ముంబై మున్సిపల్​ కార్పొరేషన్​పై బాంబే హైకోర్టు ఫైర్.. వీఐపీలు వస్తేనే ఫుట్‌పాత్‌లు క్లియర్ చేస్తారా

ముంబై మున్సిపల్​ కార్పొరేషన్​పై బాంబే హైకోర్టు ఫైర్.. వీఐపీలు వస్తేనే ఫుట్‌పాత్‌లు క్లియర్ చేస్తారా

ముంబై: మహారాష్ట్రకు ప్రధాని నరేంద్ర మోదీ, ఇతర వీవీఐపీలు వస్తేనే ముంబై వీధులను, ఫుట్‌‌‌‌పాత్‌‌‌‌లను క్లియర్ చేయడమేంటని ముంబై మున్సిపల్ కార్పొరేషన్ ఆఫీసర్లపై బాంబే హైకోర్టు ఫైర్ అయ్యింది. సామాన్యుల కోసం రోజూ అలా ఎందుకు చేయడంలేదని ప్రశ్నించింది. ముంబై రోడ్ల ఫుట్‌‌‌‌పాత్‌‌‌‌లను, వీధులను ఆక్రమించి వ్యాపారాలు చేయడంతో  పాదచారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ సమస్యను గతేడాది హైకోర్టు సుమోటోగా స్వీకరించింది. దీన్ని జస్టిస్ ఎంఎస్. సోనక్, కమల్ ఖాటా డివిజన్ బెంచ్ సోమవారం విచారించింది. 

"ప్రధాని లేదా ఇతర వీవీఐపీలు వచ్చినప్పుడు వీధులను, ఫుట్‌‌‌‌పాత్‌‌‌‌లను వెంటనే క్లియర్ చేస్తున్నారు. వాళ్లు వెళ్లిపోయాక మళ్లీ ఫుట్‌‌‌‌పాత్‌‌‌‌లను ఆక్రమిస్తున్నారు. వీఐపీల కోసమే మీరు పనిచేస్తారా..? సామాన్యుల ఇబ్బందులతో మీకు పనిలేదా? ప్రజలే ట్యాక్స్ పేయర్లు. నడవడానికి సురక్షితమైన ఫుట్‌‌‌‌పాత్‌‌‌‌లు కలిగి ఉండటం వారి ప్రాథమిక హక్కు. ఈ సమస్య పరిష్కారానికి కసరత్తు చేస్తున్నామని అధికారులు ఏండ్ల తరబడి చెబుతున్నారు. ఎందుకు పరిష్కారం కావడంలేదు. సంకల్పం ఉన్న చోట సమస్యకు ఎప్పుడూ ఒక పరిష్కారం ఉంటుంది. 

మీ సంకల్పం లోపించిందా..? అని అధికారులను కోర్టు పశ్నించింది. దీనికి బృహన్‌‌‌‌ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ (బీఎంసీ) తరపున సీనియర్ న్యాయవాది ఎస్ యూ.కమ్దార్ మాట్లాడుతూ.. వీధులను, ఫుట్‌‌‌‌పాత్‌‌‌‌లను ఆక్రమించి చిరు వ్యాపారం చేసే వారిపై జరిమానాలు విధిస్తూ ఎప్పటికప్పుడు చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. అయినా వారు తిరిగి వస్తూనే ఉన్నారని కోర్టుకు వివరించారు. శాశ్వత పరిష్కారం కోసం అండర్ గ్రౌండ్ మార్కెట్లను నిర్మించాలనే యోచనలో ఉన్నామని బదులిచ్చారు. దీనిపై కోర్టు స్పందిస్తూ.. ఈ సమస్యను నిజంగానే భూగర్భంలో పూడ్చేందుకు ప్రయత్నిస్తున్నారని ఎద్దేవా చేసింది. వెంటనే ఆక్రమణదారులను గుర్తించి తిరిగి ఫుట్‌‌‌‌పాత్‌‌‌‌లపై స్టాల్స్ ఏర్పాటు చేయకుండా తీవ్రమైన చర్యలు చేపట్టాలని పేర్కొంది. తదుపరి విచారణను జులై 22కి కోర్టు వాయిదా వేసింది.