
బోయినిపల్లి, వెలుగు, : రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినిపల్లి మండలం మిడ్‌మానేర్ ప్రాజెక్టు వద్ద బాంబ్, డాగ్ స్క్వాడ్ బృందాలు శనివారం తనిఖీలు చేపట్టాయి. దేశవ్యాప్తంగా నెలకొన్న యుద్ధ వాతావరణ నేపథ్యంలో జిల్లాలో నిఘా పెంచామని, అందులో భాగంగా మిడ్ మానేర్ ప్రాజెక్టు వద్ద తనిఖీలు చేస్తామని అధికారులు తెలిపారు. అనంతరం మండల కేంద్రంలోని బ్యాంకులో తనిఖీలు చేశారు.
గోదావరిఖనిలో..
గోదావరిఖని, వెలుగు: భారత సరిహద్దులో ఉద్రిక్తత పరిస్థితుల నేపథ్యంలో రామగుండం కమిషనరేట్ పరిధిలో పోలీసులు అప్రమత్తమయ్యారు. పారిశ్రామిక ప్రాంతంలోని గోదావరిఖని బస్టాండ్, మెడికల్ కాలేజీ, కోర్టు, జీఎం ఆఫీసుల్లో పోలీసులు ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. డాగ్, బాంబ్ స్క్వాడ్ ప్రయాణికుల లగేజీని, అనుమానితులను చెక్ చేశారు. ప్రజల భద్రతను దృష్టిలో పెట్టుకొని సీపీ అంబర్ కిశోర్‌ఝా ఆదేశాల మేరకు తనిఖీలు నిర్వహిస్తున్నట్లు గోదావరిఖని ఏసీపీ రమేశ్ తెలిపారు.
డివిజన్ పరిధిలో తనిఖీలు చేపట్టాలి
కరీంనగర్ క్రైమ్, వెలుగు: నిరంతర పెట్రోలింగ్, వాహన తనిఖీలు నిర్వహించాలని సీపీ గౌస్ ఆలం పోలీస్ అధికారులను సూచించారు. శనివారం టూ టౌన్ పీఎస్‌లో టౌన్ డివిజన్ పోలీసు అధికారులతో రివ్యూ మీటింగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ డివిజన్ పరిధిలోని పోలీస్ స్టేషన్లలో విజిబుల్ పోలీసింగ్‌కు ప్రాధాన్యమివ్వాలని సూచించారు. బస్ స్టేషన్లు, రైల్వే స్టేషన్లు, ప్రార్థనా మందిరాలు, షాపింగ్ కాంప్లెక్స్ మార్కెట్ ప్రాంతాల వంటి రద్దీ ప్రదేశాల్లో విజిబుల్ పోలీసింగ్ పెంచాలని ఆదేశించారు. సమావేశంలో ఏసీపీ వెంకటస్వామి, సీఐలు కోటేశ్వర్, సృజన్ రెడ్డి, జాన్ రెడ్డి, శ్రీలత పాల్గొన్నారు.