చీర మీద పెండ్లి కొడుకు పెండ్లి పిల్ల

చీర మీద పెండ్లి కొడుకు పెండ్లి పిల్ల

పక్షులు, జంతువులు, పూల కొమ్మల డిజైన్లు ఉన్న చీరలు చూసే ఉంటారు. అయితే, ఇప్పుడు చీర కొంగు మీద పెండ్లికొడుకు, పెండ్లి కూతురు ఫొటోలు ఉన్న చీరలు  కూడా దొరుకుతున్నాయి. పెండ్లి చీర స్పెషల్​గా ఉండాలి అనుకునేవాళ్ల కోసం ఈ కొత్తరకం చీరలు తయారుచేస్తున్నారు కొందరు డిజైనర్లు. ఇవి ఎక్కడ దొరుకుతాయంటే? తమిళనాడులోని సిరుముగాయ్​ సిటీలో. కోయంబత్తూర్ జిల్లా కేంద్రం నుంచి 38 కిలోమీటర్ల దూరంలో ఉంది సిరుముగాయ్. నాణ్యమైన పట్టు బట్టలు, కొత్తరకం పట్టు చీరలకు ఈ ఊరు చాలా పాపులర్. ఇక్కడ 500లకు పైగా చేనేత కార్మికుల కుటుంబాలు ఉంటాయి.  పెండ్లి చీర మీద మనుషుల బొమ్మలు వేయాలనేది ‘సిరిముగాయ్​పుదూర్ శ్రీ రామలింగ సొవదాంబిగాయ్ వీవర్స్’ కో–ఆపరేటివ్ సొసైటీకి అప్పుడు అధ్యక్షుడిగా ఉన్న  ఆర్​. రాధాకృష్ణన్​ ఆలోచన.  ఆయన కాబోయే కొత్త కోడలికి  ఎప్పటికీ గుర్తుండిపోయే చీరని కానుకగా ఇవ్వాలనుకున్నాడు. ఆ పనిని డిజైనర్ ధర్మరాజ్​కి అప్పగించాడు. అయితే.. అప్పటికి క్లాత్ డిజైనింగ్​ కోసం కంప్యూటర్లు ఉపయోగించడం లేదు. దాంతో,  ధర్మరాజు నెల రోజులు కష్టపడి పెండ్లికొడుకు, పెండ్లి కూతురు ఫొటోలను చీర మీద వేశాడు. 

విదేశాల నుంచి ఆర్డర్లు
రాధాకృష్ణన్ కొడుకు పెండ్లికి వచ్చిన అందరూ పెండ్లి కూతురు చీర డిజైన్ చూసి చాలా మెచ్చుకున్నారు. కొందరైతే తమ పిల్లల పెండ్లికి కూడా అలాంటి చీరనే కావాలని అడిగారు. అప్పటి నుంచి చెన్నై, తిరుచ్చి, కన్యాకుమారి, తెలుగు రాష్ట్రాలతో పాటు అమెరికా, సింగపూర్ నుంచి కూడా ఆర్డర్లు వచ్చేవి.  ఈ చీర పేరు ‘మనమక్కల్’. దీన్నే ‘పెండ్లి కూతురు, పెండ్లి కొడుకు చీర’ అని కూడా పిలుస్తారు. డిజైన్​ని బట్టి ఒక్కో చీర ధర 65 వేల రూపాయల నుంచి రెండు లక్షల వరకు ఉంటుంది. 

టొమాటో రంగు శాలువాతో..
సిరిముగాయ్ చేనేతకారుల పనితీరు గురించి అందరికీ తెలిసింది మాత్రం టొమాటో రంగు శాలువాతో. 2009లో చైనా అధ్యక్షుడు జిన్​పింగ్​, ప్రధాని నరేంద్ర మోదీతో కలిసి మహాబలిపురం వచ్చారు. అప్పుడు సిరిముగాయ్​ చేనేత కార్మికులు  నేసిన టొమాటో రంగు శాలువాని మోదీ  ఆయనకు గిఫ్ట్​గా ఇచ్చారు. ఆ శాలువా మీద తన బొమ్మచూసి  జిన్​పింగ్ ఆశ్చర్యపోయాడు.  

గుర్తింపుతో పాటు డబ్బులు
‘‘పెండ్లి చీర మీద తమ ఫొటోలు చూసుకొని మురిసిపోవాలి అనుకుంటున్నారు ఈకాలం పిల్లలు. అందుకని ధర ఎక్కువైనా కూడా ఈ రకం చీరలే కొంటున్నారు. ముందుగా కంప్యూటర్​లో పెండ్లి కూతురు, పెండ్లికొడుకు ఫొటోల్ని బంగారు రంగులో చీర కొంగు మీద డిజైన్ చేస్తాను. తర్వాత వీవర్స్​ చీర నేస్తారు. ఈ కొత్త డిజైన్ చీరలతో చేనేత కార్మికుల శ్రమకు గుర్తింపు లభిస్తోంది. సరిపోను డబ్బులు కూడా వస్తున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది” అంటున్నాడు ధర్మరాజు.