డాలర్​కి సవాలు విసరనున్న బ్రిక్స్​

డాలర్​కి సవాలు విసరనున్న బ్రిక్స్​

బిజినెస్ డెస్క్, వెలుగు: డాలర్​ విలువ ఆగకుండా పెరగడం చాలా దేశాలకు ఇబ్బందులు కలిగిస్తోంది. ఆఫ్రికాలోని నైజీరియా వంటి దేశాలతోపాటు, ఆసియాలోని చైనా, ఇండియాలకూ చిక్కులు తప్పడం లేదు. డాలర్​కు ఆల్టర్నేటివ్​  తేవాలని చాలా కాలం నుంచి ప్రయత్నాలు సాగుతున్నా అవి సక్సెస్​ కాలేదు. ఈ నేపథ్యంలో త్వరలో దక్షిణాఫ్రికాలోని జోహాన్స్​బర్గ్​లో జరగనున్న బ్రిక్స్​ దేశాల మీటింగ్ ​ డాలర్​ అధిపత్యానికి తెరదించడంపై ఫోకస్​ పెట్టనుంది. 

గ్లోబల్​ ఫైనాన్షియల్​ సిస్టమ్​లో అత్యంత బలమైనదిగా అమెరికా డాలర్​ ఎదిగిపోయింది. పర్యవసానంగా ఎగుమతులు, దిగుమతులు, అప్పులలో  వస్తున్న సమస్యలతో చాలా దేశాలు మరీ ముఖ్యంగా ఎమర్జింగ్​  దేశాలు  బాగా  విసిగిపోయాయి. బ్రిక్స్​ దేశాలు  బ్రెజిల్​, రష్యా, ఇండియా,  చైనా, సౌత్​ ఆఫ్రికాలు త్వరలో సమావేశమవుతున్నాయి. గతంలో ఎన్నో సవాళ్లు ఎదురయినా తట్టుకుని నిలబడినా డాలర్​ బ్రిక్స్​ దేశాల తాజా  సవాలును కూడా తట్టుకుంటుందా లేక తలొగ్గుతుందా అనేది ఆసక్తికరం.


అమెరికా వైఖరి నచ్చక..

తమ సొంత కరెన్సీ తేవాలని బ్రిక్స్​ దేశాలు గత కొన్నేళ్ల నుంచి డిస్కస్​ చేస్తున్నాయి. కానీ, అది కార్యరూపంలోకి వచ్చేలా చొరవ మాత్రం ప్రదర్శించలేదు. డాలర్​ను పక్కకినెట్టి నేరుగా ఆయా దేశాల కరెన్సీలోనే బిజినెస్​ చేయాలని ఎమర్జింగ్​ దేశాలు ప్రయత్నాలు సాగిస్తున్నాయి. డాలర్​కి ఆల్టర్నేటివ్​ కరెన్సీ తేవాలనే ఆయా దేశాల చొరవ మంగళవారం నుంచి జోహాన్స్​బర్గ్​లో జరిగే సమావేశంలోనైనా ఒక కొలిక్కి రావాలని ఆశిస్తున్నారు. 


ఈ ఏడాది జూన్​లో జరిగిన బ్రిక్స్​ ఫారిన్​ మినిస్టర్ల సమావేశంలో డాలర్​కు ప్రత్యామ్నాయం కావాల్సిందేనని సౌత్​ ఆఫ్రికా ప్రతినిధి నలేడి పండోర్​ చెప్పారు. బ్రిక్స్​ దేశాలు ఏర్పాటు చేసుకున్న న్యూ డెవలప్​మెంట్​ బ్యాంక్​ ఈ దిశలో పనిచేయాలని ఆయన పిలుపు ఇచ్చారు. గ్లోబల్​ ఫైనాన్షియల్​ సిస్టమ్​లో డాలర్​కు చెక్​  చెప్పాలని రష్యా, చైనాలు ఎప్పటి నుంచో కలలు కంటున్నాయి. ఆ దేశాల మంత్రులు ఇద్దరి పక్కన కూర్చుని  సౌత్​ ఆఫ్రికా మంత్రి పై వ్యాఖ్యలు చేశారు. 
బ్రిక్స్​ ఏర్పాటు 2009లో జరిగింది. మొదట్లో అది బ్రిక్​ మాత్రమే. ఈ పదాన్ని గోల్డ్​మన్​ శాచ్స్​ ఎకనమిస్ట్​ జిమ్​ఓ నీల్​ కాయిన్​ చేశారు. ఎదుగుతున్న దేశాలుగా పేరొందిన బ్రెజిల్​, రష్యా, ఇండియా, చైనాలు అప్పట్లో ఆ జాబితాలో ఉండేవి. ఆ తర్వాత 2010 లో సౌత్​ ఆఫ్రికా కూడా చేరడంతో చివరి ఎస్​ అక్షరాన్ని చేర్చారు. దీంతో బ్రిక్స్​గా మారింది. సౌదీ అరేబియా, ఇరాన్​, వెనిజులా వంటి 20కి పైగా దేశాలు బ్రిక్స్​లో చేరడానికి ఆసక్తి చూపిస్తున్నాయి.

 
2015 లో బ్రిక్స్​ దేశాలన్నీ కలిసి న్యూ డెవలప్​మెంట్​ బ్యాంకును మొదలెట్టాయి. అమెరికా, యూరోపియన్​ దేశాల నాయకత్వంలో నడిచే ఇంటర్నేషనల్​ మానిటరీ ఫండ్​ (ఐఎంఎఫ్​), వరల్డ్​ బ్యాంకులకి ఆల్టర్నేటివ్​గా న్యూ డెవలప్​మెంట్​ బ్యాంకును తీసుకొచ్చాయి. బ్రిక్స్​ దేశాలు. గ్లోబల్​ఫైనాన్షియల్​ సిస్టమ్​లో డాలర్​కి ఉన్న ఆధిపత్యాన్ని ఆసరాగా తీసుకుని ఏవైనా దేశాలపై ఆంక్షలు విధించడానికి దానిని అనువుగా మలుచుకుంటోంది అమెరికా. 


ఈ అమెరికా వైఖరిపై చాలా దేశాలు తీవ్రమైన అసంతృప్తిని చూపిస్తున్నాయి. అంతేకాదు, డాలర్​లోని హెచ్చు–తగ్గులు తమ దేశాల ఎకానమీలను తలకిందులు చేయగలవనే  ఆందోళననూ వ్యక్తం చేస్తున్నాయి.  డాలర్​పై ఎక్కువగా ఆధారపడుతున్న విషయం మీద నైజీరియా, ఉగాండా, కెన్యా వంటి ఆఫ్రికా దేశాల అధినేతలు గత కొన్నేళ్లుగా విమర్శలను పెంచుతున్నారు. చైనా, అర్జెంటీనా దేశాలతో చేసే వ్యాపారానికి చెల్లింపులు డాలర్​లలో ఎందుకు జరపాలని ఇటీవలే బ్రెజిల్​ ప్రెసిడెంట్​ లూయిజ్​ ఇనాషియో నులా డా సిల్వా గట్టిగా ప్రశ్నించారు.

బ్రిక్స్​ దేశాలన్నీ కలిసి ఒక కామన్​ కరెన్సీ తీసుకొచ్చే ప్రయత్నాలను ముమ్మరం చేయాలని ఆయన పిలుపు ఇచ్చారు. గత కొన్నేళ్లలో చూస్తే అమెరికా డాలర్​ అధిపత్యం గ్లోబల్​ కామర్స్​లో కొద్దిగా తగ్గుతూ వస్తోంది. యూరో, చైనా యువాన్​లను డాలర్​కు ప్రత్యామ్నాయంగా వాడుతున్నారు. యూరో ఇప్పటికీ అమెరికా డాలర్​కు గట్టి సవాలును విసరలేకపోతోంది.