బోరబండ ఇన్‌స్పెక్టర్‌‌పై వేటు

బోరబండ ఇన్‌స్పెక్టర్‌‌పై వేటు
  • హైదరాబాద్ సీపీ సందీప్ శాండిల్య ఆకస్మిక తనిఖీలు
  • రౌడీషీటర్ల వివరాలు చెప్పలేకపోయిన సీఐ రవికుమార్
  • హెడ్డాఫీస్‌కి అటాచ్‌ చేస్తూ ఆదేశాలిచ్చిన సీపీ

హైదరాబాద్‌,వెలుగు: విధుల్లో నిర్లక్ష్యంగా ఉన్న బోరబండ ఇన్‌స్పెక్టర్‌ రవికుమార్‌‌‌పై వేటు పడింది. పీఎస్‌లో అపరిశుభ్రత,రౌడీషీటర్ల సమాచారం తెలియకపోవడంతో హెడ్డాఫీస్‌కు అటాచ్ చేస్తూ హైదరాబాద్ సీపీ సందీప్ శాండిల్య మంగళవారం ఆదేశాలు జారీ చేశారు. వివరాల్లోకి వెళ్తే..మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్‌ అమలులోకి వచ్చిన తర్వాత వెపన్స్‌, రౌడీషీటర్లపై సిటీ పోలీసులు ప్రత్యేక నిఘా పెట్టారు. లైసెన్స్డ్‌ ఆయుధాలను డిపాజిట్‌ చేయాలని, పోలీస్ స్టేషన్లలో  రౌడీషీటర్లగా నమోదైన వారిని బైండోవర్ చేయాలని సీపీలు ఆదేశించారు. దీంతో స్థానిక పోలీసులు రౌడీషీటర్లను బైండోవర్ చేస్తున్నారు.

పేర్లు, అడ్రస్ చెప్పకపోగా..

బందోబస్తు పర్యవేక్షణలో భాగంగా సిటీ సీపీ సందీప్ శాండిల్య మంగళవారం ఆకస్మిక తనిఖీలు నిర్వహిం చా రు. పోలీస్ స్టేషన్లకు వెళ్లి వివరాలు తెలుసుకున్నారు.స్టేషన్ హౌజ్‌ ఆఫీసర్స్‌(ఎస్‌హెచ్‌ఓ)ల వద్ద వెపన్ డిపాజిట్స్‌, రౌడీషీటర్ల వివరాలు పరిశీలించారు. ఇందులో భాగంగా బోరబండ పీఎస్ కు వెళ్లారు. పీఎస్‌ రికార్డ్స్‌లో ఉన్న రౌడీషీటర్ల వివరాలను సీఐ రవికుమార్‌‌ను సీపీ అడిగారు. దీంతో పాటు సంబంధిత రౌడీషీటర్ల ఇంటి అడ్రస్‌లు తెలపాలని ప్రశ్నించారు. అయితే.. రౌడీషీటర్లకు సంబంధించిన ఎలాంటి సమాచారం అందించకపోవడంతో సీపీ సీరియస్ అయ్యారు. అదేవిధంగా పీఎస్ పరిసరాలు అపరిశుభ్రంగా ఉండడంతో ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే ఇన్‌స్పెక్టర్ రవికుమార్‌‌ను హెడ్డాఫీస్‌కు అటాచ్ చేస్తూ ఆదేశాలు జారీ చేశారు.