
ఈ మధ్యకాలంలో బ్రెస్ట్ క్యాన్సర్ మహిళలకు చాలా పెద్ద సమస్యగా మారింది. ఏటా ఈ క్యాన్సర్ బారిన పడుతున్న మహిళల సంఖ్య పెరుగుతోంది. అయితే కొంచెం ముందుగా దీన్ని గుర్తించగలిగితే పూర్తిగా తగ్గించొచ్చు. ఆ గుర్తించడం ఎలాగన్నదే సమస్య. అయితే దీన్ని చాలా సులభతరం చేశారు కేరళకు చెందిన సైంటిస్ట్ డాక్టర్ ఎ.సీమ. క్యాన్సర్‌ను ముందుగానే పసిగట్టే ‘ఎలక్ట్రానిక్ బ్రా’ను రూపొందించారు. దీనికి గాను ప్రతిష్టాత్మకమైన ‘నారీ శక్తి’ అవార్డు అందుకున్నారామె.
బ్రెస్ట్ క్యాన్సర్‌ను గుర్తించే బ్రా!
డాక్టర్ సీమ కేరళలోని త్రిసూర్‌లో ‘సెంటర్ ఫర్ మెటీరియల్స్ ఫర్ ఎలక్ట్రానిక్స్ టెక్నాలజీ’లో సైంటిస్టు. సుమారు నాలుగేళ్ల పాటు పరిశోధన చేసి బ్రెస్ట్ క్యాన్సర్‌ను గుర్తించే డివైజ్‌కు తుదిరూపం ఇచ్చింది. అందుకు గాను దేశ అత్యున్నత మహిళా పురస్కారమైన నారీ శక్తి అవార్డును అందుకుంది.
వాళ్లకోసమే..
రొమ్ము క్యాన్సర్‌ను గుర్తించాలంటే.. స్క్రీనింగ్ టెస్టుల ద్వారా సాధ్యమవుతుంది. అయితే ఇలాంటి స్క్రీనింగ్ పద్ధతులు రూరల్ ప్రాంతాల మహిళలకు అందుబాటులో ఉండవు. అలాంటి వారికోసమే ప్రత్యేకించి ఈ డివైజ్ రూపొందించా నంటోంది డాక్టర్ సీమా.
ఉష్ణోగ్రతను బట్టి..
ఈ డివైస్ చూడడానికి స్పోర్ట్స్ బ్రా మాదిరిగా ఉంటుంది. శరీర ఉష్ణోగ్రత ఆధారంగా బ్రెస్ట్ క్యాన్సర్‌ను ముందుగానే పసిగట్టేస్తుంది. ఇందులో ఉండే సెన్సర్‌ను కంప్యూటర్‌కు కనెక్ట్ చేస్తారు. ఈ డివైస్‌ను పదిహేను నుంచి ముప్పై నిముషాలు ధరిస్తే చాలు. అందులో ఉండే థర్మల్ సెన్సర్లు ఉష్ణోగ్రతను గ్రహిస్తాయి. దానికి సంబంధించిన ఒక 2డి ఇమేజ్‌ను ప్రిపేర్ చేస్తాయి. ఆ ఇమేజ్‌ను బట్టి క్యాన్సర్ సూచనలు ఉన్నాయా లేదా అనేది తెలుసుకోవచ్చు. ఇప్పటి వరకూ 120 మందికి పరీక్షలు నిర్వహించారు. ఈ డివైజ్‌ను ఎక్కడికైనా సులభంగా తీసుకెళ్లొచ్చు. ఏ వయసు వారైనా దీని ద్వారా వైద్యపరీక్షలు చేయించుకోవచ్చు. రేడియేషన్, నొప్పి అనే భయాలు కూడా అవసరం లేదు. దీని ధర సుమారు రూ.200 నుంచి 500 వరకు ఉంటుంది.
ఎంతో కష్టంతో…
తన నాలుగేళ్ల శ్రమ గురించి మాట్లాడుతూ.. ‘‘దీన్ని తయారు చేయడానికి ఎంతో కష్టపడాల్సి వచ్చింది. ఈ డివైజ్ కేవలం బ్రెస్ట్‌లో వచ్చే ఉష్ణోగ్రతా మార్పులను బట్టి మాత్రమే క్యాన్సర్‌ను గుర్తిస్తుంది. చాలామందిలో శరీర తీరు, నివసించే ప్రదేశాన్ని బట్టి, రుతుసమయాల్లో బాడీ టెంపరేచర్ విపరీతంగా మారిపోతుంటుంది. అయితే ఇందులో ఏది సాధారణంగా పెరిగిన ఉష్ణోగ్రతో, ఏది క్యాన్సర్ వల్ల పెరిగిన ఉష్ణోగ్రతో నిర్ణయించడం కష్టతరమైన పని. దానికోసం ఉష్ణోగ్రతా నమూనాను కచ్చితంగా నమోదు చేసేలా డివైజ్ తయారు చేయాల్సి ఉంటుంది.
దీన్ని తయారు చేయడం ఒక ఎత్తైతే.. దీని వాడేలా చేయడానికి చాలా కష్టపడాల్సి వచ్చింది. ముఖ్యంగా గ్రామాల్లోని మహిళలను దీన్ని ధరించేందుకు ఒప్పించడానికి చాలా సమయం పట్టింది. మొదటగా ఆశా వర్కర్ల ద్వారా పల్లెల్లోని మహిళకు బ్రెస్ట్ క్యాన్సర్ గురించి అవగాహనా సదస్సులు ఏర్పాటు చేశాం. తర్వాత ప్రతీ ఒక్కరూ టెస్ట్ చేయించుకునేలా క్యాంపులు ఏర్పాటు చేశాం. ఇప్పటికీ కొన్ని ప్రాంతాల్లో ఈ డివైజ్‌ను ధరించడానికి భయపడుతున్నారు. అలాంటి వాళ్లకు మరింత అవగాహన కలిగించి అందరూ ఈ డివైస్‌ని ఉపయోగించేలా ప్రోత్సహించాలి.
ఆ సంతోషమే ఎక్కువ
ఈ అవార్డ్ వస్తుందని ఊహించలేదు. దేశం మమ్మల్ని గుర్తించినందుకు చాలా సంతోషంగా ఉంది. ఒక సైంటిస్టుగా నేను ఒక కొత్త వస్తువుని తయారు చేసిన దానికంటే అది సమాజానికి ఉపయోగపడుతున్నందుకు ఎక్కువ సంతోషంగా ఉంది. సీ– మెట్ ఒక ప్రభుత్వ సంస్థ. మేము చేసే ప్రతీ ప్రయోగం ప్రజల డబ్బుతో చేసేదే అందువల్ల దాని ప్రయోజనం కూడా ప్రజలకు ఉపయోగపడేలా ఉండాలని నేను నమ్ముతాను’’ అంటోంది సీమ.