మదర్ డెయిరీ ఎన్నికల్లో ఇద్దరు బీఆర్ఎస్‎ డైరెక్టర్లు గెలుపు

మదర్ డెయిరీ ఎన్నికల్లో ఇద్దరు బీఆర్ఎస్‎ డైరెక్టర్లు గెలుపు

యాదాద్రి, వెలుగు: మదర్​ డెయిరీ ఎన్నికల్లో బీఆర్ఎస్​నుంచి ఇద్దరు డైరెక్టర్లు, కాంగ్రెస్​నుంచి ఒకరు డైరెక్టర్‎గా గెలుపొందారు. ఇటీవల ముగ్గురు డైరెక్టర్ల పదవీ కాలం ముగియడంతో ఆయాస్థానాలకు శనివారం ఎన్నికలు నిర్వహించారు. తుంగతుర్తి పరిధిలోని 2 స్థానాలకు 5 మంది పోటీ చేయగా.. వీరిలో ఇద్దరు బీఆర్ఎస్, ముగ్గురు కాంగ్రెస్‎కు చెందినవారు. నకిరేకల్​పరిధిలోని ఒక పోస్టుకు నలుగురు పోటీ చేశారు. హయత్​నగర్‎లో జరిగిన ఎన్నికల్లో తుంగతుర్తి పరిధిలోని రెండు డైరెక్టర్ల పోస్టులను బీఆర్ఎస్​గెలుపొందింది. బీఆర్ఎస్​మద్దతుతో పోటీ చేసిన రచ్చ లక్ష్మీ నర్సింహారెడ్డికి 154 ఓట్లు, భాస్కర్ గౌడ్​ 240 ఓట్లతో గెలుపొందారు. 

కాంగ్రెస్​ మద్దతుతో బరిలో నిలిచిన శీలం వెంకటనర్సింహారెడ్డికి 152 ఓట్లు సాధించారు. నకిరేకల్​ఎమ్మెల్యే వేముల వీరేశం మద్దతుతో పోటీ చేసిన కర్నాటి జయశ్రీ 176 ఓట్లతో గెలుపొందారు. బీఆర్ఎస్​అభ్యర్థి రచ్చ లక్ష్మి నర్సింహారెడ్డి గెలిపించేందుకు ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల అయిలయ్య, డీసీసీ ప్రెసిడెంట్​సంజీవరెడ్డి, మదర్​డెయిరీ చైర్మన్​మధుసూదన్​రెడ్డి ఒప్పందం చేసుకున్నారంటూ తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామెల్​ ఆరోపించిన విషయం తెలిసిందే. మెజారిటీ చైర్మన్లు కాంగ్రెస్‎కు ఉన్నా.. బీఆర్ఎస్​రెండింటిని కైవసం చేసుకోవడం గమనార్హం. 308 పాల సొసైటీల చైర్మన్లు ఓట్లు వేశారు.