దేశంలోని 40 ఎయిర్‌‌పోర్టులకు బాంబు బెదిరింపు

దేశంలోని 40 ఎయిర్‌‌పోర్టులకు బాంబు బెదిరింపు

న్యూఢిల్లీ : పాట్నా , కోయంబత్తూర్, జైపూర్‌‌తో సహా దేశంలోని 40  ఎయిర్‌‌పోర్టులకు మంగళవారం బాంబు బెదిరింపు ఈమెయిల్స్ వచ్చాయి. దాంతో ఆయా విమానాశ్రయాల్లో తీవ్ర కలకలం చెలరేగింది. విమానాల రాకపోకలు ఆలస్యం అయ్యాయి. బెదిరింపు మెయిల్స్‌‌ దృష్ట్యా అధికారులు ఎయిర్‌‌పోర్టులల్లో భద్రతను పెంచారు. ఓ గుర్తుతెలియని ఐడీ నుంచి ..బాంబు బెదిరింపు ఈమెయిల్స్ చేసినట్లు ప్రాథమిక విచారణలో వెల్లడైంది."ఎయిర్‌‌పోర్టులో బాంబులు పెట్టాం. అవి ఎప్పుడైనా పేలవచ్చు" అని ఈమెయిల్స్ లో పేర్కొన్నారు.

బెదిరింపు ఈమెయిల్స్ అందుకున్న 40 విమానాశ్రయాల్లో ఢిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం, పాట్నాలోని జయప్రకాశ్‌‌ నారాయణ్‌‌ అంతర్జాతీయ విమానాశ్రయం, వడోదర, కోల్‌‌కతా, జైపూర్‌‌, చెన్నై ఎయిర్‌‌పోర్టులు కూడా ఉన్నాయి. ఈమెయిల్స్ అందిన వెంటనే అధికారులు అప్రమత్తమయ్యారు. బాంబు డిటెక్షన్ అండ్ డిస్పోజల్ స్క్వాడ్ (బీడీడీఎస్) బృందం, సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (సీఐఎస్ఎఫ్)కి

చెందిన స్నిఫర్ డాగ్ స్క్వాడ్‌‌తో కలిసి విమానాశ్రయాల ప్రాంగణంలో సోదాలు నిర్వహించారు.  నిర్దిష్ట తనిఖీల అనంతరం ఎలాంటి అనుమానిత వస్తువులు దొరకలేదని అధికారులు వెల్లడించారు. బెదిరింపు ఈ మెయిల్స్‌‌ ఒకే దగ్గరి నుంచి వచ్చాయా, వేర్వేరు ప్రాంతాల నుంచి వచ్చాయా అనే కోణంలో  దర్యాప్తు చేస్తున్నామని పేర్కొన్నారు.