ఒక్కరోజులో 816 మంది మృతి.. 14 వేలకు పైగా కేసులు

ఒక్కరోజులో 816 మంది మృతి.. 14 వేలకు పైగా కేసులు
  • బ్రెజిల్ లో కరోనా విలయ తాండవం
  • ప్రెసిడెంట్​తో విభేదించి హెల్త్ మినిస్టర్ రిజైన్

బ్రెసీలియా: బ్రెజిల్ లో కరోనా విజృంభిస్తోంది. గడిచిన 24 గంటల్లో 816 మంది వైరస్ బారిన పడి చనిపోయారని అక్కడి ఆరోగ్యశాఖ వెల్లడించింది. మృతుల సంఖ్య 15,633 కు పెరిగిందని తెలిపింది. శనివారం నుంచి ఆదివారం ఉదయం వరకు ఒక్కరోజులోనే 14,919 కొత్త కేసులు నమోదయ్యాయని తెలిపింది. దీంతో దేశంలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 2,33,142 కు చేరుకుందని ప్రకటించింది. అంతకు ముందు రోజు కూడా 800 మందికి పైగా మృతిచెందగా.. 15 వేలకు పైగా కొత్త కేసులు నమోదయ్యాయి. కరోనా అత్యధికంగా వ్యాప్తి చెందుతున్న దేశాల్లో యూఎస్, రష్యా, యూకే తర్వాత బ్రెజిల్ నాలుగో స్థానంలో ఉంది.

ఆరోగ్య మంత్రి రాజీనామా
కరోనా ఎఫెక్టుతో బ్రెజిల్​లో రాజకీయాలు వేగంగా మారుతున్నాయి. మంత్రిగా బాధ్యతలు తీసుకుని నెల గడవకముందే అక్కడి హెల్త్ మినిస్టర్ నెల్సన్ టీచ్ తన పదవికి రిజైన్ చేశారు. దేశవ్యాప్తంగా కరోనా కేసులు విజృంభిస్తుండటంతో ఆయనపై అనేక విమర్శలు వచ్చాయి. దీంతో తన పదవికి ఆదివారం రాజీనామా చేశారు. గడిచిన నెల రోజుల్లోనే కరోనా కట్టడికి తీసుకునే చర్యల్లో ప్రెసిడెంట్ జైర్ బోల్సోనారో తో వ్యతిరేకించి రాజీనామా చేసిన రెండో హెల్త్ మినిస్టర్ గా టీచ్ రికార్డుకెక్కారు.
ఓ వైపు తీవ్ర స్థాయిలో కరోనా కేసులు నమోదవుతుండగా బ్రెజిల్ ప్రెసిడెంట్ బోల్సోనారో.. స్కూల్స్, కాలేజీలు, దుకాణాలు, రెస్టారెంట్లు మూసివేతను వ్యతిరేకించారు. లాక్​డౌన్ లోనూ సడలింపులు ప్రకటించారు. దేశ ఆర్థిక వ్యవస్థను గట్టెక్కించేందుకు వ్యాపార కార్యకలాపాలపై ఆంక్షలను సడలించారు. దీంతో మంత్రిత్వ శాఖలో ప్రెసిడెంట్ తో విభేదాలు రావడంతో గడిచిన నెల రోజుల్లో ఇద్దరు హెల్త్ మినిస్టర్లు తమ పదవుల నుంచి వైదొలిగారు.