అటవీశాఖలో ఇంటి దొంగలు ..పైసలిస్తే బోర్లకు ఓకే

అటవీశాఖలో ఇంటి దొంగలు ..పైసలిస్తే బోర్లకు ఓకే

ఖమ్మం, వెలుగు: ఖమ్మం జిల్లాలో కొందరు అటవీ శాఖ సిబ్బంది ఇంటి దొంగలుగా మారుతున్నారు. అటవీ భూములను రక్షించాల్సినవారే పైసలు తీసుకొని తప్పు చేస్తున్నవారికి సహకరిస్తున్నారు. పోడు కొట్టుకొని భూములు సాగు చేసుకుంటున్న గిరిజనులు, ఆ భూముల్లో బోర్లు వేసుకుంటున్నా చూసీ చూడనట్టు వ్యవహరిస్తున్నారు. గిరిజనులకు వ్యవసాయపరంగా చేయూతనిచ్చేందుకు ట్రైబల్ వెల్ఫేర్ డిపార్ట్ మెంట్ ఆధ్వర్యంలో గిరివికాస్ పథకం కింద బోర్లు మంజూరు చేస్తే వాటికి కొర్రీలు పెడుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం నుంచి బోరు మంజూరైనా కిందిస్థాయి ఫారెస్ట్ సిబ్బంది అడ్డుకుంటుండడంతో గిరిజనులు లంచాలు ఇవ్వక తప్పడం లేదు. అధికార పార్టీకి చెందిన కొందరు స్థానిక ప్రజాప్రతినిధులు బ్రోకర్లుగా వ్యవహరిస్తూ అటవీశాఖ సిబ్బందితో కలిసి గిరిజనుల నుంచి బోరుకు రూ.30వేల చొప్పున వసూలు చేస్తున్నారు. దీనిపై ఇటీవల కొందరు గిరిజన సంఘాల నేతలు, గిరిజన రైతులు ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్లారు. గ్రీవెన్స్ లో కలెక్టర్ కు ఫిర్యాదు చేశారు. కారేపల్లి మండలంలోని కొన్ని గ్రామాల్లో ఎంక్వైరీ చేసిన ఉన్నతాధికారులు ముగ్గురు సిబ్బందిని సస్పెండ్ చేశారు. 

అన్ని అనుమతులు ఉన్నా..

ఖమ్మం జిల్లాలో 10 మండలాల్లో అటవీ ప్రాంతం విస్తరించి ఉంది. ఇందులో 120కి పైగా ఆవాసాల్లో పోడు సాగు జరుగుతోంది. పోడు పట్టాలు ఉన్న గిరిజనులు వారి వ్యవసాయ భూముల్లో బోర్లు వేసుకునేందుకు ప్రభుత్వానికి గిరివికాస్ పథకం కింద దరఖాస్తు చేసుకోవచ్చు. గిరిజన సంక్షేమ శాఖ, రెవెన్యూ డిపార్ట్ మెంట్ ఆధ్వర్యంలో ఫీల్డ్ ఎంక్వైరీ చేసిన తర్వాత అర్హత కలిగిన గిరిజనులకు గిరివికాస్ కింద బోరు వేసుకొని, మోటార్ బిగించుకునేందుకు ఆర్థిక సాయం అందిస్తారు. అన్ని అనుమతులు వచ్చినా క్షేత్రస్థాయిలో ఉండే ఫారెస్ట్ సిబ్బంది మాత్రం గిరిజనులను ముప్పతిప్పలు పెడుతున్నారనే ఆరోపణలున్నాయి. బోరు బండిని పోడు పట్టాలున్న భూముల్లోకి రానీయకుండా అడ్డుకుంటున్నారు. అదే సమయంలో రూ.30 వేల చొప్పున తీసుకొని ఎలాంటి పత్రాలు లేనివారికి కూడా ఫారెస్ట్ భూముల్లో బోర్లు వేసుకునేందుకు గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నారు. ఇలా అటవీ భూముల్లో దాదాపు 500కు పైగా అక్రమ బోర్లు వేశారన్న అంచనాలున్నాయి.

ఈ ఏడాదే 100కి పైగా కొత్తగా వ్యవసాయ బోర్లు వేశారని సమాచారం. కారేపల్లి మండలంలో చీమలపాడు, మాణిక్కారం అటవీ ప్రాంతంలోనే పదుల సంఖ్యలో బోర్లు వేశారు. పోడు రైతుల నుంచి డబ్బులు వసూలు చేసి అక్రమంగా అటవీ భూముల్లో బోర్లు వేయించారనే ఆరోపణలపై కారేపల్లి ఫారెస్ట్ రేంజి పరిధిలోని పాటిమీదిగుంపు, చీమలపాడు సెక్షన్లలో విధులు నిర్వర్తిస్తున్న సెక్షన్ ఆఫీసర్ సాంబశివరావు, బీట్ఆఫీసర్లు విజయ, రమేశ్ ను డిస్ట్రిక్ట్ ఫారెస్ట్ ఆఫీసర్ సిద్ధార్థ్ విక్రమ్ సింగ్ ఇటీవల సస్పెండ్ చేశారు. పోడు భూముల్లో నిబంధనలకు విరుద్ధంగా బోర్లు వేస్తున్న బోర్​వెల్ యంత్రాన్ని కూడా సీజ్ చేసి జరిమానా విధించారు. కారేపల్లి రేంజి పరిధిలోని చీమలపాడు, పాటిమీదిగుంపు, తవిసిబోడు, రేలకాయలపల్లి, మాణిక్యారం ప్రాంతాల్లోని పోడు భూముల్లో అక్రమంగా వందల సంఖ్యలో బోర్లు వేశారు. గత ఐదేళ్లుగా ఈ అక్రమ బోర్ల వ్యవహారం సాగుతోంది. జిల్లా వ్యాప్తంగా సమగ్ర విచారణ జరిపిస్తే మరిన్ని అక్రమాలు వెలుగులోకి వచ్చే అవకాశముంది. 

అటవీశాఖ సిబ్బందిపై ఆరోపణలు

ఖమ్మం నగరంలో వివిధ సా మిల్లుల నుంచి మామూళ్లు వసూలు చేస్తున్నారన్న ఫిర్యాదులున్నాయి. ప్రకాశ్​నగర్, వరంగల్ క్రాస్ రోడ్ లో ఉన్న మిల్లుల నుంచి కొందరు సిబ్బంది ఆర్నెళ్లకు ఒకసారి రూ. లక్షలు ముక్కుపిండి వసూలు చేస్తున్నారన్న ఆరోపణలున్నాయి. కల్లూరు మండలంలో ఫారెస్ట్ సిబ్బంది డబ్బులు తీసుకుని అక్రమార్కులకు సహకరిస్తున్నారు. సా మిల్లుల వద్ద మామూళ్లు తీసుకొని వారికి సపోర్టు చేస్తున్నారు. అటవీ ప్రాంతం నుంచి వివిధ గ్రామాలకు చెందినవారు సుమారు 50 పైగా సైకిళ్ల మీద వెదురు బొంగులు, కర్రలు నిత్యం తరలిస్తున్నారు. ఫారెస్ట్ అధికారుల కనుసన్నల్లో జరుగుతున్నా ఎలాంటి చర్యలు చేపట్టడం లేదు. కూసుమంచి అటవీరేంజ్ పరిధిలో గతేడాది ముగ్గురు అధికారులను సస్పెండ్ చేశారు. జాతీయ రహదారి 365 (ఏ) నిర్మాణంలో భాగంగా రోడ్డుకు ఇరువైపులా ఉన్న పెద్ద వృక్షాలను నరికి తరలించేందుకు ఓ కాంట్రాక్టర్ కు టెండర్ ద్వారా ప్రభుత్వం అప్పగించింది. వాటి తరలింపులో నిర్లక్ష్యంతోపాటు, డబ్బులు డిమాండ్ చేయడం, పలు ఆరోపణలు రావడంతో ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ జ్యోత్స్నాదేవి, సెక్షన్ ఆఫీసర్ కవిత, బీట్ ఆఫీసర్ జ్యోతిలను సస్పెండ్ చేశారు. 

ఫారెస్ట్ సిబ్బంది ఇబ్బంది పెడుతున్నరు

గిరిజనులను కింది స్థాయి ఫారెస్ట్ సిబ్బంది చాలా ఇబ్బందులు పెడుతున్నారు. పైసలివ్వకపోతే గిరివికాస్ పథకం అమలు కాకుండా అడ్డుకుంటున్నారు. ట్రైబల్ వెల్ఫేర్ డిపార్ట్ మెంట్ ఆధ్వర్యంలో మంజూరైన స్కీమ్ పై ఫారెస్ట్ సిబ్బంది పెత్తనం లేకుండా చూడాలి. పోడు హక్కు పత్రాలున్న ప్రతి రైతుకు గిరివికాస్ పథకాన్ని అమలుచేయాలి. పోడు పట్టాలున్న గిరిజనులు సొంతంగా వ్యవసాయ బోరు వేసుకునేందుకు అనుమతినివ్వాలి. - భూక్యా వీరభద్రం, తెలంగాణ గిరిజన సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి