
ఖమ్మం టౌన్, వెలుగు: నాగపూర్–అమరావతి గ్రీన్ ఫీల్డ్ నేషనల్ హైవే అలైన్మెంట్ మార్చాలని డిమాండ్ చేస్తూ నిర్వాసితుల జేఏసీ ఆధ్వర్యంలో శనివారం జిల్లా పరిషత్ ఆఫీస్‌ను రైతులు ముట్టడించారు. ఆల్ పార్టీ, రైతు సంఘాల నేతలు పాల్గొని అధికారుల తీరును ఎండగట్టారు. ఈ సందర్భంగా రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షుడు భాగం హేమంతరావు, సీపీఎం జిల్లా కార్యదర్శి నున్నా నాగేశ్వరరావు, సీపీఐ(ఎంఎల్) ప్రజా పంథా జిల్లా కార్యదర్శి గోకినేపల్లి వెంకటేశ్వరరావు మాట్లాడుతూ ఖమ్మం నగర అభివృద్ధి అడ్డుకొనేలా అలైన్మెంట్ తయారు చేసి రైతులకు, ఇండ్ల స్థలాల యజమానులు నష్టం చేస్తుందని విమర్శించారు.
కోదాడ–కొరివి రోడ్డును అమరావతి–హైదరాబాద్ హైవేకు కలపాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం నిర్వహించిన ప్రజాభిప్రాయ సేకరణలో గ్రీన్ ఫీల్డ్ హైవే నిర్మాణంపై అభ్యంతరాలు వచ్చినా, ఎలాంటి అభ్యంతరాలు రాలేదని అధికారులు కేంద్ర ప్రభుత్వానికి నివేదిక పంపడం సరైంది కాదన్నారు. జిల్లాలోని ప్రజాప్రతినిధులు స్పందించి అలైన్మెంట్ మార్చేందుకు కృషి చేయాలని కోరారు. అనంతరం కలెక్టర్ కు వినతిపత్రం అందజేశారు. అఖిలపక్ష రైతు సంఘాల నాయకులు పోటు ప్రసాద్, మాదినేని రమేశ్, కొండపర్తి గోవిందరావు, ఆవుల వెంకటేశ్వర్లు, ప్రజా సంఘాల నాయకులు ఆవుల అశోక్, దొండపాటి రమేశ్, యెర్రా శ్రీనివాస్, సలాం, మీరా సాహెబ్ ఆందోళనకు మద్ధతు తెలిపారు.
ఆందోళనలో నిర్వాసితుల జేఏసీ నాయకులు తక్కెళ్లపాటి భద్రయ్య, వేములపల్లి సుధీర్, ప్రతాపనేని వెం
కటేశ్వర్లు, మందనపు రవీంద్ర, నాగండ్ల శ్రీధర్, వేముల సతీశ్, వజ్జా రాధాకృష్ణతో పాటు తీర్దాల, మంగళగూడెం, కామంచికల్, రేగులచెలుక, రఘునాథపాలెం, బల్లేపల్లి, వి వెంకటాయపాలెం, వందనం, కోడుమూరు, మీనవోలు, రేమిడిచర్ల, మల్లెమడుగు,తూటికుంట్ల, బ్రాహ్మణపల్లి తదితర గ్రామాల రైతులు
పాల్గొన్నారు.
మంత్రిని కలిసిన జర్నలిస్టులు
ఖమ్మం టౌన్, వెలుగు: టీజేఎఫ్ ఆధ్వర్యంలో జర్నలిస్టులు సోమవారం మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌ను కలిసి ఈ నెల 18న ఖమ్మంలో నిర్వహించనున్న జిల్లా మూడో మహాసభలకు హాజరు కావాలని కోరారు. సంఘం జిల్లా అధ్యక్షుడు ఆకుతోట ఆదినారాయణ మంత్రికి సభ నిర్వహణ, తదితర అంశాలను వివరించారు. జిల్లా ఉపాధ్యక్షుడు వెన్నెబోయిన సాంబశివరావు, చిర్రా రవి, ప్రశాంత్ రెడ్డి, రామకృష్ణ, రమేశ్ బాబు, షేక్ జానీ పాషా, కొరకొప్పుల రాంబాబు, బాలబత్తుల రాఘవ, యలమందల జగదీశ్, అశోక్, రాజు, శ్రీధర్ ఉన్నారు.
వైకుంఠ ఏకాదశి ఏర్పాట్లు కంప్లీట్ చేయాలి
భద్రాద్రికొత్తగూడెం, వెలుగు: వైకుంఠ ఏకాదశికి భద్రాచలంలో హంస వాహనాన్ని సిద్ధం చేయాలని కలెక్టర్ అనుదీప్ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్లో భద్రాచలంలో జరిగే వైకుంఠ ఏకాదశికి సంబంధించిన ఏర్పాట్లపై వివిధ శాఖల అధికారులతో సోమవారం రివ్యూ మీటింగ్ నిర్వహించారు. హంస వాహనాన్ని పరిశీలించి నివేదిక ఇవ్వాలని ఇరిగేషన్ ఈఈని ఆదేశించారు. భక్తులను పరిమిత సంఖ్యలో మాత్రమే అనుమతించాలన్నారు. ఏర్పాట్లను త్వరగా పూర్తి చేయాలని, భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా సౌకర్యాలు కల్పించాలన్నారు.
భద్రాచలం పట్టణాన్ని 15జోన్లుగా, పర్ణశాలను నాలుగు జోన్లుగా విభజించి పారిశుధ్య కార్యక్రమాలు చేపట్టాలని సూచించారు. పార్కింగ్ స్థలాలను ఎంపిక చేయాలని, సబ్‌కలెక్టర్, ఏఎస్పీ ఆఫీసుల్లో కంట్రోల్ రూమ్స్ ఏర్పాటు చేయాలని ఆదేశించారు. అత్యవసర సేవలందించేందుకు హెల్త్ క్యాంప్‌లు ఏర్పాటు చేయాలన్నారు. అడిషనల్ కలెక్టర్ కె వెంకటేశ్వర్లు, ఏఎస్పీ రోహిత్ రాజు, భద్రాచలం ఆలయఈవో శివాజీ, డీపీవో రమాకాత్, డీసీవో వెంకటేశ్వర్లు, డీఎంహెచ్‌వో దయానందస్వామి, డీఆర్వోఅశోక్ చక్రవర్తి పాల్గొన్నారు. అనంతరం వడ్ల కొనుగోళ్లు, మన ఊరు–మన బడి పనులపై వివిధ శాఖల అధికారులతో కలెక్టర్ రివ్యూ నిర్వహించారు.
పనులను త్వరగా చేపట్టాలని అధికారులను ఆదేశించారు. వర్షాలతో వడ్ల కుప్పలు తడవకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. డబుల్ బెడ్రూమ్ ఇండ్ల పనులను స్పీడప్ చేయాలన్నారు. అనంతరం గొత్తికోయల చేతిలో హత్యకు గురైన ఎఫ్ఆర్వో శ్రీనివాసరావు కూతురు కృతికను అభినందించారు. స్టేట్ సబ్ జూనియర్ అథ్లెటిక్స్ చాంపియన్ షిప్ లాంగ్‌జంప్ విభాగంలో గోల్డ్ మెడల్ సాధించడం గర్వకారణమన్నారు. గ్రీవెన్స్‌లో భాగంగా ప్రజల నుంచి దరఖాస్తులు తీసుకున్నారు.
డాక్టర్ నిర్లక్ష్యంతో చూపు కోల్పోయిన చిన్నారి
మధిర, వెలుగు: కంటి డాక్టర్ నిర్లక్ష్యంతో తమ బిడ్డ కంటి చూపు కోల్పోయిందని ఆరోపిస్తూ పేరెంట్స్, బంధువులు సోమవారం పట్టణంలోని రమేశ్‌బాబు కంటి ఆసుపత్రి ఎదుట ఆందోళనకు దిగారు. పేరెంట్స్ కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి.. ఎర్రుపాలెం మండలం కాచవరం గ్రామానికి చెందిన దేవిరాల బ్రహ్మాజీ, కృష్ణ సైదా దంపతుల కూతురు దేవిరాల షర్మిల(10) 5వ తరగతి చదువుతోంది. కొద్ది రోజుల కింద కంటిలో నలుసు పడి ఎర్రబడడంతో ఈ నెల 8న పట్టణంలోని కంటి వైద్యుడిని సంప్రదించారు.
ఇంజక్షన్, మందులు ఇచ్చి తగ్గిపోతుందని చెప్పారని, అయితే కంటి చూపు పూర్తిగా కోల్పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. డాక్టర్ ను అడిగితే నిర్లక్ష్యంగా సమాధానం ఇస్తున్నారని చెప్పారు. ఇదిలా ఉంటే తన వైద్యంలో ఎలాంటి లోపం లేదని డాక్టర్ రమేశ్‌బాబు వివరాణ ఇచ్చారు. ఘటనా స్థలానికి ఎస్ఐ సతీశ్‌కుమార్ చేరుకొని వివరాలు అడిగి తెలుసుకున్నారు.
540 మంది మహిళా అభ్యర్థులు క్వాలిఫై
ఖమ్మం కార్పొరేషన్, వెలుగు: ఫిజికల్ టెస్ట్‌లో 540 మంది మహిళా అభ్యర్ధులు క్వాలిఫై అయినట్లు సీపీ విష్ణు ఎస్ వారియర్ తెలిపారు. నాలుగో రోజు 1144 మందికి గాను, 939 మంది హాజరైనట్లు చెప్పారు. 540 మంది అభ్యర్థులు తుది పరీక్షకు అర్హత సాధించినట్లు ఆయన పేర్కొన్నారు. ఈవెంట్స్‌ను సీసీ కెమెరాల్లో పరిశీలించారు. అభ్యర్థులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఏర్పాట్లు చేసినట్లు సీపీ తెలిపారు.
సాఫ్ట్ వేర్ ఇంజనీర్ హత్య కేసులో నిందితుడి అరెస్ట్
భద్రాద్రికొత్తగూడెం, వెలుగు: టేకులపల్లి మండలం శాంతినగర్‌కు చెందిన అశోక్ హత్య కేసులో నిందితుడు ప్రేమ్‌కుమార్‌ను అరెస్ట్ చేసినట్లు ఇల్లందు డీఎస్పీ రమణమూర్తి తెలిపారు. టేకులపల్లి పోలీస్‌స్టేషన్‌లో సోమవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వివరాలు వెల్లడించారు. గతంలో ప్రేమ్ కుమార్ సోదరితో అశోక్‌కు ప్రేమ వ్యవహారం నడిచిందని తెలిపారు.
ఈ విషయం ఇంట్లో తెలవడంతో ప్రేమ్ కుమార్ అక్కను పెండ్లి చేసుకుంటానని నమ్మించి, మరొకరిని వివాహం చేసుకున్నాడని చెప్పారు. దీంతో అశోక్‌పై కక్ష పెంచుకున్న ప్రేమ్ కుమార్ గతంలో తాను అప్పుగా తీసుకున్న డబ్బులు ఇస్తానని నమ్మించి ముత్యాలంపాడు స్టేజీవద్దకు పిలిపించి హత్య చేసినట్లు తెలిపారు. నిందితుడి నుంచి రాడ్డు, కత్తి స్వాధీనం చేసుకున్నామని చెప్పారు. టేకులపల్లి సీఐ ఇంద్రసేనారెడ్డి, ఎస్సై భుక్యా శ్రీనివాస్ పాల్గొన్నారు.
కార్మికుల వేతనాలు వెంటనే చెల్లించాలి
భద్రాచలం, వెలుగు: గిరిజన కార్మికుల పెండింగ్ వేతనాలు వెంటనే చెల్లించాలని మాజీ ఎంపీ డా. మిడియం బాబూరావు డిమాండ్ చేశారు. వేతన బకాయిలు చెల్లించాలని డిమాండ్ చేస్తూ హాస్టల్ వర్కర్లు ఐటీడీఏ ఎదుట సోమవారం 48 గంటల దీక్షలను చేపట్టగా, వారికి మద్ధతు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గిరిజన ఆశ్రమ పాఠశాలలు, హాస్టల్ డైలీవేజ్, ఔట్ సోర్సింగ్ వర్కర్ల సమస్యను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు.
గిరిజన సంక్షేమానికి పెద్ద పీట వేస్తున్నట్లు చెబుతున్న సర్కారు గిరిజన కార్మికుల సమస్యలు పట్టించుకోవడం లేదన్నారు. ఎమ్మెల్యేలు, మంత్రులు, సీఎం ఒక్క నెల జీతం తీసుకోకుండా ఉండగలరా? అని ప్రశ్నించారు. లేనిపక్షంలో సమ్మె చేస్తామని హెచ్చరించారు. వర్కర్స్ యూనియన్ జిల్లా కార్యదర్శి హీరాలాల్, జలంధర్, సమ్మక్క, స్వరూప, ముత్తయ్య తదితరులు పాల్గొన్నారు.
పుష్యమి వేళ రామయ్యకు పట్టాభిషేకం
భద్రాచలం, వెలుగు: పుష్యమి వేళ శ్రీసీతారామచంద్రస్వామికి సోమవారం పట్టాభిషేకం నిర్వహించారు. శ్రీరామపునర్వసు దీక్షలు విరమించిన అనంతరం నిర్వహించిన పట్టాభిషేక మహోత్సవంలో భక్తులు భారీగా పాల్గొన్నారు. ముందుగా గోదావరి నుంచి తీర్థబిందెను తెచ్చి సుప్రభాతసేవ చేసి బాలబోగం నివేదించారు. తర్వాత మూలవరులకు ముత్యాలు పొదిగిన వస్త్రాలను అలంకరించి ముత్తంగి సేవ చేశారు. లక్ష్మీతాయారు అమ్మవారు, ఆంజనేయస్వామికి కూడా ముత్తంగి సేవ నిర్వహించారు.
కల్యాణమూర్తులను ప్రాకార మండాపానికి తీసుకొచ్చి నిత్య కల్యాణ క్రతువును నిర్వహించాక పట్టాభిషేక ఘట్టం జరిగింది. రామదాసు చేయించిన బంగారు ఆభరణాలను శ్రీసీతారామచంద్రస్వామికి అలంకరించారు. కల్యాణ తంతు ముగిశాక సమస్త నదీజలాలతో ప్రోక్షణ చేసి శ్రీరామచంద్రుడికి గద, కత్తి, కిరీటం అలంకరించి పట్టాభిషిక్తుడిని చేశారు. మాధ్యాహ్నిక ఆరాధనల తర్వాత రాజబోగం నివేదించి సాయంత్రం దర్బారు సేవ చేశారు.