అధికారులు ప్రజలను హెచ్చరించారు. బొగత జలపాతం దగ్గరకు రావొద్దని సూచించారు. జులై 26 వరకూ బొగత జలపాత సందర్శనపై తాత్కాలిక నిషేధం విధించారు. బొగత జలపాతం సందర్శనపై తాత్కాలిక నిషేధం విధించిన అటవీ శాఖ అధికారులు ముత్యాలధార, కొంగల, మామిడిలొద్ది, కృష్ణపురంలో ఉన్న జలపాతాల సందర్శనపై శాశ్వత నిషేధం విధించడం గమనార్హం.

బొగత జలపాతం వరంగల్ నుంచి 140 కిలోమీటర్ల దూరంలో ఉంది. వాజేడు మండల పరిధిలో ములుగు పట్టణానికి 90 కిలోమీటర్ల దూరంలో బొగత జలపాతం ఉంది. అయితే.. కాస్త వర్షాలు తగ్గాక జలపాతం అందాలను చూసేందుకు వెళ్లడం బెటర్. ములుగు, జయశంకర్​ భూపాలపల్లి జిల్లాలను వాతావరణ శాఖ ఇంకా హై అలర్ట్లోనే పెట్టింది. ఆ రెండు జిల్లాల్లో గురువారం కూడా అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఎక్కువగా ఉందని హెచ్చరించింది. ఆ రెండు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. అయితే, పరిస్థితులను బట్టి అది రెడ్ అలర్ట్​ కిందకూ మారే అవకాశాలూ లేకపోలేదని నిపుణులు చెబుతున్నారు.

మంగళవారం రాత్రి నుంచి కురుస్తున్న వర్షంతో ములుగు జిల్లా అతలాకుతలమైంది. బుధవారం ఉదయం 8.30 వరకే ములుగు జిల్లా వెంకటాపురంలో 25.5 సెంటీమీటర్ల అత్యధిక వర్షపాతం నమోదైంది. అదే జిల్లా ఏటూరు నాగారంలో 18.5, మంగపేటలో 15.9, ఆలుబాకలో 14.9 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఆ జిల్లాలోని దాదాపు అన్ని ప్రాంతాల్లోనూ భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిశాయి. బుధవారం ఉదయం నుంచి కూడా అత్యంత భారీ వర్షాలు కురిశాయి.

ALSO READ | ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండండి: సీఎం రేవంత్ ఆదేశం

బుధవారం ఉదయం 8.30 నుంచి రాత్రి వరకు అక్కడ 21.5 సెంటీమీటర్ల వర్షపాతం రికార్డు అయింది. బుధవారం కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా బెజ్జూరులో 23.3 సెం.మీ వర్షపాతం నమోదైంది. ములుగు జిల్లా మంగపేటలో 12 సెం.మీ, కుమ్రంభీం ఆసిఫాబాద్​ జిల్లా రవీంద్ర నగర్​లో 10.7, ములుగు జిల్లా ఏటూరు నాగారంలో 10.5, ఆసిఫాబాద్ జిల్లా కౌటాలలో 10.2, ములుగు జిల్లా ఆలుబాకలో 10.1, కరీంనగర్​లో 9.3, గంగిపల్లిలో 7.5, భద్రాద్రి జిల్లా మణుగూరులో 7 సెంటీమీటర్ల చొప్పున వర్షం పడింది.