పాక్‌ నుంచి డ్రోన్ల తో డ్రగ్స్‌

పాక్‌ నుంచి డ్రోన్ల తో డ్రగ్స్‌

రాజస్థాన్‌లోని పాక్‌ బార్డర్‌‌లో 2.6 కేజీల హెరాయిన్‌ స్వాధీనం

జైపూర్‌‌ : రాజస్థాన్‌లోని పాకిస్తాన్‌ సరిహద్దు‌లో 2.6 కేజీల హెరాయిన్‌ను బార్డర్‌‌ సెక్యూరిటీ ఫోర్స్‌ (బీఎస్‌ఎఫ్‌) స్వాధీనం చేసుకుంది. పాక్‌ నుంచి వచ్చిన ఓ డ్రోన్‌ రాజస్థాన్‌లోని శ్రీగంగానగర్‌‌ జిల్లాలో బార్డర్‌‌ వద్ద ఓ ప్యాకెట్‌ను వదిలేసి వెళ్లింది. ఈ ప్యాకెట్‌ను తీసుకునేందుకు వచ్చిన ఇద్దరు పంజాబ్‌కు చెందిన వ్యక్తులను కూడా పోలీసులు అరెస్ట్ చేశారు.

పక్కా సమాచారంతో భద్రత దళాలు జిల్లాలోని ఘడ్సానాలో గట్టి నిఘా ఏర్పాటు చేశాయి. ఈ క్రమంలో మంగళవారం ఉదయం పాక్‌ నుంచి వచ్చిన ఓ డ్రోన్‌ ఒక ప్యాకెట్‌ను పడవేయడాన్ని బీఎస్‌ఎఫ్‌ సిబ్బంది గమనించింది. వెంటనే దానిపై కాల్పులు జరపగా, ఆ డ్రోన్‌ అక్కడి నుంచి వెనక్కి వెళ్లిపోయింది. ఇంతలో ఆ ప్యాకెట్‌ను తీసుకెళ్లడానికి పంజాబ్‌కు చెందిన ఇద్దరు వ్యక్తులు అక్కడికి వచ్చారు.

గమనించిన బీఎస్‌ఎఫ్‌ దళాలు ఆ ప్యాకెట్‌ను స్వాధీనం చేసుకోవడంతో పాటు వారిని కూడా అరెస్ట్‌ చేశారు. ఆ హెరాయిన్‌ విలువ అంతర్జాతీయ మార్కెట్‌లో రూ.12 కోట్లకు పైగా ఉంటుందని భద్రతా దళాలు వెల్లడించాయి. నిందితులను, హెరాయిన్‌ను నార్కోటిక్స్‌ కంట్రోల్‌ బ్యూరో (ఎన్సీబీ)కి అప్పగించాయి.