ఉమ్మడి నిజామాబాద్ జిల్లా సంక్షిప్త వార్తలు

ఉమ్మడి నిజామాబాద్ జిల్లా సంక్షిప్త వార్తలు

వీహెచ్‌‌‌‌పీ సభ్యత్వం తీసుకున్న అర్వింద్​

నిజామాబాద్, వెలుగు: నిజామాబాద్ ఎంపీ అర్వింద్ విశ్వహిందూ పరిషత్ సభ్యత్వాన్ని తీసుకున్నారు. బుధవారం విశ్వహిందు పరిషత్ రాష్ట్ర అధ్యక్షుడు సురేందర్‌‌‌‌‌‌‌‌రెడ్డి, కార్యదర్శి పండరీనాథ్ ఎంపీని కలిసి సభ్యత్వాన్ని అందించారు. ‘హిందువునని గర్వించు.. హిందువుగా జీవించు’ అనే సిద్ధాతానికి కట్టుబడి వీహెచ్‌‌‌‌పీ పని చేస్తుందని ఈ సందర్భంగా వారు పేర్కొన్నారు.  

మోతెను మర్చిపోయిన కేసీఆర్

వేల్పూర్, వెలుగు: తెలంగాణ ఉద్యమానికి స్ఫూర్తిగా నిలిచిన మోతె గ్రామాన్ని సీఎం కేసీఆర్ దత్తత తీసుకుని అభివృద్ధి విస్మరించారని బీజేపీ నేత డాక్టర్ మల్లికార్జున్‌‌‌‌రెడ్డి ఆరోపించారు. ఆయన చేపట్టిన ‘జనంతో మనం మహా పాదయాత్ర’ 9వ రోజుకు చేరింది. వేల్పూర్‌‌‌‌ మండలం రామన్నపేట్ గ్రామం నుంచి ప్రారంభమైన యాత్ర కోమన్‌‌‌‌పల్లి, కుకునూర్ వరకు కొనసాగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 2001 నుంచి తెలంగాణ ఉద్యమానికి  మద్దతు తెలిపిన మొదటి గ్రామం మోతె అని గుర్తు చేశారు. మోతెకు రాష్ట్ర సచివాలయంలో ఒక ప్రత్యేక అధికారిని నియమించి, గ్రామాన్ని అభివృద్ధి జరిపిస్తానని చెప్పిన కేసీఆర్ దానిని మర్చిపోయారన్నారు. ఆడబిడ్డలకు ఇచ్చిన బతుకమ్మ చీరల కొనుగోళ్లలో కూడా అవకతవకలు జరగాయని ఆరోపించారు. కార్యక్రమంలో బాల్కొండ అసెంబ్లీ కన్వీనర్ మల్కన్నగారి మోహన్, జిల్లా ఉపాధ్యక్షుడు నిమ్మల శ్రీనివాస్, వెల్పూర్‌‌‌‌ మండల అధ్యక్షుడు ఎలెటి రమేశ్‌‌‌‌రెడ్డి పాల్గొన్నారు.

ప్రభుత్వ ఉద్యోగులకు రక్షణ కరవు

నిజామాబాద్, వెలుగు: టీఆర్ఎస్ పాలనలో ప్రభుత్వ ఉద్యోగులకు రక్షణ కరువైందని కాంగ్రెస్​ ఎస్టీ సెల్‌‌‌‌ నగర అధ్యక్షుడు సుభాష్​జాదవ్ అన్నారు. బుధవారం పార్టీ ఆఫీస్‌‌‌‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చాక ప్రభుత్వ ఉద్యోగులపైన దాడులు పెరిగిపోతున్నాయని, వీటిని నివారించడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని విమర్శించారు. అటవీ శాఖ అధికారులకు రక్షణ పెంచాలని, వారికి ఆయుధాలు అందించాలని డిమాండ్ చేశారు. సమవేశంలో నాయకులు రమేశ్‌‌‌‌నాయక్‌‌‌‌, జీవన్‌‌‌‌నాయక్‌‌‌‌ పాల్గొన్నారు.

యువకులకు హెల్మెట్ల పంపిణీ

బోధన్​, వెలుగు: పట్టణంలోని 16వ వార్డుకు చెందిన యువకులు, నాయకులకు కరుణన్న యువసేన ఆధ్వర్యంలో ఉచితంగా హెల్మెట్లు పంపిణీ చేశారు. ఈ సందర్బంగా  మాజీ ఎంపీపీ భాస్కర్‌‌‌‌‌‌‌‌రాజ్‌‌‌‌ మాట్లాడుతూ యువకులు వాహనం నడిపే సమయంలో విధిగా హెల్మెట్‌‌‌‌ ధరించాలని సూచించారు. కాంగ్రెస్ సీనియర్ నేత కెప్టెన్ కరుణాకర్‌‌‌‌‌‌‌‌రెడ్డి సహకారంతో బోధన్, బోధన్ టౌన్, ఎడపల్లి, రెంజల్, నవీపేట్ మండలాల్లో ఈ హెల్మెట్ల పంపిణీ కార్యక్రమం చేపట్టినట్టు చెప్పారు. కార్యక్రమంలో కాంగ్రెస్ మాజీ కౌన్సిలర్ ఫాయాజొద్దీన్, నాయకులు లొల్లి పర్వయ్య, ఖాజా ఖలీల్ ఉల్లా, రాజేశ్వర్ పటేల్, యాసీన్ బేడ్, మోసిన్, పిట్ట అబ్బయ్య, గంగాధర్, రాము ఉన్నారు. 

అటవీ శాఖ ఫిర్యాదులపై వెంటనే స్పందించాలి
నిజామాబాద్ కలెక్టర్ నారాయణరెడ్డి

నిజామాబాద్, వెలుగు: అటవీ భూములకు సంబంధించిన ఫిర్యాదులపై వెంటనే స్పందించి తగిన చర్యలు తీసుకోవాలని కలెక్టర్ సి.నారాయణరెడ్డి సంబంధిత అధికారులను ఆదేశించారు. బుధవారం ఆయన సెల్ కాన్ఫరెన్స్ ద్వారా  పోలీస్, రెవెన్యూ, ఫారెస్ట్ శాఖల అధికారులతో సమీక్ష జరిపారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఘటనను తెలియజేస్తూ ఈ తరహా ఉదంతాలకు తావులేకుండా ముందస్తుగానే పకడ్బందీగా వ్యవహరించాలని ఆఫీసర్లకు సూచించారు. ముఖ్యంగా అటవీ సంబంధిత అంశాలపై మౌఖికంగా కానీ, రాతపూర్వకంగా కానీ ఫిర్యాదు అందిన వెంటనే చర్యలు తీసుకోవాలన్నారు. పోలీసు, రెవెన్యూ, అటవీ శాఖల అధికారులు సమన్వయంతో టీమ్ వర్కుగా పని చేయాలన్నారు. అటవీ భూముల సంరక్షణకు అత్యంత ప్రాధాన్యం ఇవ్వాలని, ఈ విషయంలో ప్రభుత్వం సీరియస్‌‌‌‌గా ఉందన్నారు. పోడు భూముల అంశం అతి సున్నితమైనందున ఎంతో జాగ్రత్తగా వ్యవహరించాలన్నారు. ప్రభుత్వ నిబంధనలను అనుసరిస్తూ అర్హులైన వారికి పోడు పట్టాలు అందించి, హద్దులు చూపించేంత వరకు ఎవరు కూడా అటవీ భూములను ఆధీనంలోకి తీసుకోకుండా గట్టి చర్యలు చేపట్టాలని కలెక్టర్ ఆదేశించారు. సెల్ కాన్ఫరెన్స్‌‌‌‌లో సీపీ కేఆర్.నాగరాజు, డీఎఫ్‌‌‌‌వో వికాస్ మీనా, ఆర్డీవోలు, ఎఫ్‌‌‌‌డీవోలు, రేంజ్ అధికారులు పాల్గొన్నారు. 

వ్యక్తిగత విమర్శలు చేస్తే ఊరుకోం.. 
ఎల్లారెడ్డి ఎమ్మెల్యే సురేందర్​

కామారెడ్డి, వెలుగు: ‘కేసీఆర్‌‌‌‌‌‌‌‌ను కానీ, కేసీఆర్​కుటుంబ సభ్యులనుగానీ వ్యక్తిగతంగా విమర్శిస్తే టీఆర్‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌ కార్యకర్తలు ఊరుకోరని.. తిరబడతరు.. తెగబడి దాడులు చేస్తారు.. మొన్న ఎంపీ ధర్మపురి అర్వింద్ ఇంటిపై జరిగింది గుర్తుంది.. కదా..’ అంటూ ఎల్లారెడ్డి ఎమ్మెల్యే జాజాల సురేందర్ ​ప్రతిపక్షాలను హెచ్చరించారు. బుధవారం తాండూర్‌‌‌‌‌‌‌‌లోని జరిగిన టీఆర్ఎస్ కార్యకర్తల ఆత్మీయ సమ్మేళనంలో ఎమ్మెల్యే ప్రతిపక్షాలపై ఘాటుగా స్పందించారు. రాజకీయంగా విమర్శలు చేయొచ్చు.. కానీ వ్యక్తిగత విమర్శలు చేస్తే ఊరుకోమన్నారు. అర్వింద్ ఇంటిపై దాడి చేస్తే బీసీలపై దాడి అనడం సిగ్గు చేటన్నారు. అర్వింద్​ బీసీల ఆత్మగౌరవాన్ని తాకట్టుపెట్టారన్నారు. దాడి జరిగితే కానీ ఆయనకు బీసీలు గుర్తుకు రాలేదా..? అని ప్రశ్నించారు. 

గుడి, బడిని పరిశీలించిన ఎమ్మెల్యే

మాక్లూర్, వెలుగు: మండల కేంద్రంలో కొత్తగా నిర్మిస్తున్న బడి, గుడిని అర్బన్ ఎమ్మెల్యే బిగాల గణేశ్‌‌‌‌గుప్తా బుధవారం పరిశీలించారు. జడ్పీహెచ్ఎస్ నిర్మాణానికి రూ.4.70 కోట్ల మంజూరు చేయగా ఎమ్మెల్యేతో పాటు ఆయన సోదరుడు మహేశ్‌‌‌‌ గుప్తా మరో కోటి రూపాయలు భవన నిర్మాణానికి వెచ్చిస్తున్నారు. కోటి రూపాయల వ్యయంతో నిర్మిస్తున్న శ్రీరామాలయానికి బ్యాలెన్స్ నిధులు కామన్ గుడ్‌‌‌‌ఫండ్స్‌‌‌‌ నుంచి ఎమ్మెల్యే మంజూరు చేయించారు. రెండు నెలల్లో గుడి పనులు పూర్తి చేయాలని కాంట్రాక్టర్ శంకర్‌‌‌‌‌‌‌‌కు సూచించారు. ఆయన వెంట సర్పంచ్ అశోక్, లక్ష్మీనారాయణ, రాజ్​మల్లయ్య, రాజేందర్ ఉన్నారు.

మోపాల్‌‌‌‌ పీఎస్‌‌‌‌ను చెక్‌‌‌‌ చేసిన ఏసీపీ

నిజామాబాద్ రూరల్, వెలుగు: మోపాల్ మండల కేంద్రంలోని పోలీస్ స్టేషన్‌‌‌‌ను ఏసీపీ వెంకటేశ్వర్లు తనిఖీ చేశారు. వార్షిక తనిఖీల్లో భాగంగా బుధవారం పీఎస్‌‌‌‌కు వచ్చిన ఏసీపీ పోలీస్ స్టేషన్ ఆవరణ, సిబ్బంది, లాకప్ గదులను పరిశీలించారు. అనంతరం సిబ్బంది,   ఫిర్యాదుదారులతో మాట్లాడి పలు వివరాలు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా పోలీస్ స్టేషన్‌‌‌‌లో కొత్తగా ఏర్పాటు చేసిన మహిళ సెల్ కార్యాలయాన్ని ప్రారంభించడంతో పాటు పీఎస్‌‌‌‌ ఆవరణలో మొక్కలు నాటారు. కార్యక్రమంలో సీఐ నరేశ్‌‌‌‌, ఇతర సిబ్బంది పాల్గొన్నారు.

ఎన్ఈపీని వ్యతిరేకించాలి

డిచ్‌‌‌‌పల్లి, వెలుగు: ఎన్ఈపీ (నేషనల్ ఎడ్యూకేషన్ పాలసీ)ని ప్రగతిశీల శక్తులు అందరూ ఏకమై వ్యతిరేకించాలని అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ పున్నయ్య పిలుపునిచ్చారు. టీయూలో బుధవారం జరిగిన పీడీఎస్‌‌‌‌యూ మహాసభలను వర్సిటీ ప్రెసిడెంట్ జన్నారపు రాజేశ్వర్ జెండా ఎగరేసి ప్రారంభించారు. ఈ సభలకు ముఖ్య వక్తగా హజరైన పున్నయ్య మాట్లాడుతూ ఎన్ఈపీలో సాంకేతికమైన నాలెడ్జ్ కాకుండా వృత్తి విద్యా కోర్సులు, సర్టిఫికెట్‌‌‌‌ కోర్సులు ప్రవేశపెడుతున్నారన్నారు. మతాన్ని విద్యారంగంతో జోడిస్తున్నారని, వర్సిటీల్లో అశాస్త్రీయమైన కోర్సులు ప్రవేశపెడుతున్నారని పేర్కొన్నారు. విద్యారంగానికి సరిపడా నిధులను కేటాయించడంలో ప్రభుత్వాలు నిర్లక్ష్యం వహిస్తున్నాయని అసిస్టెంట్ ప్రొఫెసర్ సరిత ఆరోపించారు. కార్యక్రమంలో డాక్టర్ దత్తహరి, వర్సిటీ సెక్రటరీ సంతోశ్‌‌‌‌, లీడర్లు ప్రసాద్, రవీందర్, అక్షయ్ పాల్గొన్నారు.

29, 30న టీయూలో నేషనల్ సెమినార్

డిచ్‌‌‌‌పల్లి, వెలుగు: తెలంగాణ యూనివర్సిటీలోని కెమిస్ట్రీ డిపార్ట్‌‌‌‌మెంట్‌‌‌‌ ఆధ్వర్యంలో ఈనెల 29, 30వ తేదీల్లో ‘బయో ఆర్గానిక్ అండ్ మెడిసినల్ కెమిస్ట్రీ’ అనే అంశంపై నేషనల్ సెమినర్ నిర్వహిస్తున్నట్లు వీసీ రవీందర్‌‌‌‌‌‌‌‌ గుప్తా తెలిపారు. బుధవారం ఇందుకు సంబంధించిన బ్రోచర్‌‌‌‌‌‌‌‌ను ఆయన ఆవిష్కరించారు. కెమిస్ట్రీ హెచ్‌‌‌‌వోడీ బాలకిషన్, రిజిస్ట్రార్ విద్యావర్ధిని, ప్రొఫెసర్లు నాగరాజు, సాయిలు, ఆంజనేయులు పాల్గొన్నారు.

కొనుగోళ్లు త్వరగా కంప్లీట్‌‌‌‌ చేయండి

పిట్లం,వెలుగు: మండలంలోని ధాన్యం కొనుగోలు కేంద్రాలను అడిషనల్‌‌‌‌ కలెక్టర్ చంద్రశేఖర్​బుధవారం తనిఖీ చేశారు. మండలంలోని రాంపూర్,​ పిట్లం, తిమ్మానగర్‌‌‌‌ సెంటర్లతో పాటు స్థానిక రైస్​మిల్లులను చెక్‌‌‌‌ చేశారు. పిట్లంలో వడ్ల కాంటాయినా లారీలు లేక బస్తాలు తరలింపులో జాప్యం జరుగుతుందని చిల్లర్గి సొసైటీ చైర్మన్‌‌‌‌ శపథంరెడ్డి అడిషనల్‌‌‌‌ కలెక్టర్‌‌‌‌‌‌‌‌ దృష్టికి తీసుకెళ్లారు. దీంతో స్పందించిన ఆయన ట్రాన్స్‌‌‌‌పోర్ట్ కాంట్రాక్టర్‌‌‌‌‌‌‌‌కు ఫోన్ చేసి తూకం అయిన ధాన్యం బస్తాలను వెంటనే రైస్ మిల్లులకు తరలించాలని ఆదేశించారు. కొనుగోళ్లు సాధ్యమైనంత తొందరగా పూర్తి చేసి వడ్లను మిల్లులకు తరలించాని తహసీల్దార్ రామ్మోహన్‌‌‌‌ను ఆదేశించారు. ఆయన వెంట డీఎస్‌‌‌‌వో వసంత, చిల్లర్గి సొసైటీ సీఈవో సంతోష్‌‌‌‌రెడ్డి ఉన్నారు.

నిజాంసాగర్: మండలంలోని వడ్ల కొనుగోలు కేంద్రాలను అడిషనల్‌‌‌‌ కలెక్టర్ చంద్రమోహన్, డీఎస్‌‌‌‌వో పద్మ బుధవారం పరిశీలించారు. మిల్లర్ల నుంచి ట్రక్ షీట్లను వెంటనే ట్యాబ్‌‌‌‌లో ఎంట్రీ చేయాలని సంబంధిత అధికారులకు ఆదేశించారు. ఇబ్బందులు ఉంటే తమ దృష్టికి తేవాలన్నారు. వారి వెంట తహశీల్దార్ నారాయణ, ఏఓ అమర్ ప్రసాద్, అచ్చంపేట సొసైటీ చైర్మన్ నర్సింహారెడ్డి, సెక్రటరీ సంగమేశ్వర్ పాల్గొన్నారు.

గల్ఫ్ కార్మికుల సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలి

ఆర్మూర్, వెలుగు: తెలంగాణలో గల్ఫ్ కార్మికుల కోసం ప్రత్యేకంగా సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని తెలంగాణ గల్ఫ్ సమితి (టీజీఎస్) ప్రెసిడెంట్​ఎస్.శంకర్‌‌‌‌‌‌‌‌గౌడ్ డిమాండ్ చేశారు. బుధవారం ఆర్మూర్‌‌‌‌‌‌‌‌లో ప్రవాస భారతీయుల హక్కులు సంక్షేమ వేదిక వ్యవస్థాపక అధ్యక్షుడు కోటపాటి నర్సింహ నాయుడితో కలిసి మీడియాతో మాట్లాడారు. గల్ఫ్ దేశాల్లో మనవాళ్లు 10 లక్షలకు పైగా ఉన్నారని, బతుకుదెరువు కోసం వెళ్లి అష్ట కష్టాలు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వారిని ఆదుకునేందుకు కేరళ, ఆంధ్ర ప్రదేశ్, తమిళనాడు,  పంజాబ్ తరహాలో గల్ఫ్ కార్మికుల సంక్షేమం కోసం రూ.500 కోట్లు కేటాయించి సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలన్నారు. కోవిడ్‌‌‌‌తో చనిపోయిన గల్ఫ్​బాధిత కుటుంబాలకు రూ.5 లక్షల ఎక్స్ గ్రేషియా ఇవ్వాలని డిమాండ్ చేశారు. సమావేశంలో లీగల్ అడ్వయిజర్ ఊరే బాలయ్య పాల్గొన్నారు. 

బీజేపీ కన్వీనర్‌‌‌‌‌‌‌‌కు సన్మానం

నిజామాబాద్ రూరల్, వెలుగు: నిజామాబాద్ రూరల్ నియోజకవర్గం బీజేపీ కన్వీనర్‌‌‌‌‌‌‌‌గా  నియమితులైన పద్మారెడ్డిని ఆ పార్టీ నాయకులు సన్మానించారు. బుధవారం మోపాల్ మండల శాఖ ఆధ్వర్యంలో ఈ అభినందన సభ ఏర్పాటు  చేశారు. నియోజకవర్గంలో బీజేపీని క్షేత్ర స్థాయిలో బలపర్చి వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో  విజయం సాధించేలా కృషి చేయాలని ఈ సందర్భంగా పద్మా రెడ్డి కార్యకర్తలకు పిలుపునిచ్చారు. కార్యక్రమంలో బీజేపీ మండల అధ్యక్షుడు రవి, నాయకులు శ్రీనివాస్, నవీన్ పాల్గొన్నారు. 

భారీ వాహనాలపై చర్యలు తీసుకోవాలి

బోధన్​,వెలుగు: అనుమతి లేకుండా మొరం, ఇసుకను తరలిస్తూ మండలంలోని కొత్తగా వేసిన తారు రోడ్లను ధ్వంసం చేస్తున్న భారీ  వాహనాలపై చర్యలు తీసుకోవాలని బుధవారం వైఎస్సాఆర్‌‌‌‌‌‌‌‌టీపీ బోధన్​ మండల కోఆర్డినేటర్ గౌతమ్‌‌‌‌ ప్రసాద్ కోరారు. ఈ మేరకు బుధవారం ఆర్డీవో ఆఫీసర్‌‌‌‌‌‌‌‌లో ఎంవీఐ యశ్వంత్​కుమార్‌‌‌‌‌‌‌‌కు వినతిపత్రం  అందించారు. రోడ్ల ధ్వంసం  కావడంలో ప్రయాణికులు తీవ్ర  ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందన్నారు. కార్యక్రమంలో వైఎస్సార్​టీపీ మండల అధ్యక్షుడు జగన్, పట్టణ అధ్యక్షుడు సయ్యద్ యూనుస్​ పాల్గొన్నారు.

ఎన్‌‌‌‌సీసీ కేడెట్ల ఏక్తా ర్యాలీ

నిజామాబాద్ రూరల్, వెలుగు: నిజామాబాద్ నగరంలో ఎస్‌‌‌‌సీసీ కేడెట్లు బుధవారం ర్యాలీ నిర్వహించారు. ఏకత, ఐక్యత అనే అంశాలపై ప్రజల్లో అవగాహన కల్పించే లక్ష్యంతో నిర్వహించిన ఈ ర్యాలీ నగరంలోని పులాంగ్ కూడలి నుంచి పాత కలెక్టర్ భవనం వరకు కొనసాగింది. ఈ ర్యాలీలో సుబేదార్​మేజర్ కరంజిత్, జేసీవో అశోక్, విఠల్ పాఠిల్, రాజేంద్రప్రసాద్,బాబురావు పాల్గొన్నారు.