Mary Kom: చెఫ్ డి మిష‌న్ పదవి నుంచి వైదొలిగిన మేరీకోమ్‌

Mary Kom: చెఫ్ డి మిష‌న్ పదవి నుంచి వైదొలిగిన మేరీకోమ్‌

ఆరుసార్లు ప్రపంచ ఛాంపియన్‌, లెజెండరీ బాక్సర్ మేరీ కోమ్ పారిస్ ఒలింపిక్స్‌కు భారత చెఫ్-డి-మిషన్ పదవి నుంచి వైదొలిగారు. వ్యక్తిగత కారణాల వల్ల ఆమె ఆ పదవి నుంచి వైదొలిగినట్లు పిటిఐ నివేదిక తెలిపింది. ఈ పాత్ర నుండి తప్పుకోవడం తనకు ఇబ్బందిగా ఉందని, అయితే మరో మార్గం లేదని కోమ్ చెప్పినట్లు పిటిఐ వెల్లడించింది. 

2024లో పారిస్‌ వేదికగా జరగబోయే ఒలింపిక్స్‌లో భారత అథ్లెట్లకు మార్గనిర్దేశం చేయడానికి, మెంటార్‌గా ఉండటానికి ఈ ఏడాది మార్చిలో భారత ఒలింపిక్ సంఘం (IOA) మేరీకోమ్‌‌ను చెఫ్-డి-మిషన్‌గా నియమించింది. లూగర్ శివ కేశవన్‌ని ఆమెకు డిప్యూటీగా నియమించారు. అయితే, ఆమె అర్థాంతరంగా ఎందుకు వైదొలిగింది అనేది తెలియడం లేదు.

మేరీకోమ్ తన పదవి నుంచి రిలీవ్ కావాలని లేఖలో కోరినట్లు భారత ఒలింపిక్ సంఘం (ఐఓఏ) ప్రెసిడెంట్ పీటీ ఉష తెలిపారు. " దేశానికి సేవ చేయడాన్ని నేను గౌరవంగా భావిస్తున్నాను.. అందుకు నేను మానసికంగా సిద్ధమయ్యాను. అయినప్పటికీ, నేను ప్రతిష్టాత్మకమైన బాధ్యతను సమర్థించలేనందుకు చింతిస్తున్నాను. వ్యక్తిగత కారణాల వల్ల రాజీనామా చేయాలనుకుంటున్నాను.. వైదొలగడం ఇబ్బందికరంగానే ఉంది, కానీ నాకు వేరే మార్గం లేదు. నా దేశం తరుపున ఒలింపిక్ క్రీడలలో పోటీపడుతున్న అథ్లెట్లను ఉత్సాహపరిచేందుకు నేను అక్కడ ఉంటాను.. " అని మేరీకోమ్‌ లేఖ రాసినట్లు పీటీ ఉష వెల్లడించింది.