సన్ రైజర్స్ హైదరాబాద్ టీమ్లో కీలక మార్పులు

సన్ రైజర్స్ హైదరాబాద్ టీమ్లో కీలక మార్పులు

2022 ఐపీఎల్లో చెత్త ప్రదర్శనతో  ఇంటా బయట విమర్శలెదుర్కొన్న సన్ రైజర్స్ హైదరాబాద్..కఠిన నిర్ణయాలు తీసుకుంటూ జట్టులో కీలక మార్పులు చేస్తోంది. 2023 సీజన్ ఆరంభం కావడానికి మరో 6 నెలలు సమయం ఉన్న నేపథ్యంలో..దిద్దుబాటు చర్యలకు దిగింది. ఇందులో భాగంగా జట్టుకు కొత్త కోచ్ను నియమించింది. వెస్టిండీస్‌  లెజెండరీ బ్యాట్స్ మన్  బ్రియాన్ లారా‌ను హెడ్ కోచ్‌గా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.  ఐపీఎల్ 2022 సీజన్‌లో సన్‌రైజర్స్‌‌‌కు వ్యూహాత్మక సలహాదారుగా, బ్యాటింగ్ కోచ్‌గా పని చేసిన లారాను..పూర్తి స్థాయి కోచ్గా ఎంపిక చేసింది. 

టామ్ మూడీకి టాటా...
ఇన్నాళ్లు సన్ రైజర్స్ హైదరాబాద్ కోచ్గా పనిచేసిన టామ్ మూడీకి యాజమాన్యం గుడ్ బై చెప్పింది.  ఆయన కాంట్రాక్ట్‌ను పొడిగించకూడదని సన్‌రైజర్స్ హైదరాబాద్‌ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ కావ్యా మారన్ నిర్ణయించారు. మూడీ తమ జట్టుతో కొనసాగబోరని తేల్చి చెప్పారు. మూడీతో మాట్లాడాకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు సన్‌రైజర్స్ మేనేజ్‌మెంట్ వెల్లడించింది. కాంట్రాక్ట్ పొడిగించవద్దంటూ టామ్ మూడీకి సంకేతాలను పంపించిన కొన్ని గంటల్లోనే బ్రియన్ లారాను కోచ్గా నియమించింది.  ఇప్పటికే రెండు సార్లు  టామ్ మూడీ కాంట్రాక్ట్‌ను పొడిగించింది. 

డెసర్ట్ వైపర్స్ డైరెక్టర్‌గా మూడీ..
2023 జనవరిలో UAE ఇంటర్నేషనల్ లీగ్ ట్వంటీ20కి చెందిన డెసర్ట్ వైపర్స్‌ టీమ్‌ డైరెక్టర్‌గా టామ్ మూడీ అపాయింట్ అయ్యారు. దీంతో సన్ రైజర్స్ కోచ్గా పదవికి గుడ్ బై చెప్పడానికి ఇది కూడా ఓ కారణమని తెలుస్తోంది.  ఐపీఎల్, ఐఎల్టీకి ఒకేసారి సేవలను అందించడంలో ఇబ్బందులు వస్తాయనే ఉద్దేశంతో టామ్ మూడీకి వీడ్కోలు పలకాలని సన్‌రైజర్స్ మేనేజ్‌మెంట్ భావించింది. అందుకే కాంట్రాక్ట్ పొడిగించలేదని సమాచారం. 

2016లో SRHకు టైటిల్
ఆస్ట్రేలియాకు చెందిన టామ్ మూడీ.. రెండుసార్లు SRHకు హెడ్ కోచ్‌గా పనిచేశారు. మూడీ హయాంలో సన్ రైజర్స్ 9 ఐపీఎల్ సీజన్లు ఆడింది. ఇందులో అయిదుసార్లు ప్లేఆఫ్స్‌కు చేరుకుంది. 2016లో టైటిల్‌ను కూడా గెలుచుకోవడం విశేషం. అయితే 2019లో గ్లోబల్ T20 కెనడాలో మాంట్రియల్ టైగర్స్‌కు సేవలందించాలనే ఉద్దేశంతో మూడీ సన్‌రైజర్స్‌కు దూరం అయ్యాడు. అప్పట్లో ఆయన స్థానాన్ని ట్రెవర్ బేలిస్ భర్తీ చేశారు. ఆ తర్వాత 2021 ఐపీఎల్ సీజన్‌లో రీఎంట్రీ ఇచ్చాడు. 2021 తర్వాత సన్ రైజర్స్ ఆటతీరు సరిగా లేదు.  మొత్తంగా 28 మ్యాచ్‌లు ఆడితే 9 మ్యాచుల్లో మాత్రమే గెలిచింది. 18 మ్యాచ్‌లల్లో ఓడిపోయింది. 2021, 2022 సీజన్లల్లో అయితే దారుణంగా విఫలమైందని చెప్పాలి. 2021లో మూడు మ్యాచుల్లో మాత్రమే గెలిచింది. 2022లో  ఆరింట్లో గెలిచి.. ఎనిమిదో స్థానంతో సరిపెట్టుకుంది.