మోసంగా ప్రకటించే ముందు బారోవర్ల అభిప్రాయం తీసుకోవాల్సిందే : బ్యాంకులకు సుప్రీం కోర్టు ఆదేశం

మోసంగా ప్రకటించే ముందు బారోవర్ల అభిప్రాయం తీసుకోవాల్సిందే : బ్యాంకులకు సుప్రీం కోర్టు ఆదేశం

న్యూఢిల్లీ: మోసపూరిత అకౌంట్లుగా లోన్​ అకౌంట్లను ప్రకటించే ముందు బ్యాంకులు కచ్చితంగా ఎగవేతదారుల అభిప్రాయం తెలుసుకోవల్సిందేనని సుప్రీం కోర్టు సోమవారం తీర్పు ఇచ్చింది. సహజ న్యాయ సూత్రాలకు అనుగుణంగా బారోవర్లకు అవకాశం ఇవ్వాల్సిందేనని స్పష్టం చేసింది. బ్యాంకులు ఒకసారి లోన్​ అకౌంట్​ను మోసపూరిత అకౌంట్​గా ప్రకటిస్తే, బారోవర్​ సివిల్​, క్రిమినల్​ పరమైన అనేక చర్యలను ఎదుర్కోవల్సి వస్తుంది. మరో రకంగా చెప్పాలంటే బారోవర్​కు మరెక్కడా అప్పు పుట్టకుండా బ్లాక్​లిస్ట్​ చేసినట్లే అవుతుంది.

కాబట్టి, రిజర్వ్​ బ్యాంక్​ ఆఫ్​ ఇండియా ఫ్రాడ్​పై రిలీజ్​ చేసిన  మాస్టర్​ డైరెక్షన్స్​ ప్రకారం బారోవర్లకు తమ అభిప్రాయం చెప్పుకునేలా  ఒక అవకాశం ఇవ్వాలని సుప్రీం కోర్టు అభిప్రాయపడింది. ఉద్దేశపూర్వక ఎగవేత అకౌంట్లను  మోసపూరిత అకౌంట్లుగా ప్రకటించే వీలు బ్యాంకులకు కల్పిస్తూ ఆర్​బీఐ 2016 లో ఒక సర్క్యులర్​ను విడుదల చేసింది. ఈ సర్క్యులర్​పై వివిధ హై కోర్టులలో కేసులు కూడా దాఖలయ్యాయి. అయితే, ఎఫ్​ఐఆర్​ రిజిస్టర్​ చేసేముందుగానే బారోవర్​కు తన అభిప్రాయం చెప్పుకునే  అవకాశం ఇవ్వాల్సిన అవసరం లేదని సుప్రీం కోర్టు పేర్కొంది. 

బ్యాంకులకు ఇబ్బందే...

సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పు రికవరీలకు అడ్డుపడుతుందని బ్యాంకింగ్​ నిపుణులు చెబుతున్నారు. రికవరీ ప్రాసెస్​ చాలా ఆలస్యం అయ్యేందుకు ఈ తీర్పు వీలు కలిగిస్తుందని వారు అభిప్రాయపడుతున్నారు. దీంతో బ్యాంకులకు ఇబ్బందులపాలవుతాయని వివరిస్తున్నారు. సుప్రీం కోర్టు ఆర్డరుతో బ్యాంకులు పాటించాల్సిన ప్రాసెస్​లు ఎక్కువవుతాయని స్టేట్​ బ్యాంక్​ ఆఫ్​ ఇండియా (ఎస్​బీఐ) మాజీ ఛైర్మన్​ రజ్​నీష్​ కుమార్​ చెప్పారు. కేసులలో మరింత జాప్యం పెరిగితే బ్యాంకులపై అదనపు ఆర్థిక భారం పడుతుందని బ్యాంకింగ్​ ఎక్స్​పర్ట్​ నరేష్​ మల్హోత్రా పేర్కొన్నారు. సుప్రీం కోర్టు తీర్పు వల్ల  లీగల్​, లిటిగేషన్ ​ఖర్చుల రూపంలో బ్యాంకులపై అదనపు భారం పడకతప్పదని ఎకనమిక్​ లా ప్రాక్టీస్​ సంస్థ సీనియర్​ కౌన్సెల్​ ముకేష్​ చంద్​ చెప్పారు.