పీటీజీ కులాల వారు ఆధార్ కలిగి ఉండాలి : బొర్కడే హేమంత్ సహదేవరావు

పీటీజీ కులాల వారు ఆధార్ కలిగి ఉండాలి : బొర్కడే హేమంత్ సహదేవరావు

ఆసిఫాబాద్, వెలుగు: జిల్లాలోని పీటీజీ(కోలాం గిరిజనులు) కులాల వారు తప్పనిసరిగా ఆధార్ కార్డు కలిగి ఉండాలని ఆసిఫాబాద్ కలెక్టర్ బొర్కడే హేమంత్ సహదేవరావు అన్నారు. ప్రధానమంత్రి జన్​మన్ పథకం ద్వారా పీటీజీల అభివృద్ధిపై అడిషనల్ కలెక్టర్ దీపక్ తివారి, ఆర్డీఓ సురేశ్ తో కలిసి శనివారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో సమీక్షా సమావేశం నిర్వహించారు.

కలెక్టర్ మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం ఆదివాసీ, గిరిజనుల సంక్షేమానికి ప్రవేశపెట్టిన జన్ మన్ పథకం ద్వారా లబ్ధి పొందాలంటే తప్పనిసరిగా ఆధార్ కార్డు కలిగి ఉండాలన్నారు. ప్రధానమంత్రి కిసాన్ క్రెడిట్ కార్డ్, ఆయుష్మాన్ భారత్ పథకం కింద హెల్త్ కార్డులు జారీ చేస్తామని చెప్పారు. ఈ కార్యక్రమంలో పీటీజీ కుల సంఘాల నాయకులు, గ్రామ పటేళ్లు, సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు.

వెనుకబడిన గిరిజనుల అభివృద్ధికి ప్రత్యేక ప్రణాళికలు

జన్నారం: వెనుకబడిన కోలం, తోటి గిరిజన తెగల అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక ప్రణాళికలు రూపొందించిందని డీటీడీఓ మాడవి గంగారాం అన్నారు. జన్నారం మండలంలోని మారుమూల గ్రామమైన కొత్తపేటలో శనివారం ప్రధానమంత్రి జన జాతీయ ఆదివాసీ న్యాయ అభియాన్ కార్యక్రమం నిర్వహించారు. పాల్గొన్న కోలాం గిరిజనులను ఉద్దేశించి ఆయన మాట్లాడారు. మంచిర్యాల జిల్లాలోని 7 మండలాల్లోని 21 గ్రామాల్లో 1677 మందిని గుర్తించామన్నారు.

వీరికి ప్రధానమంత్రి జన జాతీయ పథకం కింద పక్కా ఇండ్లతో పాటు గ్రామాలకు రోడ్లు, అంగన్వాడీ సెంటర్లు,హెల్త్ సెంటర్లు ఏర్పాటు చేసి, అంత్యోదయ కార్డులు అందజేస్తామని తెలిపారు. అంతరించిపోతున్న ఆదిమ గిరిజనులను వెలుగులోకి తేవాలనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక ప్రణాళికతో ముందుకు సాగుతోందన్నారు. ఈ కార్యక్రమంలో కొత్తపేట సర్పంచ్ మలావత్ లావణ్య, తహసీల్దార్ వేణుగోపాల్, ఎంపీడీఓ అరుణారాణి,పంచాయతీ సెక్రటరీ భీంరావు తదితరులు పాల్గొన్నారు.