యాదాద్రిలో వైభవంగా కొనసాగుతోన్న వార్షిక బ్రహ్మోత్సవాలు

యాదాద్రిలో వైభవంగా కొనసాగుతోన్న వార్షిక బ్రహ్మోత్సవాలు

యాదగిరిగుట్ట, వెలుగు : యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామి క్షేత్రంలో జరుగుతున్న వార్షిక బ్రహ్మోత్సవాలు బుధవారం తొమ్మిదో రోజుకు చేరుకున్నాయి. బుధవారం ఉదయం శ్రీమహావిష్ణువు అలంకారంలో గరుడ వాహనంపై స్వామివారు విహరించారు. ఈ సేవతో అలంకరణ సేవలు ముగిశాయని ప్రధానార్చకులు నల్లంథీగల్ లక్ష్మీనరసింహాచార్యులు తెలిపారు. రాత్రి ప్రధానాలయ మాడవీధుల్లో ‘దివ్యవిమాన రథోత్సవం’ నిర్వహించారు. ముందుగా ఇచ్చిన షెడ్యూల్ ప్రకారం రాత్రి 7 గంటలకు రథోత్సవరం ప్రారంభం కావాల్సి ఉండగా, రాత్రి 10 గంటల తర్వాత ప్రారంభించారు. డెకరేషన్, లైటింగ్ పనుల్లో జాప్యం వల్లే రథోత్సవ ఊరేగింపు ఆలస్యమైందని తెలిసింది.

మొదట పశ్చిమ రాజగోపురం ఎదుట రథం ముందు రథాంగ హోమం, రథబలి నిర్వహించి రథోత్సవానికి శ్రీకారం చుట్టారు. మంగళవారం రాత్రి 10:17 గంటలకు తులా లగ్నంలో లక్ష్మీ అమ్మవారిని పెండ్లాడిన నారసింహుడు..బుధవారం అందంగా అలంకరించిన రథంలో ఆశీనులై ఆలయ మాడవీధుల గుండా ప్రధానాలయం చుట్టూ విహరించారు. ఉత్సవాల్లో ఆలయ చైర్మన్  నరసింహమూర్తి, ఈఓ గీతారెడ్డి, డిప్యూటీ ఈవో దోర్బల భాస్కర్, ఏఈవోలు శ్రావణ్, గజవెల్లి రమేశ్​ బాబు, రఘు, రామ్మోహన్, జూషెట్టి కృష్ణ, సూపరింటెండెంట్ దొమ్మాట సురేందర్ రెడ్డి పాల్గొన్నారు.

నేడు పూర్ణాహుతి, చక్రతీర్థం

బ్రహ్మోత్సవాలలో భాగంగా పదో రోజైన గురువారం ఉదయం‌ 10:30 గంటలకు ఆలయంలో మహాపూర్ణాహుతి, చక్రతీర్థం నిర్వహించనున్నారు. అలాగే సాయంత్రం 6 గంటలకు శ్రీపుష్పయాగం, దేవతోద్వాసన, దోపు ఉత్సవాన్ని జరపనున్నారు.