కేసీఆర్ స్పీచ్ లో పస లేదు : బూర నర్సయ్య గౌడ్

కేసీఆర్ స్పీచ్ లో పస లేదు : బూర నర్సయ్య గౌడ్

ఖమ్మం బీఆర్ఎస్ సభలో మాట్లాడిన ముఖ్యమంత్రి స్పీచ్ లో పస లేదని మాజీ ఎంపీ, బీజేపీ సీనియర్ నేత బూర నర్సయ్య గౌడ్ అన్నారు. తొమ్మిదేళ్లలో రాష్ట్రానికి చేసిన అభివృద్ధి ఏంటని ప్రశ్నించారు. రాజకీయాలకు, బర్గర్లకు పొంతన ఏముందన్నారు. రాష్ట్ర ప్రజలకు ఇచ్చిన హామీలను కప్పిపుచ్చుకునేందుకే ముఖ్యమంత్రి కేసీఆర్ బీఆర్ఎస్ ను స్థాపించారని ఆరోపించారు. కేవలం స్వలాభం కోసమే కమ్యూనిస్టు పార్టీలు బీఆర్ఎస్ తో పొత్తు పెట్టుకున్నాయని మండిపడ్డారు. ఎన్నికల కోసం రూ.200 కోట్ల నిధులతో ‘కంటి వెలుగు’ కార్యక్రమం పెట్టారని, దీంట్లో ఏముందని ప్రశ్నించారు. కంటి వెలుగు కేంద్రంలో ఏ ఒక్క కంటి డాక్టర్ కూడా లేరని చెప్పారు. సరోజిని దేవి కంటి ఆస్పత్రిలో సంవత్సరానికి 9 వేల ఆపరేషన్లు చేస్తున్నారని తెలిపారు. గతంలో నాలుగు ఆసుపత్రులను ఏర్పాటు చేయాలని కోరడంతో పార్టీ నుండి తనను వెళ్లగొట్టారని ఆరోపించారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో కనీస సౌకర్యాలు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. ప్రధానంగా కంటికి సంబంధించిన ఆసుపత్రిని ఏర్పాటు చేయాలని కోరారు. 

ఇబ్రహీంపట్నంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డితో పాటు పలువురు ప్రజాప్రతినిధులు ‘ప్రగతి నివేదన యాత్ర’ చేయడం విడ్డూరంగా ఉందని బూర నర్సయ్య గౌడ్ అన్నారు. ఇబ్రహీంపట్నంలో ప్రజల ఆవేదన, నివేదికను త్వరలోనే ప్రజల ముందుకు తీసుకొస్తామన్నారు. రాష్ట్రంలో దళితులపై ముఖ్యమంత్రి కేసీఆర్ వివక్షత చూపుతున్నారని ఆరోపించారు. ఇబ్రహీంపట్నం మార్కెట్ కమిటీ చైర్మన్ పదవి ఎస్సీకి రిజర్వ్ కావడంతో.. ఆ పదవి ఇవ్వడం ఇష్టం లేక దాదాపు మూడేళ్లు కాలయాపన చేశారని ఆరోపించారు.