నవ్వినందుకు ఏడుగురిని కాల్చి చంపిండు

నవ్వినందుకు ఏడుగురిని కాల్చి చంపిండు

వెర్రి కోపం.. మనిషితో దారుణమైన పనులు చేయిస్తుంది. అలాంటి ఘటనే బ్రెజిల్ లో చోటుచేసుకుంది. ఒలివెయిరా (30) అనే వ్యక్తి పూల్ గేమ్ లో ఓడిపోయినందుకు పక్కనే ఉన్న ఏడుగురిని తుపాకితో కాల్చి చంపాడు. తర్వాత అక్కడనుండి పారిపోయి చిన్న గ్రామంలో తల దాచుకున్నాడు.   

బ్రెజిల్‌ లోని సినోప్‌ నగరంలో మంగళవారం ఈ ఘటన చోటు చేసుకుంది. ఒలివెయిరా అనే వ్యక్తి స్థానికంగా ఉన్న గేమ్ జోన్ లో మరో వ్యక్తితో పందెం వేసి పూల్ గేమ్ ఆడాడు. దాంట్లో ఓడిపోయి 776 డాలర్లు కోల్పోతాడు. అది చూసినవాళ్లంతా ఒలివెయిరాను చూసి నవ్వుతారు. అవమానంలో అక్కడినుంచి వెళ్లిన ఒలివెయిరా.. తన స్నేహితుడు ఇజెక్వియాస్ సాజను, ఒక తుపాకిని వెంట తీసుకొని గేమ్ జోన్ కి వస్తాడు. మళ్లీ ఆ వ్యక్తి దగ్గరకు వెళ్లి తనతో మరొకసారి ఆడమని సవాలు చేస్తాడు. అయితే, రెండవసారి కూడా ఒలివెయిరా ఓడిపోతాడు. దాంతో అక్కడ ఉన్నవాళ్లంతా బిగ్గరగా నవ్వడంతో కోపం ఆపుకోలేకపోయిన ఒలివెయిరా.. తనతో తెచ్చుకున్న గన్ తో షాప్ ఓనర్ సహా అక్కడున్న ఏడుగురిని కాల్చి చంపాడు. దాంట్లో 12 ఏళ్ల అమ్మాయి కూడా ఉంది. తర్వాత తను పోగొట్టుకున్న డబ్బు, షాప్ లో డబ్బుతో పాటు అక్కడే ఉన్న ఓ మహిళ హ్యాండ్ బ్యాగును కూడా ఎత్తుకెళ్లాడు. ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలన్నీ గేమ్ జోన్ సీసీ టీవీ కెమెరాల్లో రికార్డయ్యాయి.