ఇండియాలో టెస్టు సిరీస్ గెలిస్తేనే అసలైన మజా: రోహిత్ సేనకు ఇంగ్లాండ్ హెడ్ కోచ్ ఛాలెంజ్

ఇండియాలో టెస్టు సిరీస్ గెలిస్తేనే అసలైన మజా: రోహిత్ సేనకు ఇంగ్లాండ్ హెడ్ కోచ్ ఛాలెంజ్

టెస్టు క్రికెట్ లో చివరి రెండు సంవత్సరాల నుంచి ఇంగ్లాండ్ బజ్ బాల్ విధానాన్ని అనుసరిస్తుంది. న్యూజిలాండ్ మాజీ బ్యాటర్ మెక్కలం ఇంగ్లాండ్ కోచ్ గా బాధ్యతలు చేపట్టినప్పటి నుండి ఇంగ్లాండ్ టెస్టు స్వరూపాన్నే మార్చేశాడు. ఆడేది టెస్టు క్రికెట్ అయినా దూకుడే మన లక్ష్యం అని తెలియజేశాడు. దీంతో ప్రత్యర్థి ఎవరైనా, వేదిక ఎక్కడైనా బౌలర్ ఎవరైనా ఇంగ్లాండ్ వేగంగా పరుగులు చేస్తూ బౌలర్లపైనా ఒత్తిడి పెంచుతుంది. ఈ క్రమంలో అత్యుత్సాహంలో కొన్ని టెస్టు మ్యాచ్ లు ఓడిపోయినా తమ పంథా మార్చుకోలేదు. 

ప్రస్తుతం ఇంగ్లాండ్.. విండీస్ పర్యటనలో మూడు వన్డేల సిరీస్ ఆడుతుంది. భారత్ తో 5 టెస్టుల సిరీస్ జనవరి 25 నుంచి ప్రారంభం అవుతుంది. భారత్ లో సిరీస్ గెలవడం అంటే దాదాపు అసాధ్యమనే చెప్పాలి. చివరిసారిగా సొంతగడ్డపై ఇంగ్లాండ్ పై 1-2 తేడాతో టెస్టు సిరీస్ ఓడిపోయిన ఇండియా.. ఆ తర్వాత 10 ఏళ్లలో సొంతగడ్డపై ఓటమెరుగని జట్టుగా రికార్డ్ కొనసాగిస్తోంది. మరోవైపు ఇంగ్లాండ్ బజ్ బాల్ ఆటతీరుతో ప్రత్యర్థులకు ముచ్చెమటలు పట్టిస్తుంది. ఈ నేపథ్యంలో భారత్ తో సిరీస్ కోసం ఎదురు చూస్తున్నామని ఇంగ్లాండ్ హెడ్ కోచ్ మెక్కలం చెప్పుకొచ్చాడు.

మెక్కలం మాట్లాడుతూ..  "భారత్‌లో జనవరి నుంచి ఐదు టెస్టులు ఆడబోతున్నాం. భారత జట్టుపై మాకు ఇది భారీ సవాలు. అయితే ఈ సిరీస్ ఆడటం కోసం ఎంతగానో ఎదురు చూస్తున్నాను. ఎందుకంటే వరల్డ్ లో బెస్ట్ జట్టుపై మమ్మల్ని మేము పరీక్షించుకోవడానికి ఇదే మంచి సమయం. భారత్ సొంతగడ్డపై ఎంత ప్రమాదకరమో మాకు తెలుసు. అయినా బజ్ బాల్ ఆట తీరును కొనసాగిస్తాం. మా జట్టుపై నాకు ఎంతో నమ్మకముంది". అని మెక్కలం చెప్పకొచ్చాడు.

ప్రస్తుతం ఆస్ట్రేలియాతో సిరీస్ ముగించుకున్న భారత్..త్వరలో దక్షిణాఫ్రికా పర్యటనకు వెళ్లనుంది. డిసెంబర్ 10 నుంచి ప్రారంభం కానున్న ఈ టూర్ లో మూడు టీ20లు, మూడు వన్డేలు, రెండు టెస్టులు ఆడాల్సి ఉంది. ఈ సిరీస్ అనంతరం జనవరిలో ఆఫ్ఘనిస్తాన్ పై మూడు టీ20లు, ఈ సిరీస్ ముగిసిన తర్వాత ఇంగ్లాండ్ తో 5 టెస్టుల సిరీస్ ప్రారంభమవుతుంది.