ఉమ్మడి మెదక్ జిల్లా సంక్షిప్త వార్తలు

ఉమ్మడి మెదక్ జిల్లా సంక్షిప్త వార్తలు

జగిర్యాల మల్లన్న జాతరలో అందోల్​ ఎమ్మెల్యే

మెదక్ (రేగోడ్), వెలుగు: రేగోడు మండల పరిధిలోని జగిర్యాల గ్రామంలో ఆదివారం మల్లన్న జాతర ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరిగాయి. అందోల్ ఎమ్మెల్యే చంటి కాంతి కిరణ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. జాతరలో ఎండ్ల బండిని ఎమ్మెల్యే స్వయంగా తోలి అందరిలో ఉత్సాహాన్ని నింపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజలు సుఖశాంతులతో ఉండాలని మల్లన్న దేవున్ని మొక్కుకున్నానని తెలిపారు. ఆయన వెంట టీఆర్ఎస్ మండల నాయకులు ఉన్నారు.

వైఎస్ఆర్​టీపీలో చేరిన బాపు మలిశెట్టి

నారాయణ ఖేడ్, వెలుగు : ఇటీవల టీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసిన రాష్ట్ర గొర్రెల, మేకల పెంపకం దారుల సంక్షేమ సంఘం అధ్యక్షుడు బాపు మలిశెట్టి వైఎస్​ఆర్​టీపీలో చేరారు. ఆదివారం తన అనుచరులతో కలిసి హైదరాబాద్​లోని లోటస్ పాండ్​లో పార్టీ అధ్యక్షురాలు షర్మిల సమక్షంలో కండువా కప్పుకున్నారు. ఖేడ్ నియోజకవర్గంలో పార్టీ పటిష్టతకోసం కృషి చేయాలని ఆయనకు షర్మిల సూచించారు. కార్యక్రమంలో ఖేడ్ మాజీ మార్కెట్ కమిటీ డైరెక్టర్ గోవింద్ యాదవ్, బోరంచ మాజీ పీఏసీఎస్ చైర్మన్ మల్గొండ, గోందెగామ మాజీ సర్పంచ్ శంకరప్ప, నాయకులు నిరంజప్ప, సుతార్ శంకరప్ప, శివానంద్, సుందర్, జ్ఞాను, బసప్ప  ఉన్నారు. 

తూప్రాన్ లో జోరుగా అక్రమ రిజిస్ట్రేషన్లు!
జిల్లా ఆఫీసర్లకు అందుతున్న ఫిర్యాదులు 

తూప్రాన్, వెలుగు :  మెదక్ జిల్లా తూప్రాన్ సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్ లో అక్రమ రిజిస్ట్రేషన్లు జోరుగా జరుగుతున్నట్లు తెలుస్తోంది. ఇదే విషయమై ఆఫీసర్లపై ఉన్నతాధికారులకు ఫిర్యాదులు అందినట్లు సమాచారం. స్టేట్ గవర్నమెంట్ నిబంధన ప్రకారం మున్సిపాలిటీలో అనుమతులు లేని వెంచర్లలో రిజిస్ట్రేషన్లు చేయకూడదు. కానీ తూప్రాన్​లో ఇందుకు విరుద్ధంగా నడుస్తున్నట్లు తెలుస్తోంది. శ్రీ చైతన్య స్కూల్ ఎదురుగా ఉన్న మూడెకరాల భూమికి సంబంధించి ఎటువంటి అనుమతులు లేవు. ఇందులో రిజిస్ట్రేషన్ చేయకూడదని తూప్రాన్ మున్సిపల్ ఆఫీస్ నుంచి నోటీసులు సైతం పంపించారు. అయితే ఇదే అదనుగా ఓ అధికారి వెంచర్ చేసినవారితో లక్షల రూపాయలు తీసుకొని నిబంధనలు ఉల్లంఘిస్తూ రిజిస్ట్రేషన్ చేస్తున్నారని పలువురు ఆరోపిస్తున్నారు. దీంతోపాటు పట్టణంలోని ప్రాథమిక పాఠశాల వద్దనున్న గ్రామ కంఠం భూమిలో ఒకే ఇంటి నంబర్ పై రెండు వేల గజాలకు పైగా రిజిస్ట్రేషన్ చేయడంపై కూడా అధికారులకు ఫిర్యాదులు అందాయి. ఈ వ్యవహారంలో సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్ లో పనిచేసే ఓ ఆఫీసర్ ఇతర అధికారుల పేర్లు చెప్పి భారీ మొత్తంలో నగదు వసూలు చేసినట్లు ఆరోపణలున్నాయి. ఈ క్రమంలో సర్కారు ఖజానాకు గండి కొడుతున్న వారిపై చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు. 

విచారణ చేపట్టి చర్యలు తీసుకుంటాం

తూప్రాన్ లో ప్లాట్ల రిజిస్ట్రేషన్ల అక్రమాల విషయమై విచారణ చేపడుతాం. అనుమతులు ఉన్నచోటనే ప్రజలు ప్లాట్లను కొనుగోలు చేయాలి. నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించే వారు ఎంతటివారైనా చర్యలు తీసుకునేందుకు వెనుకాడేదిలేదు. 
‌‌రవీందర్  డిస్ట్రిక్ట్​ రిజిస్ట్రార్, ఉమ్మడి మెదక్  జిల్లా

టీఆర్​ఎస్​ ప్రభుత్వ హయాంలోనే అభివృద్ధి

మునిపల్లి, వెలుగు : టీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలోనే గ్రామాలు అభివృద్ధి చెందుతున్నాయని మునిపల్లి జడ్పీటీసీ పైతర మీనాక్షి సాయికుమార్​అన్నారు. మండల పరిధిలోని పెద్ద చెల్మెడ గ్రామంలో ఎస్​డీఎఫ్​ నిధులతో మంజూరైన కురుమ కమ్యూనిటీ భవనంతోపాటు జడ్పీటీసీ నిధులతో బోరుమోటర్, పలు అభివృద్ధి పనులకు ఆమె శంకుస్థాపన చేశారు. కార్యక్రమంలో సర్పంచ్​ ప్రభు, ఎంపీటీసీ రాధాబాయి జోషి, బీసీ సంక్షేమ సంఘం జాతీయ ప్రధాన కార్యదర్శి బీరయ్య,  టీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు పైతర సాయికుమార్,  ఉప సర్పంచ్ శ్రీనివాస్  పాల్గొన్నారు. 

అయ్యప్ప ఆలయ అభివృద్ధికి కృషి చేస్తా
మెదక్ ఎమ్మెల్యే పద్మాదేవేందర్ రెడ్డి

మెదక్/ పాపన్నపేట, వెలుగు:  అయ్యప్ప స్వామి దేవాలయ అభివృద్ధికి కృషి చేస్తానని మెదక్ ఎమ్మెల్యే పద్మ దేవేందర్ రెడ్డి అన్నారు. ఆదివారం  పాపన్నపేటలోని అయ్యప్ప దేవాలయ తృతీయ వార్షికోత్సవానికి ఆమె హాజరయ్యారు. జెండా కృష్ణ గురుస్వామి వేదమంత్రోచ్చారణల మధ్య సంగమేశ్వర గురుస్వామి మహా పడిపూజ నిర్వహించారు. చుట్టుపక్కల గ్రామ ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చారు. భక్తులకు గడిల శేషు శేనారెడ్డి గురుస్వామి అన్నదానం చేశారు. అలాగే మెదక్ పట్టణంలోని అయ్యప్ప స్వామి దేవాలయంలో యువ న్యాయవాది జీవన్ రావు స్వామి ఏర్పాటు చేసిన అయ్యప్ప మహా పడిపూజా మహోత్సవంలో ఆమె పాల్గొన్నారు. ఆమె వెంట మున్సిపల్ చైర్మన్ చంద్రపాల్, మార్కెట్ కమిటీ చైర్మన్ బట్టి జగపతి, వైస్ చైర్మన్ మల్లికార్జున్ గౌడ్, పట్టణ పార్టీ అధ్యక్ష కార్యదర్శులు గంగాధర్, కృష్ణ గౌడ్, రామాయంపేట మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ గంగా నరేందర్, మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ అశోక్, ఆత్మ కమిటీ వైస్ చైర్మన్ వెంకట నారాయణ ఉన్నారు. 

ఏడుపాయలలో భక్తుల కిటకిట 

ఏడుపాయల వన దుర్గా భవానీ మాత ఆలయం ఆదివారం భక్తులతో కిటకిటలాడింది. మంజీరా నదీ పాయలలో స్నానాలు చేసి అమ్మవారిని దర్శనానికి భారీ క్యూ కట్టారు. బోనాలు చేసి, ఓడి బియ్యం పోసి మొక్కులు చెల్లించుకున్నారు. ఆలయ పాలక మండలి చైర్మన్ బాలా గౌడ్, ఈఓ శ్రీనివాస్ భక్తులు ఇబ్బందులు పడకుండా తగిన ఏర్పాట్లు చేశారు. - పాపన్నపేట, వెలుగు