బ్రహ్మోస్.. మరోసారి సక్సెస్

బ్రహ్మోస్.. మరోసారి సక్సెస్

ప్రపంచంలోనే వేగవంతమైన సూపర్ సోనిక్ క్రూయిజ్ క్షిపణి ‘బ్రహ్మోస్’ మరోసారి సత్తా చాటింది. మంగళవారం ఉదయం 8.30 గంటలకు ఒడిశా చాందీపూర్ లోని ఇంటిగ్రేటెడ్ టెస్ట్ రేంజ్ (ఐటీఆర్) మూడో లాంచ్ కాంప్లెక్స్ నుంచి బ్రహ్మోస్ మిసైల్ ట్రయల్ ను విజయవంతంగా పూర్తి చేసినట్లు డీఆర్డీఓ వెల్లడించింది. టెస్ట్ లో నిర్దేశించిన అన్ని పారామీటర్స్ ను ఈ మిసైల్ పూర్తి చేసినట్లు తెలిపింది. బ్రహ్మోస్.. మీడియం రేంజ్ రాంజెట్ సూపర్ సోనిక్ క్రూయిజ్ మిసైల్. ఇది 300 కిలోల వార్ హెడ్లను మోసుకుని, గరిష్టంగా మ్యాక్ 3 (ధ్వనివేగానికి మూడు రెట్లు ఎక్కువ వేగం) వేగంతో అంటే.. గంటకు 3,700 కిలోమీటర్ల వేగంతో దూసుకెళుతుంది. మీడియం రేంజ్ వెర్షన్ క్షిపణి 450 కిలోమీటర్ల పరిధిలోని టార్గెట్లను ధ్వంసం చేయగలదు. నేలపై మొబైల్ లాంచర్ వెహికిల్స్ నుంచి, గగనతలంలో యుద్ధవిమానాల నుంచి, సముద్రంలో సబ్ మెరైన్లు, యుద్ధనౌకల నుంచి.. అవసరాన్ని బట్టి ఎప్పుడైనా, ఎక్కడి నుంచైనా దూసుకెళ్లి ఇది టార్గెట్లను నేలమట్టం చేయగలదు. దీనిని డీఆర్డీఓ, రష్యాకు చెందిన ఎన్ పీఓఎం సంస్థలు సంయుక్తంగా డెవలప్ చేశాయి. ప్రస్తుతం ఈ మిసైల్ ను ఇండియన్ ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ వాడుతున్నాయి.