పాలమూరు ప్రాజెక్ట్ కొత్తది.. నీళ్ల కేటాయింపు మా పరిధిలో లేదు: బ్రజేశ్ కుమార్ ట్రిబ్యునల్

పాలమూరు ప్రాజెక్ట్ కొత్తది.. నీళ్ల కేటాయింపు మా పరిధిలో లేదు:  బ్రజేశ్ కుమార్ ట్రిబ్యునల్

 హైదరాబాద్, వెలుగు : పాలమూరు – రంగారెడ్డి ప్రాజెక్ట్​కు 90 టీఎంసీల నికర జలాలు కేటాయిస్తూ తెలంగాణ సర్కార్ జారీ చేసిన జీవో నంబర్ 246పై ఏపీ దాఖలు చేసిన పిటిషన్​ను బ్రజేశ్ కుమార్ ట్రిబ్యునల్ తోసిపుచ్చింది. జస్టిస్ బ్రజేశ్ కుమార్, జస్టిస్ రామ్మోహన్ రెడ్డి, జస్టిస్ తలపాత్రతో కూడిన ట్రిబ్యునల్ బుధవారం ఈమేరకు తీర్పునిచ్చింది. ఈ అంశంపై విచారించే న్యాయ పరిధి తమకు లేదని, ఏదైన ఇతర ఫోరమ్​లో అప్పీల్ చేసుకోవాలని ఏపీకి సూచించింది. 

ఈ ప్రాజెక్ట్ కొత్తదని, రాష్ట్ర విభజన తర్వాత చేపట్టింది కావడంతో దీనికి నీటి కేటాయింపులు చేసే హక్కు తమకు లేదని స్పష్టం చేసింది. ఏపీ పిటిషన్​ను ట్రిబ్యునల్ తోసిపుచ్చడంతో పాలమూరు – రంగారెడ్డి ఎత్తిపోతలకు అనుమతులివ్వాలని రాష్ట్ర ప్రభుత్వం సీడబ్ల్యూసీకి సమర్పించిన డీపీఆర్​ను పరిగణలోకి తీసుకునే అవకాశం ఏర్పడింది. అదే టైమ్​లో ఈ ప్రాజెక్ట్​ను కొత్తదిగా పేర్కొనడంతో అపెక్స్ కౌన్సిల్ ఆమోదం తప్పనిసరి అయ్యింది. 

కేంద్ర జలశక్తి శాఖ మంత్రి చైర్మన్​గా ఉండే అపెక్స్ కౌన్సిల్​లో తెలంగాణ, ఏపీ సీఎంలు సభ్యులుగా ఉంటారు. అంటే, పాలమూరు ప్రాజెక్ట్ గట్టెక్కాలంటే ఏపీ సీఎం ఆమోదం కూడా తప్పనిసరి. దీంతో ట్రిబ్యునల్​తీర్పుతో తెలంగాణకు కాస్త ఊరట దక్కినా.. అంతకు మించి న్యాయపరమైన చిక్కులను తెలంగాణ అధిగమించాల్సిన పరిస్థితి తలెత్తింది.