‘ప్రసాద్’తో టెంపుల్ టూరిజానికి బూస్టింగ్

‘ప్రసాద్’తో టెంపుల్ టూరిజానికి బూస్టింగ్

హైదరాబాద్, వెలుగు: కేంద్ర ప్రభుత్వం రాష్ట్రంలో అమలు చేస్తున్న పిలిగ్రిమేజ్ రిజువెనేషన్ అండ్ స్పిరిచ్యువల్ ఆగ్మెంటేషన్ డ్రైవ్(ప్రసాద్) స్కీమ్ తో టెంపుల్ టూరిజం మరింత పుంజుకోనుంది. దక్షిణ కాశీగా పేరొందిన అలంపూర్ లోని జోగులాంబ శక్తి పీఠం రెండేండ్ల కిందే  ఈ స్కీమ్ కింద ఎంపిక కాగా.. ఈ ఏడాది రామప్పలోని రామలింగేశ్వరాలయం, భద్రాచలంలోని రామాలయం ఎంపికయ్యాయి. అలంపూర్ లో అభివృద్ధి పనుల కోసం రాష్ట్ర టూరిజం కార్పొరేషన్ రూ.80 కోట్లతో ప్రపోజల్స్ పంపగా.. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం రూ.50 కోట్లు విడుదల చేసింది. రామప్పలో కామేశ్వర ఆలయం పునరుద్ధరణ, ఇతర అభివృద్ధి పనుల కోసం రూ.62 కోట్లతో ప్రతిపాదనలు పంపారు.  భద్రాచలంలో రూ.61 కోట్ల విలువైన పనులు చేపట్టేందుకు ప్రపోజల్స్ పంపగా.. రూ.41 కోట్లు కేంద్రం రిలీజ్ చేసింది.  

రామప్పలో కామేశ్వర ఆలయ పునరుద్ధరణ.. 

యునెస్కో గుర్తింపు పొందిన రామప్ప ఆలయానికి ఏడాదిగా భక్తులు, టూరిస్టుల రద్దీ పెరిగింది. గుర్తింపును నిలబెట్టుకోవాలంటే ఈ ఆలయ పరిసరాల్లోని కామేశ్వర ఆలయాన్ని పునరుద్ధరించాల్సి ఉంటుందని యునెస్కో అప్పట్లోనే కండిషన్ పెట్టింది. దాంతో తొలి ప్రాధాన్యతగా ఈ ఆలయ పునరుద్ధరణ పనులు చేపట్టబోతున్నారు. దీంతోపాటు మిగతా అనుబంధ ఆలయాలనూ పునరుద్ధరించాల్సి ఉంటుంది. టూరిస్టుల వెహికిల్  పార్కింగ్ ఫెసిలిటీ, ఆలయం చుట్టూ విశాలమైన లాన్, గెస్ట్ హౌస్ లు, ప్రైమరీ హెల్త్ సెంటర్, సీసీ కెమెరాల ఏర్పాటు, ఆలయం  నుంచి పాలంపేట గ్రామందాకా రోడ్డు విస్తరణ, సెంట్రల్ లైటింగ్, టాయిలెట్లు, హరిత హోటళ్ల విస్తరణ, తాగునీరు, క్యూలైన్ వంటి ఏర్పాట్లు, మ్యూజియం, శిల్పారామం వంటి ప్రతిపాదనలతో కూడిన డీపీఆర్​ను రాష్ట్ర టూరిజం అధికారులు కేంద్రానికి పంపారు. ఈ పనులన్నీ పూర్తయితే రామప్ప మరింత అందంగా ముస్తాబుకానుంది.

రామాయణ సర్క్యూట్​లో భద్రాచలం.. 

రామాయణ సర్య్యూట్ లో భాగంగా భద్రా చలం ఆలయం, అనుబంధ ఆలయాలు, ప్రదేశాల అభివృద్ధి కోసం రూ.61 కోట్ల విలు వైన పనులతో రాష్ట్ర టూరిజం కార్పొరేషన్ కేంద్రానికి ప్రపోజల్స్ పంపగా.. తొలివిడతగా రూ.41 కోట్లు కేంద్రం రిలీజ్ చేసింది. కేంద్రాని కి పంపిన ప్రపోజల్స్ లో పర్ణశాల, నిత్య కల్యాణ మండపం, హనుమాన్ టెంపుల్, నిత్య కల్యా ణ మండపం, మిథిలా స్టేడియంలో అభి వృద్ది పనులు, 10 బ్యాటరీ కార్లు, గోదావరి బ్రిడ్జి సమీపంలో కాటేజీలు, టాయిలెట్లు, బాత్రూమ్ లు, పార్కుతో పాటు పలు  పనులు ఉన్నాయి. అలాగే సీతారామచంద్రస్వామి పోటు(ప్రసాదాల తయారీ కేంద్రం) కోసం కొత్త మెషినరీ కొనుగోలు చేయనున్నారు.