పార్లమెంట్​లో మూడోరోజూ అదే లొల్లి

పార్లమెంట్​లో మూడోరోజూ అదే లొల్లి
  • ఎలాంటి కార్యకలాపాలు  లేకుండానే ఉభయసభలు వాయిదా 

న్యూఢిల్లీ:  పార్లమెంట్ బడ్జెట్ సెషన్ రెండో విడత సమావేశాల్లో వరుసగా మూడోరోజూ అదే గందరగోళం నెలకొంది. అటు అధికార పక్షం, ఇటు ప్రతిపక్షాల సభ్యులు అరుపులు, నినాదాలతో బుధవారం కూడా ఎలాంటి కార్యకలాపాలు జరగకుండానే ఉభయసభలు వాయిదాపడ్డాయి. అదానీ గ్రూప్ ఇష్యూపై జాయింట్ పార్లమెంటరీ కమిటీ(జేపీసీ)ని వేయాలంటూ కాంగ్రెస్, ఇతర ప్రతిపక్షాల సభ్యులు ఉభయసభల్లో ఆందోళన చేశారు. ప్లకార్డులు ప్రదర్శిస్తూ, నినాదాలతో హోరెత్తించారు. మరోవైపు, దేశంలో ప్రజాస్వామ్యంపై దాడి జరుగుతోందంటూ లండన్ లో కామెంట్స్ చేసిన రాహుల్ గాంధీ క్షమాపణలు చెప్పాలంటూ బీజేపీ సభ్యులు కూడా ఆందోళనకు దిగారు. రాజ్యసభలో ప్రతిపక్ష నేత మల్లికార్జున ఖర్గే మాట్లాడుతుండగా బీజేపీ సభ్యులు నిరంతరం నినాదాలు చేశారు. సభ సజావుగా సాగేలా సహకరించాలని రాజ్యసభ చైర్మన్ జగ్ దీప్ ధన్ కర్ కోరినా ఫలితం లేకపోయింది. దీంతో ఉదయం నుంచి మధ్యాహ్నం వరకూ పలు సార్లు సభకు అంతరాయం కలిగింది. చివరకు సభను చైర్మన్ మరునాటికి వాయిదా వేశారు. లోక్​సభలోనూ అధికార, ప్రతిపక్షాల సభ్యులు పోటాపోటీగా నినాదాలు చేశారు. దీనిపై స్పీకర్ ఓం బిర్లా అసహనం వ్యక్తం చేశారు. పలు వాయిదాల తర్వాత మధ్యాహ్నం 2 గంటలకు సభ తిరిగి ప్రారంభమైనా మళ్లీ అదే గందరగోళం నెలకొంది. దీంతో స్పీకర్ స్థానంలో ఉన్న భర్తృహరి మహతాబ్ సభను మరునాటికి వాయిదావేశారు. 

18 ప్రతిపక్షాల ర్యాలీ.. 

అదానీ గ్రూప్ ఇష్యూపై ఢిల్లీలో18 ప్రతిపక్ష పార్టీలు నిరసన ర్యాలీ చేపట్టగా పోలీసులు అడ్డుకున్నారు. బుధవారం మధ్యాహ్నం పార్లమెంట్ హౌస్ నుంచి ఈడీ ఆఫీసుకు ర్యాలీగా బయలుదేరిన అపొజిషన్ లీడర్లను విజయ్ చౌక్ వద్ద పోలీసులు ఆపేశారు. అదానీ గ్రూప్ వివాదంపై దర్యాప్తు చేయాలంటూ ఈడీకి కంప్లయింట్ చేసేందుకు గాను కాంగ్రెస్, శివసేన (యూబీటీ), బీఆర్ఎస్ సహా వివిధ పార్టీల నేతలు ఈ ర్యాలీని చేపట్టారు. అయితే, ఈడీ ఆఫీసు వద్ద భద్రతను కట్టుదిట్టం చేసిన పోలీసులు.. ఆ పరిసర ప్రాంతాల్లో 144 సెక్షన్ విధించారు. ప్రతిపక్ష నేతలను విజయ్ చౌక్ వద్దే అడ్డుకోవడంతో వారు తిరిగి 
పార్లమెంట్ హౌస్​కు చేరుకున్నారు.

విదేశీ కంపెనీకి డిఫెన్స్ కాంట్రాక్టా?: ప్రతిపక్షాల మండిపాటు  

అదానీ గ్రూప్ కంపెనీలో పెట్టుబడులు పెట్టిన ఒక విదేశీ కంపెనీకి డిఫెన్స్ కాంట్రాక్ట్ ఇచ్చారన్న ఓ ఇంగ్లిష్ పత్రిక కథనాన్ని ప్రస్తావిస్తూ బుధవారం పలువురు ప్రతిపక్ష నేతలు కేంద్రంపై మండిపడ్డారు. ‘‘మిసైల్స్, రాడార్, కమ్యూనికేషన్ సిస్టంల అభివృద్ధి కోసం డీఆర్డీవో, ఇస్రోతో కలిసి పని చేసేలా బెంగళూరుకు చెందిన ఆల్ఫా డిజైన్ టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్ అనే డిఫెన్స్ కంపెనీకి రక్షణ శాఖ రూ. 590 కోట్ల కాంట్రాక్ట్ ఇచ్చింది. ఆల్ఫా కంపెనీలో అదానీ గ్రూప్ తో పాటు మారిషస్ కు చెందిన ఎలారా ఇండియా ఆపర్చునిటీస్ ఫండ్ అనే కంపెనీ కూడా భాగస్వామిగా ఉంది. అదానీ గ్రూప్ లో ఎలారా కంపెనీ పెట్టుబడులు కూడా పెట్టింది. అయితే, అదానీ కోసమే రక్షణ రంగంలో కీలకమైన కాంట్రాక్ట్ ను ఇలా విదేశీ కంపెనీకి కట్టబెట్టారు” అంటూ కాంగ్రెస్ నేతలు ప్రియాంక గాంధీ, జైరాం రమేశ్, తృణమూల్ ఎంపీ మహువా మోయిత్రా, శివసేన (యూబీటీ) ఎంపీ ప్రియాంక చతుర్వేది, తదితరులు ఆరోపించారు.