బోనాలు తెలంగాణ సంస్కృతికి ప్రతీక : జీహెచ్ఎంసీ డివిజన్ కార్పొరేటర్ సింధు ఆదర్శ్రెడ్డి

బోనాలు తెలంగాణ సంస్కృతికి ప్రతీక : జీహెచ్ఎంసీ డివిజన్ కార్పొరేటర్ సింధు ఆదర్శ్రెడ్డి

వెలుగు, నెట్​వర్క్: ఉమ్మడి మెదక్​జిల్లా వ్యాప్తంగా ఆషాఢ మాసం పురస్కరించుకొని ఆదివారం గ్రామదేవతలకు బోనాలు సమర్పించారు. తెలంగాణ సంస్కృతి, ఆచారాలకు ప్రతీక బోనాలు అని భారతీనగర్ జీహెచ్ఎంసీ డివిజన్​ కార్పొరేటర్ సింధు ఆదర్శ్​రెడ్డి అన్నారు. బీహెచ్ఈఎల్​ పెద్దమ్మ గుడి వద్ద నిర్వహించిన బోనాల ఉత్సవానికి ఆమె ముఖ్య అతిథిగా హాజరయ్యారు. బెస్త గంగపుత్ర సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన బోనాల కార్యక్రమానికి భక్తులు పెద్ద ఎత్తున తరలి వచ్చారు. 

అమ్మవారికి బోనం సమర్పించిన అనంతరం సింధు ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. గంగపుత్ర సంఘానికి ప్రత్యేకంగా గుడి, కార్యాలయం కావాలని సంఘం పెద్దలు కార్పొరేటర్​కు వినతిపత్రం అందజేశారు. అధికారులు, నాయకులతో మాట్లాడి తనవంతు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఆమె వెంట రామచంద్రాపురం కార్పొరేటర్ పుష్ప ఉన్నారు. జహీరాబాద్ పట్టణంలోని గడి వీధిలో జరిగిన ఊరడమ్మ తల్లి బోనాల ఉత్సవాల్లో సెట్విన్ చైర్మన్ గిరిధర్ రెడ్డి, కాంగ్రెస్ నాయకులు ఉజ్వల్ రెడ్డి, మాజీ టీజీఐడీసీ చైర్మన్ మహ్మద్ తన్విర్ పాల్గొని అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు.

 మెదక్​జిల్లా నిజాంపేట మండలం చల్మెడ గ్రామంలో గ్రామస్తులు అమ్మవారికి బోనాలు సమర్పించారు. మనోహరాబాద్​మండలంలోని ముత్యాలమ్మ దేవాలయంలో కాంగ్రెస్​నేత మైనంపల్లి హన్మంతరావు ప్రత్యేక పూజలు చేశారు. కౌడిపల్లి మండలం  తునికి నల్ల పోచమ్మ శాకాంబరీ దేవిగా దర్శనమిచ్చింది. భక్తులు బోనాలు సమర్పంచి ఒడిబియ్యం పోసి మొక్కులు చెల్లించుకున్నారు. ఏడుపాయలభవానీ మాత భక్తులకు వన దుర్గామాత రూపంలో దర్శనమిచ్చింది. అమ్మవారి దర్శనం కోసం వచ్చిన భక్తులు మంజీర నదిలో పుణ్యస్నానాలు చేసి తల్లిని దర్శించుకున్నారు. అనంతరం ఒడిబియ్యం పోసి, కుంకుమార్చనలు చేసి మొక్కులు చెల్లించుకున్నారు. 

మెదక్​పట్టణ ముదిరాజ్ సంఘం ఆధ్వర్యంలో బోనాల పండగను ఘనంగా నిర్వహించారు. బీఆర్ఎస్ ప్రెసిడెంట్, మాజీ ఎమ్మెల్యే పద్మా దేవేందర్​ రెడ్డి పాల్గొని మహిళలతో కలిసి బోనం ఎత్తుకొని నల్ల పోచమ్మ తల్లికి సమర్పించారు. బెజ్జంకి మండల కేంద్రంలో ముదిరాజ్ సంఘం, లక్ష్మీపూర్ గ్రామంలో హరిజన సంఘం ఆధ్వర్యంలో పోచమ్మ, పెద్దమ్మ తల్లి బోనాలు నిర్వహించారు. దుబ్బాక మండలం పెద్దగుండవెళ్లి రేణుక ఎల్లమ్మకు జిల్లా జడ్జి సాయి రమాదేవి దంపతులు బోనాన్ని సమర్పించారు.