ఆమనగల్లు 7వ వార్డులో బోగస్ ఓట్ల కలకలం

ఆమనగల్లు 7వ వార్డులో బోగస్ ఓట్ల కలకలం
  • రాష్ట్ర ఎన్నికల కమిషన్, హైకోర్టును ఆశ్రయించిన అభ్యర్థి

 ఆమనగల్లు, వెలుగు : ఆమనగల్లు మున్సిపాలిటీ పరిధిలోని 7వ వార్డులో బోగస్ ఓట్ల నమోదుపై కాంగ్రెస్ పోటీ అభ్యర్థి కృష్ణ నాయక్ గురువారం రాష్ట్ర ఎన్నికల కమిషన్ కార్యాలయంలో ఫిర్యాదు చేశారు. మున్సిపల్ రికార్డుల్లో లేని ఇంటి నెంబర్ (14-182) పై 15 ఓట్లను అక్రమంగా నమోదు చేసి, ఎన్నికల్లో తన విజయ అవకాశాలను దెబ్బతీశారని ఆయన ఆరోపించారు.

ఈ వార్డులో 956 మంది ఓటర్లకు గాను 751 ఓట్లు పోలవ్వగా, తాను కేవలం 23 ఓట్ల తేడాతో ఓటమి పాలయ్యానని, అందుకే న్యాయం కోసం బుధవారం హైకోర్టును కూడా ఆశ్రయించినట్లు వివరించారు. మున్సిపల్ అధికారుల రికార్డుల్లో లేని ఇంటి నెంబర్లపై ఓట్లు ఎలా నమోదయ్యాయో విచారణ జరిపించాలని ఆయన కోరారు. ఫిర్యాదు చేసిన వారిలో రాష్ట్ర ఆదివాసీ సంఘం నాయకులు లింగం నాయక్, కోటయ్య నాయక్, రామచంద్రి, శ్రీను పాల్గొన్నారు.