
న్యూఢిల్లీ: వివిధ కారణాలతో సంతానం వద్దనుకునే వారు గర్భనిరోధక మాత్రలు వాడుతుంటారు. ఈ ట్యాబ్లెట్స్ లోని హార్మోన్లు అండంతో శుక్ర కణాలు కలవకుండా అడ్డుపడతాయి. తద్వారా గర్భం రాకుండా చేస్తాయి. అయితే, శరీరంలోని హార్మోన్ వ్యవస్థకు విఘాతం కలిగించే ఈ మాత్రలను తీసుకోవడం వల్ల మహిళలకు రొమ్ము క్యాన్సర్ వచ్చే ముప్పు పెరుగుతుందని బ్రిటన్లోని ఆక్స్ఫర్డ్యూనివర్సిటీ సైంటిస్టులు హెచ్చరించారు. స్టడీలో భాగంగా గత15 ఏళ్లలో పలుమార్లు గర్భనిరోధక మాత్రలు వినియోగించిన దాదాపు లక్ష మంది హెల్త్ రిపోర్టులను సేకరించి విశ్లేషించారు. అందులో 16 నుంచి 19 ఏళ్ల వయసున్న ప్రతీ లక్ష మంది యువతులలో 8 మందికి, 35 నుంచి 39 ఏళ్లున్న మహిళల్లో 265 మందికి రొమ్ము క్యాన్సర్ వచ్చిందని గుర్తించారు. 1996–2017 మధ్యకాలంలో రొమ్ము క్యాన్సర్ నిర్ధారణ అయిన 18,171 మంది మహిళల్లో 39% మంది గర్భ నిరోధక మాత్రలను వినియోగించారని స్టడీలో తేలిందన్నారు. ఈ వివరాలతో కూడిన స్టడీ రిపోర్ట్ ను ‘పీఎల్వోఎస్ మెడిసిన్’ జర్నల్ తాజాగా ప్రచురించింది.