బోరిస్ జాన్సన్ ప్రభుత్వంపై అవిశ్వాసం

 బోరిస్ జాన్సన్ ప్రభుత్వంపై అవిశ్వాసం

బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ రాజీనామా చేయనున్నారు. ఆయన మంత్రివర్గం నుంచి ఇప్పటికే 54 మంది మంత్రులు వరుసగా రాజీనామాలు చేయడంతో.. బోరిస్ రాజీనామాకు సిద్దపడినట్లు తెలుస్తోంది. తాజాగా సమాచారం ప్రకారం ఈ రోజు బోరిస్ తన పదవికి రాజీనామా చేయబోతున్నారు. అయితే తదుపరి ప్రధాని ఎన్నికయ్యే వరకు తాత్కాలిక ప్రధానిగా బోరిస్ కొనసాగుతారని స్థానిక మీడియా కథనాలు వెలువడుతున్నాయి. కాగా, బోరిస్‌ రాజీనామా, తదుపరి ప్రధాని ఎవరనే విషయాలపై మరింత స్పష్టత రావాల్సి ఉంది. బోరిస్ జాన్సన్‌ ప్రభుత్వంపై తిరుగుబాటు చేస్తూ ఇప్పటికే చాలా మంది మంత్రులు రాజీనామా చేశారు. 

మంత్రుల రాజీనామాల పరంపర

ఈ నేపథ్యంలో బ్రిటన్ ప్రభుత్వం తీవ్ర సంక్షోభంలో పడింది. ఆయన నాయకత్వంపై విశ్వాసం కోల్పోయిన మంత్రుల సంఖ్య రోజురోజుకీ పెరిగిపోయింది. ప్రధాని పదవి నుంచి జాన్సన్ వైదొలగాలని మంగళవారం ఇద్దరు కేబినెట్ మంత్రులు రాజీనామా చేశారు. ఆరోగ్యశాఖ మంత్రి సాజిద్ జావిద్, ఆర్థికశాఖ మంత్రి రిషి సునాక్ రాజీనామా చేయగా.. బుధవారం మరో 15 మంది మంత్రులు వారికి జత కలిశారు. దౌత్యాధికారులు, ప్రభుత్వ ఉన్నతాధికారులు వరుస పెట్టి రాజీనామాలు చేస్తున్నారు.అయితే.. సొంత పార్టీ సభ్యులు, విపక్షఘాల నుంచి ఒత్తిళ్లు పెరుగుతున్నా ప్రధాని పదవి వీడేది లేదని స్పష్టం చేశారు బోరిస్ జాన్సన్. ఆర్ధిక మాంద్యం, రష్యా-ఉక్రెయిన్ యుద్ధం వల్ల పెనుసవాళ్లను ఎదుర్కొంటోందని.. ఇటువంటి టైంలో బాధ్యతల నుంచి పారియేది లేదన్నారు బోరిస్. అయితే తాజాగా మంత్రులు, ఎంపీల నుంచి తీవ్రంగా ఒత్తిడి రావడంతో..ప్రధాని పదవికి రాజీనామా చేయాలని బోరిస్ నిర్ణయించుకున్నారు. 

అనేక వివాదాల్లో చిక్కుకొని..

బ్రిటన్‌ ప్రధాని బోరిస్‌ జాన్సన్‌ ఇటీవల అనేక వివాదాల్లో చిక్కుకున్న విషయం తెలిసిందే. కరోనా సమయంలో అధికార నివాసంలో పార్టీ చేసుకున్నందుకు ఆయనపై దేశవ్యాప్తంగా విమర్శలు వెల్లువెత్తాయి. పార్టీలో కూడా బోరిస్‌ జాన్సన్‌ కు మద్దతు నానాటికీ తగ్గిపోతూ వస్తోంది. ఇటీవలి బలపరీక్షలో జాన్సన్‌ బొటాబొటిగా బయటపడ్డారు. ఆ తర్వాత ప్రభుత్వ డిప్యూటీ చీఫ్‌ విప్‌ క్రిస్‌ పించర్‌ వివాదం కూడా బోరిస్ మెడకు చుట్టుకుంది. 2019లో ప్రధాని జాన్సన్‌... క్రిస్‌ పించర్‌ను ప్రభుత్వ డిప్యూటీ చీఫ్‌ విప్‌గా నియమించారు. అప్పటికే అతని నడవడికకు సంబంధించి పలు ఆరోపణలు ఉన్నాయి.

తాగిన మత్తులో క్రిస్‌ పించర్‌..

ఆ విషయాన్ని ప్రభుత్వాధికారులు చెప్పినా జాన్సన్‌ పట్టించుకోకుండా క్రిస్‌ పించర్‌ను కీలకమైన పదవిలో కూర్చోబెట్టారు. ఇటీవల ఒక క్లబ్‌లో తాగిన మత్తులో క్రిస్‌ పించర్‌ ఇద్దరు వ్యక్తులతో అమర్యాదగా ప్రవర్తించడం తీవ్ర వివాదానికి దారి తీసింది. అయితే అతను ఇలాంటి వాడని తనకు తెలియదని ప్రధాని బోరిస్‌ తన తప్పును కప్పిపుచ్చుకునే ప్రయత్నం చేశారు. కానీ, పించర్‌ గురించి తాము ముందే నివేదించామని మాజీ అధికారి ఒకరు చెప్పడంతో బోరిస్‌ మరోసారి వివాదంలో చిక్కుకున్నారు. దీంతో బోరిస్‌పై తమకు విశ్వాసం లేదంటూ రిషి సునాక్‌, జావిద్‌ నిన్న మంత్రి పదవుల నుంచి తప్పుకొన్నారు. ప్రధాని కూడా వైదొలగాలని డిమాండ్‌ చేశారు. తాజాగా మరో ఇద్దరు మంత్రులు రాజీనామా చేయడంతో బోరిస్‌ జాన్సన్ ప్రభుత్వం సంక్షోభంలో కూరుకుపోయింది.