
గాలి పటం కోసం వెళ్లిన బాలుడు బిల్డింగ్‌పై నుండి పడి మృతి చెందిన ఘటన సికింద్రాబాద్‌లో జరిగింది. ఉమేష్ అనే వ్యక్తి కుటుంబంతో కలిసి కర్ణాటక నుండి బతుకుదెరువు కోసం వచ్చి సికింద్రాబాద్‌లోని సెకండ్ బజార్‌లో స్థిరపడ్డాడు. ఉమేష్ కుమారుడు ఓంకార్ స్థానిక ఠాగూర్ హోమ్ పాఠశాలలో నాలుగో తరగతి చదువుతున్నాడు.
ఓంకార్ మంగళవారం మధ్యాహ్నం చెట్టుకు తట్టుకొని ఉన్న గాలిపటాన్ని మూడంతస్తుల భవనంపై నుండి తీసుకునే ప్రయత్నం చేశాడు. ఈ ప్రయత్నంలో ప్రమాదవశాత్తు కింద పడి తీవ్రంగా గాయపడ్డాడు. స్థానికులు, కుటుంబ సభ్యులు బాలుడిని ఓ ఆస్పత్రికి తరలించారు. అక్కడ వైద్యులు బాలుడికి చికిత్స అందిస్తుండగా సాయంత్రం సుమారు ఏడు లేదా ఎనిమిది గంటల మధ్య మృతి చెందాడు. సమాచారం తెలుసుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని మృతదేహాన్ని గాంధీ ఆస్పత్రి మార్చురీకి తరలించి దర్యాప్తు చేస్తున్నారు.