మెల్‌బోర్న్: ఇండియా టెన్నిస్ లెజెండ్ రోహన్ బోపన్న అరుదైన ఘనత సాధించాడు. మెన్స్ డబుల్స్‌లో అత్యధిక వయసు (43 ఏండ్లు)లో వరల్డ్ నంబర్‌వన్ ర్యాంక్ సాధించిన తొలి ప్లేయర్‌గా రికార్డు సృష్టించాడు. ఆస్ట్రేలియన్ ఓపెన్ డబుల్స్‌లో సెమీస్‌కు చేరుకోవడం ద్వారా ఈ ఘనత అందుకున్నాడు. తద్వారా అక్టోబర్ 2022లో రాజీవ్ రామ్ (అమెరికా–38 ఏండ్లు) నెలకొల్పిన రికార్డును బోపన్న బ్రేక్ చేశాడు.
ఇండియా తరఫున నంబర్ వన్ అయిన నాలుగో ప్లేయర్‌గా బోపన్న రికార్డులకెక్కాడు. గతంలో లియాండర్ పేస్, మహేశ్ భూపతి, సానియా మీర్జా డబుల్స్‌లో టాప్ ప్లేస్‌కు చేరుకున్నారు. ఇక బుధవారం జరిగిన డబుల్స్ క్వార్టర్‌ఫైనల్లో రెండోసీడ్ బోపన్న–మాథ్యూ ఎబ్డెన్ (ఆస్ట్రేలియా) 6–4, 7–6 (7/5)తో మాక్సిమో గోంజాలెజ్–ఆండ్రెస్ మోల్టెని (అర్జెంటీనా)పై గెలిచి సెమీస్ చేరారు. ఎబ్డెన్‌కు రెండో ర్యాంక్ దక్కనుంది. సోమవారం ఏటీపీ ర్యాంకింగ్స్‌ను అధికారికంగా ప్రకటించనున్నారు. గతేడాది యూఎస్ ఓపెన్‌లో ఫైనల్‌కు చేరిన బోపన్న అత్యధిక వయసులో గ్రాండ్ స్లామ్ టైటిల్ ఫైట్‌కు అర్హత సాధించిన ప్లేయర్‌గానూ రికార్డు సృష్టించాడు. మాస్టర్స్–1000 టైటిల్ (ఇండియన్ వెల్స్) నెగ్గిన ఓల్డెస్ట్ ప్లేయర్ కూడా బోపన్నే కావడం విశేషం.
అల్కరాజ్ ఔట్
మెన్స్ సింగిల్స్‌లో రెండో సీడ్ కార్లోస్ అల్కరాజ్‌కు షాక్ తగిలింది. క్వార్టర్‌ఫైనల్లో అలెగ్జాండర్ జ్వెరెవ్ (జర్మనీ) 6–1, 6–3, 6–7 (2/7), 6–4తో అల్కరాజ్‌ను ఓడించి సెమీస్‌లోకి అడుగుపెట్టాడు. మరో మ్యాచ్‌లో మూడోసీడ్ మెద్వెదెవ్ (రష్యా) 7–6 (7/4), 2–6, 6–3, 5–7, 6–4తో హుర్కాజ్ (పోలెండ్)పై నెగ్గాడు. విమెన్స్ క్వార్టర్స్‌లో క్విన్‌వెన్ జెంగ్ (చైనా) 6–7 (4/7), 6–3, 6–1తో కలిన్‌స్కేయా (రష్యా)పై, క్వాలిఫయర్ యాస్ట్రేమెస్కా (ఉక్రెయిన్) 6–3, 6–4తో లిండా నోస్కోవా (చెక్)పై గెలిచి సెమీస్ చేరింది.
