బిజినెస్ డెస్క్, వెలుగు: ఫుడ్ డెలివరీ సెగ్మెంట్ రూపు రేఖలను స్విగ్గీ, జొమాటో మార్చాయనడంలో సందేహం లేదు. ఈ రెండు కంపెనీలు వివిధ ఆఫర్లను ప్రకటిస్తూ ఒకదానితో ఒకటి తీవ్రంగా పోటీ పడుతున్నాయి. తాజాగా మార్కెట్‌లోకి ఎంట్రీ ఇచ్చిన ప్రభుత్వానికి చెందిన ఓపెన్ నెట్‌వర్క్ ఫర్ డిజిటల్ కామర్స్ (ఓఎన్‌డీసీ) ఈ రెండింటిని సవాలు చేస్తోంది. ఓఎన్‌డీసీ కిందటేడాది సెప్టెంబర్‌లోనే అందుబాటులోకి వచ్చినప్పటికీ తాజాగా పాపులర్ అవుతోంది. యూజర్లు జొమాటో, స్విగ్గీ, ఓఎన్‌డీసీలలోని ధరలను పోల్చి చూస్తున్నారు.
జొమాటో, స్విగ్గీ మాదిరి కాకుండా ఓఎన్‌డీసీలో రెస్టారెంట్లే డైరెక్ట్‌గా కస్టమర్లతో ఇంటరాక్ట్ అవుతాయి. దీంతో వీటిలో కంటే ఓఎన్‌డీసీ నెట్‌వర్క్‌లో రేట్లు తక్కువగా ఉంటున్నాయి. నెటిజన్లు కూడా జొమాటో, ఓఎన్‌డీసీ, స్విగ్గీలలోని రేట్లను పోల్చుతున్నారు. ‘ఒకే ప్రొడక్ట్, ఒకే ప్లేస్, ఒకే టైమ్ కానీ, రేట్ల మధ్య తేడా క్లియర్‌గా కనిపిస్తోంది’ అంటూ ఓ యూజర్ ఓఎన్‌డీసీ, స్విగ్గీలోని ప్రొడక్ట్ ధరను పోల్చుతూ ట్వీట్ చేశారు.
ఆయన ఓఎన్‌డీసీఓలో పనీర్ బర్గర్ అండ్ పెప్సీని ఆర్డర్ చేయగా దీని ధర రూ.185.57 గా చూపించింది. అదే స్విగ్గీలో ఈ ఫుడ్ ఐటెమ్ ధర రూ.309 గా ఉంది. మరో యూజర్ ఓఎన్‌డీసీలోని కేఫ్ కాఫీడే నుంచి ‘బిగ్ తందూరి పనీర్ బర్గర్’ ను ఆర్డర్ పెట్టడానికి ప్రయత్నించగా, ఈ నెట్‌వర్క్‌లో దీని ధర రూ.270 గా ఉంది. అదే స్విగ్గీ, జొమాటోలో ఇదే ఫుడ్ ఐటెమ్ ధర రూ. 359 గా ఉంది. చాలా మంది మెక్‌డొనాల్డ్స్, టాకోబెల్, బెహ్రూజ్, వావ్! మోమో, బీటీడబ్ల్యూ వంటి రెస్టారెంట్లలో రేట్లు ఎలా ఉన్నాయో పోల్చుతూ ట్వీట్స్ చేస్తున్నారు. వెలుగు కూడా వీటి మధ్య తేడాను పోల్చింది. మెంబర్‌షిప్ ఆఫర్లు, డిస్కౌంట్లను అప్లయ్ చేసిన తర్వాత కూడా జొమాటో, స్విగ్గీలలో కంటే ఓఎన్‌డీసీలో ప్రొడక్ట్‌ల ధరలు తక్కువగా ఉన్నాయి.
బ్లూమ్‌బర్గ్ ఈ ఇష్యూకి సంబంధించి ఓ రిపోర్ట్ చేసింది. ఈ సంస్థ వావ్! మోమో నుంచి చికెన్ మోబర్గ్ (1+1) ను ఆర్డర్ పెట్టింది. దీని ధర రూ.121 కాగా, మొదటిసారి వాడుతున్నందుకు ప్రమోషనల్‌గా రూ.100 డిస్కౌంట్ దక్కించుకుంది. కన్వేనియెన్స్ ఫీజులు, డెలివరీ ఛార్జీలు జీరో కాగా, ఈ ప్రొడక్ట్ కేవలం రూ.30.3 కే పొందింది. ‘ఈ ఆర్డర్‌ను పేటీఎం ద్వారా ఓఎన్‌డీసీలో పెట్టాం. జొమాటోకి చెందిన మ్యాజిక్‌పిన్ ఈ ట్రాన్సాక్షన్‌ను పూర్తి చేసింది. డెలివరీ మాత్రం మాజిక్‌పిన్‌తో టై అప్ అయిన డంజో చేసింది’ అని బ్లూమ్‌బర్గ్ పేర్కొంది.
ఓఎన్‌డీసీ అంటే?
ప్రభుత్వానికి చెందిన ఓఎన్‌డీసీ నెట్‌వర్క్ చిన్న బిజినెస్‌లకు వరంలా మారింది. 2030 నాటికి దేశంలో ఆన్‌లైన్‌లో షాపింగ్ చేసే వారి సంఖ్య 30 కోట్లకు చేరుకుంటుందని రిపోర్ట్స్ చెబుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో అమెజాన్, ఫ్లిప్‌కార్ట్, జొమాటో, స్విగ్గీ వంటి ఆన్‌లైన్ ప్లాట్‌ఫామ్‌ల మోనోపొలికి ఓఎన్‌డీసీ అడ్డుకట్ట వేస్తుంది. చిన్న, పెద్ద బిజినెస్‌లన్నీ ఫ్రీగా ఓఎన్‌డీసీ నెట్‌వర్క్‌లో జాయిన్ అవ్వొచ్చు. కస్టమర్లకు ఆన్‌లైన్‌లోనే సర్వీస్‌లను అందించొచ్చు. కేవలం రెస్టారెంట్లే కాకుండా ప్రతీ బిజినెస్ కూడా ఆన్‌లైన్ బాట పట్టడానికి ఓఎన్‌డీసీ సాయపడుతుంది. యూపీఐ మాదిరి ఓఎన్‌డీసీ కూడా రివల్యూషన్ తెస్తుందని నిపుణులు చెబుతున్నారు.
ఎలా వాడాలంటే?
ఓఎన్‌డీసీ యూపీఐ మాదిరి పనిచేస్తుంది. పేటీఎం, మ్యాజిక్‌పిన్, మీషో, మైస్టోర్ వంటి కంపెనీలు ఈ నెట్‌వర్క్‌ను తమ యాప్‌ల ద్వారా కస్టమర్లకు ఆఫర్ చేస్తున్నాయి. ఓఎన్‌డీసీ వెబ్‌సైట్ కూడా ఉంది. ప్రొడక్ట్‌లు, సర్వీస్‌ల అగ్రిగేటర్‌గా ఈ నెట్‌వర్క్ పనిచేస్తోంది. ప్రస్తుతం ఈ నెట్‌వర్క్‌లో 29 వేల మంది సెల్లర్లు, 36 లక్షలకు పైగా ప్రొడక్ట్‌లను అమ్ముతున్నారు. ఓఎన్‌డీసీని వాడాలనుకునే వారు పేటీఎం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకొని, సెర్చ్ బార్‌లో ఓఎన్‌డీసీ అని టైప్ చేసి, ఈ నెట్‌వర్క్‌లోకి ఎంటర్ అవ్వొచ్చు. రెస్టారెంట్లన్నీ ఈ నెట్‌వర్క్‌లో రిజిస్టర్ కాలేదని గుర్తు పెట్టుకోవాలి. అందువలన మీకు నచ్చిన రెస్టారెంట్ నుంచి ఆర్డర్ చేసుకోవడం కుదరకపోవచ్చు.
ఆర్డర్ల రికార్డ్..
కిందటి నెల 29 నుంచి ఓఎన్‌డీసీ నెట్‌వర్క్‌లో సగటున రోజుకి10 వేల రిటైల్ ఆర్డర్లు రిజిస్టర్ అవుతున్నాయని సంబంధిత వ్యక్తులు పేర్కొన్నారు. ఓఎన్‌డీసీ నెట్‌వర్క్ ప్రస్తుతం 240 సిటీలలో అందుబాటులో ఉంది. 70 శాతం పిన్‌కోడ్‌లలో కనీసం ముగ్గురు సెల్లర్లయినా ఈ నెట్‌వర్క్ ద్వారా తమ ప్రొడక్ట్‌లను అమ్ముతున్నారని సంబంధిత వ్యక్తులు వెల్లడించారు. గ్రోసరీ, ఫుడ్ డెలివరీ, బ్యూటీ, పర్సనల్ కేర్ , ఫ్యాషన్, ఎలక్ట్రానిక్స్, మొబిలిటీ వంటి వివిధ సెగ్మెంట్లలోని వ్యాపారులు ఈ నెట్‌వర్క్‌ను వాడుకొని డైరెక్ట్‌గా కస్టమర్లతో ఇంటరాక్ట్ అవ్వొచ్చు. థర్డ్ పార్టీ ప్లాట్‌ఫామ్స్‌కు ఎటువంటి ఛార్జీలు చెల్లించాల్సిన అవరం ఉండదు.