క్లాప్​ బాయ్​ హీరో అయ్యిండు

క్లాప్​ బాయ్​ హీరో అయ్యిండు

రీసెంట్​గా ‘షేర్ షా’ సినిమాతో హిట్ కొట్టాడు బాలీవుడ్ యంగ్ హీరో సిద్ధార్థ్​ మల్హోత్రా. ఈ ఆరడుగుల అందగాడు మొదట మోడల్​గా కెరీర్​ స్టార్ట్ చేశాడు​. ఇప్పటికే టీవీ షోలు, ఇంటర్నేషనల్​ ప్రొడక్ట్స్​ యాడ్స్​, సూపర్​హిట్ సినిమాలతో బాలీవుడ్​లో తనకంటూ ఒక ప్లేస్​ సంపాదించుకున్నాడు. అప్పుడప్పుడు పెట్ క్యాంపెయిన్స్​లో పార్టిసిపేట్ చేసి జంతువుల​ మీద తనకి ఉన్న ప్రేమను తెలియజేస్తుంటాడు. టీనేజ్​లోనే ఇండస్ట్రీలోకి అడుగుపెట్టినా.. తనకి అవకాశాలు మాత్రం అంత ఈజీగా రాలేదు. ప్రస్తుతం ‘మిషన్​ మజ్ను’ అనే సినిమాతో మన ముందుకు రాబోతున్న ఈ యంగ్ హీరో పర్సనల్ లైఫ్​, సినిమా కెరీర్​ గురించి...

హ్యాండ్​సమ్​ లుక్​తో, ఫిట్​గా కనిపించే బాడీతో అట్రాక్ట్​ చేసే ఈ హీరో మొదట మోడలింగ్ ట్రై చేశాడు. కానీ, అందులో చాలాసార్లు రిజెక్ట్ అయ్యాడు సిద్ధార్థ్​ మల్హోత్రా. 1985, జనవరి 16న ఢిల్లీలో పుట్టిన సిద్ధార్థ్​, బీకాం వరకు చదివాడు. సిద్ధార్థ్​ నాన్న సునీల్​ నేవీలో పని చేసి రిటైర్​ అయ్యాడు. అమ్మ రిమ్మా హోమ్ మేకర్. సిద్ధార్థ్​కి అన్న, అక్క ఉన్నారు. అన్న హర్షద్, బ్యాంక్​ జాబ్ చేస్తాడు​. సిద్ధార్థ్​కి చిన్నప్పటి నుంచే డ్రామా, డాన్స్​ షోల్లో పార్టిసిపేట్ చేయడమంటే ఇష్టం. వాళ్ల అమ్మానాన్నలు మాత్రం తనని ఇంజినీర్​గా చూడాలనుకున్నారు. కానీ, స్కూల్​, కాలేజీల్లో చదివేటప్పుడు స్టడీస్ అంటే ఇంట్రస్ట్ లేక స్పోర్ట్స్​ ఆడటానికి వెళ్లేవాడు సిద్ధార్థ్​. ఇప్పుడైతే ఖాళీ దొరికితే కార్టూన్స్ వేస్తాడు లేదంటే జిమ్ చేస్తాడు. 

మోడల్​గా, క్లాప్​​ బాయ్​గా...

టీనేజ్​లోనే మోడల్​గా కెరీర్​ స్టార్ట్ చేశాడు సిద్ధార్థ్. ఇంటర్నేషనల్ డిజైనర్​ రాబర్టో కవల్లీ అడ్వర్టైజ్​మెంట్ క్యాంపెయిన్​లోనూ పని చేశాడు. దాంతో తనకి రెడ్ బుక్​, గ్లాడ్రాగ్, మెన్స్​హెల్త్ వంటి మంచి పేరున్న మ్యాగజైన్స్​లో కనిపించే అవకాశాలు వచ్చాయి. ఆ తర్వాత 2006లో ‘ధర్తి కా వీర్​ యోధ పృథ్వీరాజ్​ చౌహాన్​’ అనే టీవీ సీరియల్​ ద్వారా బుల్లితెరకు పరిచయం అయ్యాడు సిద్ధార్థ్. 2007లో మిస్టర్ గుజరాత్ టైటిల్, గ్లాడ్రాగ్స్​ మెగా మోడల్ కాంపిటీషన్​లో సెకండ్ రన్నరప్​గా నిలిచాడు. 
అనుభవ్​ సిన్హా చేస్తున్న సినిమా ఆడిషన్స్​కి 22 వ ఏట వెళ్లాడు. సెలక్ట్ అయ్యాడు, దానికోసం ముంబై షిఫ్ట్​ అయ్యాడు. కానీ, ఆ సినిమా మాత్రం పట్టాలెక్కలేదు. షారుక్​ ఖాన్​ నటించిన ‘రా–వన్’ సినిమాకి క్లాప్​​ బాయ్​గా పనిచేశాడు సిద్ధార్థ్. ‘దోస్తానా’, ‘మై నేమ్​ ఈజ్ ఖాన్’ సినిమాలకు అసిస్టెంట్ డైరక్టర్​గా పని చేశాడు. తన సినీ కెరీర్​లో ఎన్నో సమస్యలు ఫేస్​ చేశాడు సిద్ధార్థ్. ఆ టైంలో ఫేమస్​ డిజైనర్​ మనీష్​​ మల్హోత్రా సిద్ధార్థ్​కు చేదోడు వాదోడుగా ఉన్నాడు. 

సల్మాన్ ఖాన్​ వాచ్ గిఫ్ట్

2012లో వచ్చిన ‘స్టూడెంట్ ఆఫ్​ ది ఇయర్’ సినిమాలో ఇద్దరు హీరోల్లో ఒకడిగా సిద్ధార్థ్​ నటించాడు. అదే తన మొదటి సినిమా కూడా. ఇందులో హీరోయిన్​​ అలియా భట్​. ఈ సినిమాలో సిద్ధార్థ్ చేసిన యాక్టింగ్​కి 2013లో ‘స్టార్​డస్ట్’, ‘సౌత్​ ఆఫ్రికా ఫిల్మ్​ అండ్ టెలివిజన్’ అవార్డ్​లు దక్కాయి. అలా మొదటి సినిమాకే రెండు డెబ్యూ అవార్డ్​లను తన ఖాతాలో వేసుకున్నాడు సిద్ధార్థ్​ మల్హోత్రా. 2014లో ‘హస్సీ తో ఫస్సీ’ అనే సినిమాలో నటించాడు. దానికిగానూ ‘బిగ్​ స్టార్​ ఎంటర్​టైనర్’, ‘మోస్ట్ ఎంటర్​టైనింగ్ యాక్టర్​ ఇన్​ రొమాంటిక్​ ఫిల్మ్’​ కేటగిరీలో అవార్డ్​లు సొంతం చేసుకున్నాడు. 2014లో ‘ఏక్ విలన్’ సినిమా ద్వారా ఆడియెన్స్​కి మరింత దగ్గరయ్యాడు సిద్ధార్థ్​.  ఆ సినిమా చూసి బాలీవుడ్ హీరో సల్మాన్ ఖాన్​ సిద్ధార్థ్​ని మెచ్చుకున్నాడు. రిస్ట్ వాచ్​ను గిఫ్ట్​గా ఇచ్చాడు. 

ఆ సినిమాకోసం పది కేజీలు పెరిగాడు

ప్రతి సినిమాకి ఎంతో కష్టపడి పని చేస్తాడు సిద్ధార్థ్. 2015లో ‘బ్రదర్స్​’ సినిమాలో అక్షయ్​ కుమార్​కి బ్రదర్​గా చేసే రోల్​ వచ్చింది. అందులో అక్షయ్​ ఫిజిక్​కి తగ్గట్టు ఉండాలని, ఏకంగా పది కేజీల బరువు పెరిగాడు సిద్ధార్థ్​. దాని తర్వాత2016లో వచ్చిన ‘కపూర్​ అండ్​ సన్స్’ సినిమా కూడా తన కెరీర్​లో బెస్ట్ హిట్​గా నిలిచింది. సినిమాలతోపాటు ఇప్పటికే చాలా బ్రాండ్లకు, ప్రొడక్ట్స్​కి అంబాసిడర్​గా ఉన్నాడు సిద్ధార్ధ్. కోకొకోలా, కార్నెటో అమెరికన్ స్వాన్ వంటి ఇంటర్నేషనల్​ ప్రొడక్ట్స్​యాడ్స్​లో  కూడా కనిపిస్తుంటాడు. ప్రస్తుతం రెండు సినిమాల ప్రి– ప్రొడక్షన్​ జరుగుతుండగా, ‘మిషన్​ మజ్ను’ అనే మరో సినిమాతో రాబోతున్నాడు సిద్ధార్థ్​.

షారుక్​​, హాట్ చాకొలెట్స్​

సిద్ధార్థ్​కి హాట్ చాకొలెట్స్​ అంటే ఎంత ఇష్టమో​, షారుక్​​ ఖాన్​ అంటే కూడా అంతే ఇష్టం. హాట్ చాకొలెట్స్​ కోసం వాళ్ల అమ్మమ్మకి అబద్ధాలు చెప్పి డబ్బులు తీసుకునేవాడట. అలాగే ‘దిల్​ వాలే దుల్హనియా లేజాయేంగే’ సినిమా చూసి అందులో షారుక్​ హెయిర్​ స్టైల్​ ఎలా ఉందో అలా తన హెయిర్​ స్టైల్ మార్చుకున్నాడు. సిద్ధార్థ్​కి కుక్కలంటే కూడా బాగా ఇష్టం. తను బాక్సర్ అనే కుక్కను పెంచుకుంటున్నాడు. అంతేకాదు, ‘పెటా’ అనే యానిమల్ వెల్ఫేర్​ ఎన్జీవోకి  క్యాంపెయిన్​ చేస్తుంటాడు ఈ పెట్ లవర్​.